టీడీపీలోకి ఆళ్ల నాని.. ముహూర్తం రెడీ!

వైసీపీ మాజీ నాయ‌కుడు, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజ‌కీయం యూట‌ర్న్ తీసుకుంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాని.. ఇక రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని చెబుతూ. ఎన్నిక‌లు జ‌రిగిన రెండు మాసాల‌కే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇదే స‌మయంలో వైసీపీకి కూడా ఆయ‌న రాజీనామా చేశారు. అయితే.. అనుకున్న‌ట్టుగా అయితే.. ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌లేదు. మ‌ళ్లీ రెండు మాసాలు ముగిసే స‌రికి యూట‌ర్న్ తీసుకున్నారు.

తాజాగా టీడీపీలోకి ఆళ్ల‌నాని ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. బుధ‌వారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్టు నాని వ‌ర్గం చెబుతోంది. దీనిపై టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా మౌనంగా ఉన్నారు. వాస్త‌వానికి గ‌త నెల‌లోనే నాని టీడీపీలోకి వ‌స్తున్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆయ‌న రాలేదు. దీనికి కార‌ణం.. స్థానికంగా ఉన్న టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆళ్ల వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హంతో ఉండ‌డ‌మే. వైసీపీ హ‌యాంలో టీడీపీ నాయ‌కుల‌పై ఆయ‌న కేసులు పెట్టించార‌న్న వాద‌న ఉంది.

దీంతో ఆళ్ల నాని సైకిల్ ఎక్కేందుకు స్థానిక నాయ‌కుల‌తోపాటు.. ఎమ్మెల్యే బ‌డేటి చంటి కూడా.. వ్య‌తిరేకించారు. ఈ క్ర‌మంలో కొన్నాళ్ల‌పాటు ఆళ్ల నాని మౌనంగా ఉన్నారు. ఇక‌, ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు రంగం లోకి దిగి..అందరూ కలిసిమెలిసి పనిచేయాలని, పార్టీ నాయ‌కుల‌కు స‌ర్దిచెప్పార‌ని, పార్టీ తీసుకునే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని ఆయ‌న ఆదేశించారు. దీనికి దాదాపు నాయ‌కులు ఓకే చెప్ప‌డంతో ఇప్పుడు ఆళ్ల నాని టీడీపీ ఎంట్రీకి ఇబ్బందులు లేకుండా పోయాయ‌ని తెలుస్తోంది.

కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆళ్ల నాని వివాద ర‌హితుడుగా వ్య‌వ‌హ‌రించిన మాట వాస్త‌వం, రాష్ట్రంలో క‌రోనా వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌నే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేశార‌ని.. కేంద్రంతో నూ మెప్పు పొందారు. ఆ త‌ర్వాత‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో గాలి క‌లుషిత‌మై..ప‌లువురు మృతి చెందిన ఘ‌ట‌న స‌మ‌యంలోనూ మంత్రిగా ఆళ్ల నాని ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నారు.

అయితే.. రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌.. త‌న సేవ‌ల‌ను గుర్తించ‌కుండా.. జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టి.. విడ‌ద‌ల ర‌జ‌నీకి ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో ఆళ్ల నాని అప్ప‌టి నుంచి వైసీపీపై ముభావంగా ఉన్నారు. తొలుత జ‌న‌సేన లోకి వెళ్లాల‌ని అనుకున్నా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచ‌న‌ల‌తో టీడీపీ వైపు మొగ్గు చూపిన‌ట్టు కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎట్ట‌కేల‌కు ఆళ్ల‌నాని రాజ‌కీయంలో కీల‌క మ‌లుపు అయితే చోటు చేసుకుంటోంది. దీనిని ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి ఎలా తీసుకువెళ్తారో చూడాలి.