ధర్మాన ప్రసాదరావు.. వైసీపీకి గుడ్ బై చెప్పడం దాదాపు ఖరారైంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నాయకు లతో వైసీపీ అధినేత జగన్ సమావేశం పెట్టినా.. ఆయన రాలేదు. ఆయన కుమారుడిని కూడా పంపించ లేదు. ఈ క్రమంలోనే ధర్మాన వ్యవహారంపై జగన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. గుర్రాన్ని నీటి వరకు మాత్రమే తీసుకువెళ్లగలమని.. నీళ్లు తాగించలేమని అన్నారు. అంటే.. ధర్మానకు శ్రీకాకుళం జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా.. ఆయన తీసుకునేందుకు సిద్ధంగా లేరన్న విషయాన్ని జగన్ సీరియస్‌గానే తీసుకున్నారు.
అలాగని బ్రతిమాలే దృక్ఫథంమాత్రం జగన్‌కు లేకపోవడం గమనార్హం. ఇక, ధర్మాన ఎందుకు వైసీపీని వీడాలని అనుకుంటున్నారనే ప్రశ్న కూడా రాజకీయాల్లో చర్చగా మారింది. ఎన్నికలకు ఏడాది ముందు.. ఉత్తరాంధ్ర పగ్గాలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అయితే.. ఈ నియామకాన్ని ధర్మాన అడ్డుకున్నా రు. ఆయన ను వద్దని చెప్పారు. పలు సందర్భాల్లో ఈ విషయంపై ఆయన కామెంట్లు కూడా చేశారు. కానీ, జగన్ మాత్రం వినిపించుకోలేదు. తర్వాత.. కాలంలో ధర్మాన వైవీల మధ్య వివాదాలు కూడా వచ్చాయి.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భూములు దోచుకునేందుకు వైవీ వచ్చారంటూ.. అనుచరులతో నిర్వహించిన సమావేశంలో ధర్మాన చెప్పుకొచ్చారు. దీనిపై అంతర్గతంగా పార్టీలోనూ చర్చ జరిగింది. అంటే.. వైవీని తనకు వ్యతిరేకంగా నియమించారని.. ఉత్తరాంధ్రలో తనను, తన రాజకీయాలను అడ్డుకునేందుకు వైవీని పంపించారన్న వాదన ధర్మాన వర్గంలో వినిపించింది. దీనికి తోడు.. ఎన్నికల్లోతన కుమారుడికి టికెట్ ఆశించారు. దీనికి జగన్ అంగీకరించలేదు.
ఇక, పార్టీ పరంగా గుత్తాధిపత్యాన్ని కోరుకున్న మాట కూడా.. వాస్తవమే. కానీ, జిల్లాపై అజమాయిషీని జగన్ ఆయనకు అప్పగించలేదు. ఈ పరిణామాలతోనే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారన్నది రాజకీయం గా జరుగుతున్న చర్చ. అయితే.. దీనిని ఇటు పార్టీ కానీ అటు ధర్మాన కానీ. నిర్ధారించడం లేదు. ఏదో గ్యాప్ అయితేఉంది. ఈ క్రమంలోనే జనసేనవైపు చూస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. ఈ విషయంలో చర్చలు కూడా పూర్తయ్యాయని, సంక్రాంతి తర్వాత.. చేరికలు ఖాయమని అంటున్నారు. మరిఏం జరుగుతుందో చూడాలి.