జనసేన నాయకుడు, నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబుకు ఊహించని గౌరవమే దక్కుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలోకి నాగబాబు ప్రవేశించడం ఖాయమైంది. అయితే.. ఇప్పటి వరకు ఉన్న మంత్రులకు… కాబోయే మంత్రిగా నాగబాబుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మాట విరుపు-లౌక్యం.. నాగబాబు సొంతమేనని చెప్పాలి. విషయం ఏదైనా.. నాగబాబు చాలా లౌక్యంగా వ్యవహరిస్తారు. ఆయన చేసే కామెంట్లు కూడా ఆలోచింపజేస్తాయి.
గతంలో మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావుకు మధ్య ఓ చిన్న వివాదం వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై నాగబాబు చేసిన వరుస ట్వీట్లు.. తీవ్ర చర్చకు దారి తీశాయి. తిట్టినట్టే ఉన్నా.. తిట్టనట్టు అనిపించని భాషా ప్రయోగం ఆయన ప్రత్యేకత. వ్యక్తులనే కాదు.. వ్యవస్థపైనా.. నాగబాబు పలు సందర్భాల్లో కామెంట్లు చేశారు. చదువుకున్న లా మహిమో ఏమో తెలియదు కానీ.. సూటిగా సుత్తిలేకుండా.. మాట విరుపు లౌక్యంతో చేసే కామెంట్లు సోషల్ మీడియాను ఆకర్షిస్తుంది.
ఇక, సొంత పార్టీలోనే అసమ్మతి నేతలను తనదైన శైలిలో లైన్లో పెట్టిన ఘనత కూడా నాగబాబు సొంతం. ఎవరినీ నేరుగా తిట్టినట్టు ఉండదు. అలాగని బుజ్జగించినట్టు కూడా.. ఉండదు. ఆ వాక్యంలో అంత బలం ఉంటుంది. అందరూ గప్ చుప్ అయిపోతారు. పిఠాపురంలో వివాదం తలెత్తినప్పుడు.. నాగబాబు.. చేసిన వ్యాఖ్యలతో అందరూ సైలెంట్ అయిపోయారు. ఇలా మాటకారి తనంతో ఆకట్టుకునే మంత్రులు ఇప్పుడు ఒకరిద్దరు తప్ప.. పెద్దగా లేరనే చెప్పాలి.
సబ్జెక్టు పరంగా మాట్లాడేవారు ఉన్నా.. ఆకర్షణీయంగా మాటలకు పదుపు పెట్టేవారు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు మంత్రి వర్గంలో నేరుగా అడుగు పెట్టే నాగబాబు.. ఈ లోటును తీర్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ విధానాలపై అనేక సందర్భాల్లో నాగబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. సో.. మొత్తానికి చంద్రబాబు టీంలో సరికొత్త మంత్రిగా నాగబాబు ఎలాంటి ‘పంచ్’లు విసురుతారో చూడాలి.