వైసీపీకి షాక్‌.. ఒకే రోజు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసులు

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీకి సోమ‌వారం ఒకే స‌మ‌యంలో ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమ‌వారం కేసులు న‌మోద‌య్యాయి. రెండు కేసులూ కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ఒక‌రు సోష‌ల్ మీడియాలో చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా, మ‌రొక‌రు.. నేరుగా మీడియా ముందు గ‌తంలో చేసిన వ్యాక్య‌ల‌పై కేసు న‌మోదైంది. దీంతో వైసీపీలో అల‌జ‌డి మ‌రింత పెరిగింది.

ఎవ‌రు వారు?

వైసీపీ నేత‌, య‌ర్ర‌గొండ పాలెం ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్‌పై ప్ర‌కాశం జిల్లా పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీనికి సంబంధించి ఆయ‌న‌కు వాట్సాప్ ద్వారా 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే, చంద్ర‌శేఖ‌ర్ స్పందించ‌లేదు. దీంతో సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో నేరుగా ఆయ‌న నివాసానికి వెళ్లిన పోలీసులు కేసు న‌మోదు చేశామ‌ని చెబుతూ.. 41 ఏ కింద నోటీసుల‌ను ఆయ‌నకే ఇచ్చారు. గ‌తంలో టీడీపీ యువ నాయ‌కుడు, ప్ర‌స్తుత మంత్రి నారా లోకేష్ పై తాటిప‌ర్తి సోష‌ల్ మీడియా వేదిక‌గా దుర్భాష‌లాడార‌ని టీడీపీ నాయ‌కుడు ఒక‌రు ఫిర్యాదు చేశారు. దీనిని ప‌రిశీలించిన పోలీసులు చంద్ర‌శేఖ‌ర్‌పై కేసు పెట్టారు.

ఇక‌, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌పైనా కేసు న‌మోదైంది. సోమ‌వారం జ‌న‌సేన పార్టీకి చెందిన కీల‌క నాయ‌కుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. గత ఎన్నిక‌ల‌కు ముందు త‌మ పార్టీ అధినేత‌, ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై దువ్వాడ నోరు చేసుకున్నార‌ని, విన‌లేని మాట‌లు మాట్లాడార‌ని ఆయ‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే దువ్వాడ‌పై కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు.