అసెంబ్లీలో కూన క‌ల్లోలం.. స్పీక‌ర్ ఫైర్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా స‌మావేశాలు జ‌ర‌గ‌వేమో.. అని అనిపించేలా సొంత పార్టీ ఎమ్మెల్యే స‌ర్కారు మంత్రుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. శుక్ర‌వారం నాటి స‌భ‌లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్ర హం వ్య‌క్తంచేసిన ఎపిసోడ్ క‌ల్లోలం సృష్టించింది. ఆయ‌న‌కు త‌గినంత స‌మ‌యం ఇవ్వ‌లేద‌న్న కార‌ణంగా డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌పైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ర‌మ్మంటే వ‌స్తాం.. వ‌ద్దంటే అసెంబ్లీకి కూడా రాబోనంటూ జ్యోతుల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఘ‌టన మ‌రిచిపోక‌ముందే.. శ‌నివారం నాటి స‌భ‌లో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కూన ర‌వికుమార్‌.. స‌భ‌లో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మంత్రులు స‌రిగా స‌భ‌కు రావ‌డం లేద‌ని వ్యాఖ్యానిం చారు. అస‌లు ఎమ్మెల్యేల‌ను పట్టించుకునే నాధుడు కూడా క‌రువ‌య్యార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

“మేం ఎందుకు వ‌స్తున్నామో.. మాకే అర్ధం కావ‌డం లేదు అధ్య‌క్షా! మ‌మ్మ‌ల్ని ఇక్క‌డ ప‌ట్టించుకునేవారే క‌రువ‌య్యారుఅని కూన చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా స‌భ ఉలిక్కిప‌డింది. ఈ సంద‌ర్భంగా జోక్యం చేసుకున్న స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు..ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి!“ అని వ్యాఖ్యానించారు. ఈ విష‌యం పై కూడా కూన అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ స‌మ‌యంలో కూన మాట్లాడుతూ.. తాము స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తుతున్నామ‌ని.. కానీ న‌మోదుచేసుకుని స‌మాధానం చెప్పేందుకు స‌భ‌లో మంత్రులు ఎవ‌రూ లేర‌ని అన్నారు.

దీంతో స‌భాప‌తి అయ్య‌న్న స‌భ మొత్తం ప‌రికించి చూసి.. మంత్రి అచ్చ‌న్నాయుడు ఉన్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. స‌భ‌లో అచ్చ‌న్నాయుడు ఉన్నార‌ని, ఆయ‌న‌కు చెప్పాల‌ని సూచించారు. అయితే.. ఆయ‌న‌కు త‌న ప్ర‌శ్న‌కు సంబంధించిన శాఖ కాద‌ని కూన బ‌దులిచ్చారు. దీంతో మ‌రోసారి ఆయ‌న‌కు.. స్పీక‌ర్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో మంత్రి అచ్చెన్న బ‌దులిస్తూ.. ఏ శాఖ‌కు సంబంధించిన ప్ర‌శ్న అయినా.. తాను న‌మోదు చేసుకుని.. ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని, సంబంధిత మంత్రికి నివేదిస్తాన‌ని చెప్పారు. అయినా..కూన శాంతించ‌లేదు. కొద్ది సేపు స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి పోయారు.