జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం మరింత నష్టపోయిందన్నారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించిన చంద్రబాబు ఆయా తప్పులను వివరించారు.
1) అమరావతి: రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తిగా ఉన్న అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. సెల్ప్ రిలయన్స్ క్యాపిటల్‌గా ఉన్న అమరావతిని పూర్తి చేసి ఉంటే ఇప్పటికే 1000 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చి ఉండేవన్నారు. కానీ, వైసీపీ దీనిని విధ్వంసం చేసిందన్నారు.
2) పోలవరం: పోలవరం పూర్తి చేసేందుకు కూడా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించలేదని చంద్రబాబు చెప్పారు. కేంద్రం నుంచి తెచ్చిన నిధులను కూడా సొంతానికి వాడుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు కొట్టుకుపోయినా.. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు.
3) మూల ధన వ్యయం: మూల ధన వ్యయం తగ్గించేయడం ద్వారా.. అభివృద్ధి చేపట్టకుండా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని చంద్రబాబు చెప్పారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులు గోతులు పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
4) విద్యుత్: కేంద్రం తక్కువ ధరలకు ఇస్తామన్న విండ్ పవర్‌ను తీసుకోకుండా.. బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ను 7.50కు కొనుగోలు చేశారని.. తద్వారా ప్రజలపై భారాలు మోపారని చెప్పారు. ఇప్పుడు ప్రజలపై భారం వైసీపీ పాలనలో జరిగిన పాపమేనన్నారు.
5) మద్యం: మద్యంలో ప్రజల ధనాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారని చంద్రబాబు చెప్పారు. సొంత బ్రాండ్లు తయారు చేసి ప్రవేశ పెట్టారని, కనీసం ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటిని కూడా అమలు చేయలే దన్నారు. ప్రస్తుతం టీ షాపుల్లో ఫేన్ పే అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం జే బ్రాండ్స్ స్థానంలో అన్ని బ్రాండ్ల మద్యం లభిస్తోందన్నారు.
6) పన్నులు: ప్రజల నుంచి పన్నుల రూపంలో పిండేశారు. చెత్తపై పన్ను సహా అన్ని రకాలుగా పన్నులు వసూలు చేశారని తెలిపారు. దీంతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు.
7) హింసా రాజకీయాలు: వైసీపీ పాలనలో హింసా రాజకీయాలకు మీరు(ఉప సభాపతి రఘురామ), నేను(సీఎం) కూడా బాధితులమేనని చెప్పారు. ముందుగా ఆస్తులు లాక్కోవడం, అర్ధరాత్రి అరెస్టులు స్టేషన్‌లో పెట్టి కేసులు పెట్టడం వంటివి జరిగాయన్నారు. ఈ హింసా రాజకీయాలకు అనేక మంది బలి అయ్యారని తెలిపారు. డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు.