బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన పార్టీ పేరును `తెలంగాణ ప్రజా జాగృతి`గా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె పార్టీ పేరును నిర్ణయించారని.. ఈ మేరకు ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే.. ప్రస్తుతం ఉన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దీనిని పెండింగులో పెట్టిందని తెలిసింది.
తెలంగాణ జాగృతి సంస్థ తరఫున కవిత అనేక కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి తరఫున మరింత ఎక్కువగా కష్టపడిన విషయం తెలిసిందే. ప్రజల్లో మమేకమైన ఈ సంస్థ పేరునే ఆమె ఖరారు చేసుకోవడం ద్వారా మరింత పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కాగా.. తండ్రితో విభేదించి.. పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత అజెండాతో పార్టీని ఏర్పాటు చేసుకుంటామన్నారు. ఈ ఏడాది దసరా నాటికి పార్టీని ప్రకటిస్తామన్నారు.
న్యాయ వివాదాలు..
మరోవైపు.. కవిత పార్టీపై న్యాయవివాదాలు ముసురుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆమె సమర్పించిన దరఖాస్తులో కొన్ని లోపాలను గుర్తించి.. వాటిని సరిచేయాలని సూచించారు. అయితే.. తాను సరిగానే దరఖాస్తు చేశానని కవిత చెబుతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ కింద రాజకీయ పార్టీ నమోదు కోసం చేసిన తన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా పరిశీలించేలా చూడాలని కోరుతూ.. ఆమె ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
అయితే.. ఇది ఉద్దేశ పూర్వంగా చేస్తున్న ఆరోపణేనని.. అన్ని పార్టీలు సమర్పించిన దరఖాస్తు మాదిరిగానే తాను కూడా దరఖాస్తు పెట్టుకున్నట్టు కవిత చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు జోక్యాన్ని కోరారు. దీనిని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం కోరింది. దీనిపై ఎన్నికల సంఘం ఇచ్చే సమాధానం.. కవిత చేసే ఆర్గ్యుమెంట్ల ఆధారంగా గుర్తింపుతో పాటు.. పార్టీ పేరును కూడా నిర్ధారించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
