కొంతకాలంగా భారత్ , చైనా ల సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత కూడా చైనా భారత సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తూనే ఉంది. తూర్పు లడఖ్‌లో చైనాకు చెందిన పీఎల్‌ఏ దళాలు భారత భూభాగం వైపు దూసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ కవ్వింపు చర్యలతో గాలిలో కాల్పులకు పాల్పడుతున్నాయి. డ్రాగన్ దళాలకు భారత సైన్యం గట్టిగా బదులిస్తోంది.
ఇరుదేశాల రక్షణ శాఖల మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జనరల్ వీ ఫెంగ్ లు ఈ ఉద్రిక్తతలపై చర్చలు జరిపినా చైనా దూకుడు చర్యలకు పాల్పడుతూనే ఉంది. 45 ఏళ్ల తర్వాత లడఖ్ లో కాల్పులు జరగడం వెనుక చైనా కుట్ర దాగి ఉందని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాల్పుల స్థాయికి చేరడం ఆందోళనకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరుదేశాధ్యక్షులు త్వరలోనే భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ లు నవంబర్ లో జరగనున్న వర్చువల్ సమావేశంలో వీరిద్దరూ పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ‘బ్రిక్స్’ సమ్మిట్ ను పురస్కరించుకుని వీరిద్దరూ ప్రపంచ తాజా పరిస్థితులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. నవంబరు 17న మోదీ, జీ జిన్ పింగ్ భేటీ అవుతారని తెలుస్తోంది. ఆ భేటీలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన తర్వాత మోడీ, జిన్ పింగ్ లు భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది బ్రిక్స్ కూటమికి రష్యా అధ్యక్షత వహిస్తోంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే. మోడీతో జిన్ పింగ్ భేటీ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు చెక్ పడుతుందా లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది.