ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ 2024 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో మిస్సింగ్ మహిళల పెండింగ్ కేసులు 846 అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పడంతో పవన్ చెప్పినవి అబద్ధాలని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో తాను, పవన్ పర్యటిద్దామని, ఎవరిని చూసేందుకు జనం ఎక్కువ వస్తారో చూద్దామని ఛాలెంజ్ చేశారు.
ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రోజా గతంలో చేసిన వ్యాఖ్యలపై యాంకర్ ప్రశ్నించారు. ఏదో ఒక ఊర్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, పవన్ కల్యాణ్, తాను పర్యటిద్దామని, ఎవరిని చూసేందుకు జనం ఎక్కువమంది వస్తారో చూద్దామని రోజా చేసిన కామెంట్లను యాంకర్ ప్రస్తావించారు. అయితే, తాను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నానని రోజా అన్నారు. అయితే, పిఠాపురంలో పవన్ కు భారీ మెజారిటీ వచ్చిందని, ఇప్పుడు పిఠాపురంలో పర్యటించేందుకు రోజా సిద్ధమా అని యాంకర్ ప్రశ్నించగా…సిద్ధమని రోజా అన్నారు. దీంతో, పిఠాపురంలో రేప్ నకు గురైన అమ్మాయి ఇంటికి వెళదామని, వరదలు వచ్చిన ముంపు ప్రాంతాలకు వెళదామని రోజా అన్నారు.
రోజాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అని యాంకర్ అనగా…గ్రౌండ్ రియాలిటీ తాను చెబుతున్నానని రోజా అన్నారు. 11 సీట్లు వచ్చిన జగన్ గారిని కామెంట్ చేసే ముందు..రెండు సార్లు ఓడిపోయిన పవన్ రాజకీయ సన్యాసం తీసుకోవాలి కదా అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీల బలంతో పవన్ గెలిచారని,ఆయన సొంత బలంతో కాదని రోజా చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడే పవన్ బలమేంటో తెలిసిపోయిందని రోజా ఎద్దేవా చేశారు. తాను నగరి నుంచి రెండుసార్లు ఓడిపోయినా…సొంతంగా పోటీ చేశానని, ఈ రోజు ఓడినా…రేపు గెలవగలనన్న ధీమా ఉందని చెప్పారు. ఇండిపెంటెండ్ గా నిలబడి పవన్ గెలవాలని ఛాలెంజ్ చేశారు. పవన్ ను ఛాలెంజ్ చేస్తూ రోజా చేసిన కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates