ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ విజయం దక్కించుకున్నారు. ఆయన ఏరికోరి ఎంచుకున్న ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు అనేక అనేక సాహసాలు చేసి.. అనేక మందిని తప్పించి మరీ ఇచ్చారు. ఆయన కూడా విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆరు మాసాలైనా.. ఇప్పటి వరకు కన్నా లక్ష్మీనారాయణ పెద్దగా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా.. కన్నా ఎక్కడా కనిపించలేదు. నియోజకవర్గంలోనూ లేరు. దీంతో తమ ఎమ్మెల్యే ఏరీ? అంటూ.. కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు ఎటు చూసినా.. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాటే వినిపిస్తుండడం గమనార్హం. విమర్శ అయినా.. ప్రశంస అయినా..ఆయనే మీడియా ముందుకు వస్తున్నారు తప్ప.. ఎమ్మల్యే మాట వినిపించడం లేదు.
అయితే.. సొంత పనులపై విదేశాలకు వెళ్లారని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యే కన్నా కనిపించడం లేదన్నది వాస్తవం. ఇక, నియోజకవర్గంలో నెంబర్2 గా చలామణి అయ్యే నాయకుడి వ్యవహారాలపై విమర్శలు వస్తున్నాయి. వసూళ్లు పెరిగిపోయాయని అంబటి రాంబాబు విమర్శించడం గమనార్హం.
సాధారణంగా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే.. సంబంధిత నాయకులకు బాధ్యతలు అప్పగిస్తారు. అయితే.. కన్నా ఎవరికి అప్పగించారన్నది ఎవరికీ తెలియదు. దీంతో నెంబరు 2 గా చెప్పుకొనే నాయకుడు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశం, వివాదాస్పదం కూడా అవుతున్నారు. ఈ పరిణామాతో విసిగిపోతున్న ప్రజలు తమ ఎమ్మెల్యే ఎక్కడంటూ సోషల్ మీడియాలో పోస్టులుపెడుతూ.. కామెంట్లు చేస్తున్నారు. మరి కన్నా అనుచరగణం దీనిపై స్పందిస్తుందో లేదో చూడాలి.