రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని అనుకున్నా ఇబ్బంది లేని పరిస్థితి.. ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చాక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అంతా అనుకూలంగానే కనిపించింది. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అంతా మారిపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్, తదనంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి.. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు ఉండవని తేల్చేసింది.

ముందు ప్రతిపాదనగా అనుకున్నది కాస్తా.. ఇప్పుడు నిర్ణయంగా మారిపోయింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు. దీంతో ఇండస్ట్రీ జనాల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ముఖ్యంగా పెద్ద సినిమాలు తీసే నిర్మాతలకు ఈ నిర్ణయం ఏమాత్రం మింగుడుపడడం లేదు. బన్నీ అరెస్టయి విడుదలయ్యాక అతణ్ని పరామర్శించడానికి పెద్ద ఎత్తున సినీ జనం వరుస కట్టడం, సోషల్ మీడియాలో రేవంత్ మీద జరిగిన దాడి ఒక రకంగా టాలీవుడ్ తమపై తిరుగుబావుటా ఎగురవేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల విషయంలో తీసుకున్న నిర్ణయంతో ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చారు. ఐతే దీని వల్ల భారీ నష్టం వాటిల్లేలా కనిపిస్తుండడంతో ఇండస్ట్రీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి వద్దని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు కోమటి రెడ్డిని కలిసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నారు. ఇండస్ట్రీ ప్రభుత్వానికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, అల్లు అర్జున్ వ్యవహారంతో ముడిపెట్టి బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు ఆపేస్తే చాలా కష్టమని సర్దిచెప్పబోతున్నారట.

ఇండస్ట్రీ వైపు నుంచి ఇకపై ఏ తప్పూ జరగకుండా చూసుకుంటామని, ఇండస్ట్రీపై కరుణ చూపాలని రేవంత్‌కు, కోమటిరెడ్డికి సర్ది చెప్పి ఆయన్ని శాంతింజేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం అగ్ర నిర్మాత దిల్ రాజు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన రాగానే తన నేతృత్వంలో సినీ ప్రతినిధుల బృందం సీఎం, మంత్రిని కలవబోతున్నట్లు సమాచారం.