ఇపుడిదే విషయంపై చర్చ రాష్ట్రంలో జోరందుకుంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం అయ్యారో లేదో వెంటనే ఎన్డీఏలో జగన్ చేరిపోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. వైసిపికి ఓ క్యాబినెట్ మంత్రిపదవితో పాటు స్వతంత్రహోదాలో రెండు సహాయమంత్రి పదవులు కూడా రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల హడావుడి మొదలైపోయింది. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ? అన్నది పక్కన పెట్టేస్తే ఎన్డీఏలో చేరటానికి వైసిపికి అవకాశాలు అయితే ఉన్నాయన్నది వాస్తవం.
ఒకవేళ ఎన్డీఏలో వైసిపి చేరితే రాజకీయంగా అనూహ్య పరిణామాలు ఒక్కసారిగా స్పీడందుకోవటం ఖాయం. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు ఇబ్బందులు తప్పదనే అనుకోవాలి. అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరగాలని ఇప్పటికే ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం నుండి ఇప్పటివరకు సానుకూల స్పందన రాకపోవటంతో రాష్ట్రప్రభుత్వం ఏసిబి విచారణకు ఆదేశించింది. అయితే ఏసీబీ విచారణను హైకోర్టు అడ్డుకుంది.
రాష్ట్రప్రభుత్వం అనుకున్నట్లుగా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు చాలామంది టీడీపీ సీనియర్లు అవినీతి చేశారా లేదా అన్నది బయటపడేలోపు రాజకీయంగా చాలా డ్యామేజ్ జరుగుతుంది. అంటే దర్యాప్తుతోనే రాజకీయ కష్టాలు మొదలైనట్లే. నిజంగానే ఇది జరిగితే అసలే కష్టాల్లో ఉన్న తెలుగుదేశంపార్టీపైన మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తయారవుతుంది పరిస్ధితి.
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా కష్టాలు మొదలైనట్లే అనుకోవాలి. ఎలాగంటే బీజేపికి జనసేన మిత్రపక్షంగా ఉన్నది. వైసిపి ప్రభుత్వంపై పవన్ పలు ఆరోపణలు చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. వైసిపి గనుక ఎన్డీఏలో చేరితే జగన్ పై నోరుపారేసుకునే అవకాశం పవన్ కు ఉండకపోవచ్చు.
ఇదే సమయంలో తానసలు బీజేపికి మిత్రపక్షంగా కంటిన్యు అవ్వాలా ? వద్దా ? అనే విషయాన్ని ముందు పవన్ తేల్చుకోవాల్సి వస్తుంది. సరే మిత్రపక్షం కాబట్టి వైసిపి ప్రభుత్వంపై బీజేపీ నేతలు మాట్లాడే అవకాశామే ఉండదన్న విషయం తెలిసిందే. కాబట్టి ఏ పద్దతిలో చూసినా జగన్ ఎన్డీఏలో చేరితే రాజకీయ పరిణామాలు చాలా స్పీడందుకోవటం మాత్రం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates