ప్రధానమంత్రి నరేంద్రమోడి-జగన్మోహన్ రెడ్డి భేటి తర్వాత ఈ అంశంపై ఊహాగానాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్డీఏలో చేరాల్సిందిగా జగన్ను ప్రధానమంత్రి కోరినట్లు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. తాను ఎన్డీఏలో చేరాలంటే ముందు కొన్ని డిమాండ్లు నెరవేర్చాలని జగన్ ప్రధానితో స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో చేరితే వైసిపికి రెండు క్యాబినెట్ మంత్రి పదవులతో పాటు స్వతంత్రంగా వ్యవహరించే ఓ సహాయమంత్రి పదవిని ప్రధాని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్ విషయంలో జగన్ సానుకూలంగా స్పందించలేదట.
తాను ఎన్డీఏలో చేరాలంటే ముందు తమ డిమాండ్లను నెరవేర్చాలని జగన్ స్పష్టంగా చెప్పారని ఎలక్ట్రానిక్ మీడియా చెబుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలనే కీలకమైన డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఇతరత్రా ఆర్దిక ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ డిమాండ్లను కూడా కేంద్రం ఆమోదిస్తే ఎన్డీఏలో చేరటానికి తమకు అభ్యంతరం లేదని జగన్ ప్రధానితో స్పష్టంగా చెప్పారంటూ టీవీల్లో మోత మోగిపోతోంది.
ఇదే విషయమై ప్రభుత్వ సలహాదారు, వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ పార్టీని ఎన్డీఏ చేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టంగా చెప్పారు. తమ పార్టీని ఎన్డీఏలో చేరాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించలేదని కూడా అన్నారు. అయితే సజ్జల చెప్పింది జగన్ ప్రధాని భేటికి ముందు. ఇదే సమయంలో ఎవరు కూడా తాము పలానా వారితో కలుస్తున్నట్లు ఎక్కడా బహిరంగంగా చెప్పుకోరు. రాజకీయాల్లో అన్నీ చివరి నిముషం వరకు గుంభనంగానే ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే.
జగన్ను ఎన్డీఏలోకి మోడి ఆహ్వానించినా, లేదా జగన్ ఎన్డీఏలో చేరినా అన్నీ అవసరాలు, అవకాశాల మేరకే జరుగతాయి. ఇద్దరి మధ్య వ్యవహారాలన్నీ ఇచ్చి పుచ్చుకునే బేరసారాల మీదే జరుగుతుంది. ఇద్దరి మధ్య జరిగే బేరసారాల్లో ఎవరికెంత లాభం ? ఎవరికెంత నష్టం ? అన్న విషయాల్లో క్లారిటి వచ్చిన తర్వాతే అధికారికంగా స్పందిస్తారు. అప్పటి వరకు వచ్చే వార్తలు, కథనాలన్నీ అనధికారాలే. కాబట్టి ప్రధాని-జగన్ భేటి విషయంలో జరుగుతున్నవన్నీ అనధికారిక సమాచారమే. చివరకు ఇది నిజమూ కావచ్చు లేదా గాలిలో కలిసీ పోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates