పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. అంబేద్కర్ పేరు పదే పదే ప్రస్తావించడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయిందని, దాని బదులు ఏదైనా భగవంతుడి పేరు స్మరిస్తే మోక్షం లభిస్తుందని షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే షా వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
అంబేద్కర్ అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని షర్మిల అన్నారు. ఆ వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని ఘోరంగా అవమానించాయని షర్మిల మండిపడ్డారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీల మనోభావాలను షా దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ కుట్ర చేస్తున్నాయని షర్మిల ఆరోపించారు.
మనుస్మృతిని బీజేపీ నమ్ముతోందని, అందుకే ప్రతినిత్యం రాజ్యాంగంపై దాడికి పాల్పడుతోందని ఆరోపించారు. పార్లమెంటుతోపాటు బహిరంగ సభల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను హేళన చేస్తున్నారని , షా తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉంది.