పవన్ పగబడితే ఇట్టా ఉంటదా…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌గబ‌డితే ఇలా ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు.. వ్యాపార వ‌ర్గాల్లోనూ వినిపిస్తున్న మాట‌. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న‌ ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి జ‌న‌సేన‌పైనా.. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తోపాటు.. రాజ‌కీయంగా కూడా.. ప‌వ‌న్‌ను ఆయ‌న టార్గెట్ చేశారు. బ‌హిరంగ స‌వాళ్లు కూడా గుప్పించారు.

ఈ క్ర‌మంలో ప‌వ‌న్ కాకినాడ‌లో నిర్వ‌హించిన వారాహి యాత్ర సంద‌ర్భంగా అదే రేంజ్‌లో ద్వారంపూడిపై విరుచుకుపడ్డారు. “మీ అక్ర‌మాల‌ను వెలికి తీసి.. న‌డిరోడ్డుపై నిల‌బెట్ట‌క‌పోతే.. నా పేరు ప‌వ‌న్ క‌ల్యాణే కాదు” అని భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు. అయితే.. ఈ ప్ర‌తిజ్ఞ‌ను కూడా ద్వారంపూడి లైట్ తీసుకున్నారు. “ముందు నువ్వు గెలిచి చూపించు” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క‌ట్ చేస్తే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ 100% స్ట్రైక్ రేట్‌తో ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

ఆ త‌ర్వాత‌.. ద్వారంపూడి వ్యాపార ద్వారాలు ఒక్కొక్క‌టిగా బ‌ద్ద‌ల‌వ్వ‌డం ప్రారంభమ‌య్యాయి. పౌర స‌ర‌ఫరాల శాఖ‌ను ప‌వ‌న్ తీసుకోవ‌డం.. దీనికి మంత్రిగా త‌న విధేయుడైన నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను నియ‌మించడం .. ఆయ‌న దూకుడుగా వ‌చ్చిన తొలినాళ్ల‌లోనే కాకినాడ‌, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోని రైసు మిల్లుల‌ను టార్గెట్ చేసుకుని విస్తృత త‌నిఖీలు చేయ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వెయ్యికిపైగా కేసులు న‌మోదు చేసిన‌ట్టు తాజాగా నాదెండ్ల వెల్ల‌డించారు.

ఇక‌, మ‌రోవైపు కాకినాడ పోర్టులో అక్ర‌మంగా ర‌వాణా అవుతున్న రేష‌న్ బియ్యంపైనా ప‌వ‌న్ కొర‌డా ఝ‌ళిపించారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఈ విషయంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. ఐపీఎస్ అధికారితో క‌మిటీ కూడా నియ‌మించింది. మ‌రోవైపు.. కాకినాడ‌లోని క‌ర‌ప‌లో ఉన్న వీర‌భ‌ద్ర ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన రొయ్య‌ల ఫ్యాక్ట‌రీని ఆగ‌స్టు 6నే పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు మూసివేసింది. తాజాగా లంప‌క‌లోవ‌లో ఉన్న మరో ఫ్యాక్టరీని కూడా మూసి వేశారు. దీంతో ద్వారంపూడికి భారీ షాక్ త‌గిలింది.

సుదీర్ఘ అధ్య‌య‌నం..

ద్వారంపూడి అక్ర‌మాల‌ను వెలికి తీసేందుకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలానే అధ్య‌య‌నం చేసినట్టు తెలుస్తోంది. కాకినాడ‌కు గ‌తంలోనే వ‌చ్చిన ఆయ‌న ఇక్క‌డే తిష్ఠ వేసిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో రాజ‌కీయంగా ఆయ‌న వ‌చ్చార‌ని అనుకున్నారు. కానీ, ద్వారంపూడి వ్యాపారాల‌కు సంబంధించిన అక్ర‌మాల‌పై కూపీ లాగిన‌ట్టు తెలిసింది. వాటి ఆధారంగానే తాజాగా ప‌క్కా చ‌ర్య‌ల‌కు దిగార‌ని స‌మాచారం. మొత్తానికి ప‌వ‌న్ ప‌గ బ‌డితే ఎలా ఉంటుంద‌నే విష‌యం తాజా చ‌ర్చ‌ల‌తో స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.