సంక్రాంతి నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ పథకం

ఏపీలో మహిళలంతా ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు గురించి ప్రభుత్వ విప్, గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలని ఆయన ప్రకటన చేశారు.

సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఈ హామీ అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని యార్లగడ్డ చెప్పారు. అంతేకాదు, ఆటో డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన విధివిధానాలు రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని వెల్లడించారు. యార్లగడ్డ ప్రకటనతో ఏపీలోని మహిళలంతా ముందుగానే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు.

ఏపీలో ఎన్డీఏ కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు జనంలోకి బాగా దూసుకువెళ్లాయి. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సూపర్ 6లోని పథకాలను అమలు చేస్తూ వస్తోంది. కానీ, ఏపీలో కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన మహిళలు ఆశగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం హామీ మాత్రం ఇంకా అమలుకాకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఆగస్టు 15, దీపావళి అంటూ ఆ పథకం వాయిదా పడుతూ ఉండడంతో మహిళలు కాస్త అసహనంగా ఉన్నారు. అయితే, తెలంగాణతో పాటు కర్ణాటకలో అమలువుతున్న ఈ పథకంలోని లోపాలను సవరించి పకడ్బందీగా అమలు చేసేందుకే సమయం తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ క్రమంలోనే ఈ హామీ అమలుపై యార్లగడ్డ వెంకట్రావు తన సోషల్ మీడియా ఖాతాలలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.