శాస‌న మండ‌లిలో ‘రుషికొండ ప్యాల‌స్’ ర‌చ్చ‌

ఏపీ శాస‌న మండ‌లి బ‌డ్జెట్‌ స‌మావేశాల్లో మంగ‌ళ‌వారం ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. ప్ర‌ధానంగా వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌పై నిర్మించిన ప్యాలెస్ వివాదం ర‌చ్చ‌గా మారింది. ఇటు ప్ర‌భుత్వం ప‌క్షాన ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్‌.. మరో మంత్రి అచ్చెన్నాయుడు ప్యాలెస్ నిర్మాణం విష‌యంపై నిప్పులు చెరిగారు. ఇదేస‌మ‌యంలో అటువైపు వైసీపీ స‌భ్యులు ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌ను నిర‌సిస్తూ.. స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు.

మండ‌లిలో స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఒక‌రు.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణాన్ని ఏం చేయ‌బోతున్నార‌న్న ప్ర‌శ్న‌కు ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. “రుషికొండ ప్యాలెస్ విష‌యంలో వైసీపీ అంద‌రినీ మోసం చేసింది. ఇక్క‌డ రిసార్టులు క‌డుతున్నామ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి.. ఏడు బ్లాకులుగా విభ‌జించి ప్ర‌జాధ‌నంతోప్యాలెస్‌ను నిర్మించింది. అద్భుత‌మైన ప్ర‌పంచ స్థాయి రిసార్టు క‌డుతున్నామ‌ని చెప్పి ముఖ్య‌మంత్రి కోసం ప్యాలెస్ నిర్మించ‌డం ప్ర‌జాధ‌నం దుర్వినియోగం కాదా?” అని దుర్గేష్ నిల‌దీశారు.

దీనిని ఇప్పుడు ఏం చేయాల‌న్న దానిపై అంద‌రితోనూ చ‌ర్చిస్తున్న‌ట్టు మంత్రి కందుల తెలిపారు. ప్యాలెస్ నిర్మించిన వైసీపీ స్థానికంగా ఉన్న‌.. రిసార్టుల‌ను ఆదాయానికి దూరం చేసింద‌న్నారు. హ‌రిత రిసార్ట్ ఒక‌ప్పుడు మంచి ఆదాయంలో ఉండేద‌ని.. కానీ వైసీపీ హ‌యాంలో అప్పులు చేయాల్సిన ప‌రిస్థితికి దిగ‌జార్చార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మ‌రో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని.. ప్ర‌జ‌ల‌ను మోస‌గించిన వారిపై కేసులు పెట్టాల‌ని అన్నారు.

రుషి కొండ నిర్మాణాల‌ను చూస్తే.. నోరు వెళ్ల‌బెట్టాల్సిందేన‌ని అచ్చెన్న వ్యాఖ్యానించారు. ఒక‌వైపు అప్పులు చేస్తూ..రాష్ట్రాన్ని దివాలా తీయించిన అప్ప‌టి ముఖ్య‌మంత్రి.. రుషికొండ‌ను ధ్వంసం చేశార‌ని, క‌నీసంఅక్క‌డ ఏం జ‌రుగుతోందో చూసేందుకు కూడా ఎవ‌రినీ అనుమ‌తించ‌లేద‌న్నారు. వైసీపీ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా రుషి కొండ‌పై ఏం జ‌రుగుతోందో చూసేందుకు అనుమ‌తి ఇచ్చి ఉండ‌ర‌ని వ్యాఖ్యానించారు. క‌ళ్ల ముందే ఇంత దోపిడీ జ‌రిగితే చూస్తూ ఊరుకోవాలా? అని నిల‌దీశారు.