కనుమూరు రఘురామ కృష్ణంరాజు తెలుగు రాజకీయాల్లో ఎలాంటి సంచలనమో… ఎంత పాపులరో తెలిసిందే. మరీ ముఖ్యంగా గత ఐదేళ్లు వైసీపీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీని.. ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓ ఆటాడుకుని హైలెట్ అయ్యారు. రఘురామ మాట్లాడినా.. ప్రెస్‌మీట్ పెట్టినా కూడా మీడియాకు.. సోషల్ మీడియాకు సంచలనమే. అలాంటి రఘురామ ఈ యేడాది ఎన్నికలకు ముందు అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న సందిగ్ధస్థితిలో చివరకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయనకు ముందు ఆయన సిట్టింగ్ స్థానమైన నరసాపురం ఎంపీ సీటు అనుకున్నారు. అది రాలేదు. తర్వాత అతి కష్టం మీద ఉండి ఎమ్మెల్యే సీటు ఇవ్వగా.. కూటమి ప్రభంజనంలో భారీ మెజార్టీతో విజయం సాధించారు.
జగన్‌పై చేసిన పోరాటానికి రఘురామ క్షత్రియుల కోటాలో మంత్రి పదవి ఆశించారు. రాలేదు.. కాస్త అలిగారు.. బాబుపై ఏవేవో మాటలు అన్నారు. ఆ తర్వాత జగన్‌ను ఆటాడుకునేందుకు స్పీకర్ పదవి ఇస్తారని అందరూ భావించారు. అయితే వైసీపీకి మినిమం సీట్లు లేక.. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో ఆయన స్పీకర్ పదవి తీసుకోలేదు.
మామూలుగా ఈ పదవి జనసేనకు ఇవ్వాలి.. అయితే సామాజిక సమీకరణాల నేపధ్యంలో రఘురామకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు పవన్ కూడా అంగీకారం తెలిపారు. రఘురామ పడిన కష్టానికి డిప్యూటీ స్పీకర్ పదవి పెద్దది కాదు.. కానీ ప్రొటోకాల్ ఉంటుంది. రఘురామను డిప్యూటీ స్పీకర్‌గా నియమించడం కూడా జగన్‌కు ఎప్పుడైనా ఇబ్బందే. ఆయన ఏదో ఒక టైంలో స్పీకర్ స్థానంలో కూర్చుంటే జగన్ ఆయనను అధ్యక్షా అని పిలవాల్సి ఉంటుంది. ఇవన్నీ పవన్, చంద్రబాబు ఆలోచన చేసే జనసేన ఈ పదవి వదులుకుని మరీ రఘురామకు ఇప్పించిందంటున్నారు.
ఇక రఘురామ తనపై దాడి చేసిన వారిని.. పోలీసు అధికారుల్ని ఎప్పుడు ? అరెస్టు చేస్తారని ఓ వైపు ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తూనే ఉన్నారు. అసెంబ్లీలో కూడా అదే క్వశ్చన్ వేశారు. ఆయన ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి టైంలో రాజ్యాంగ బద్ధమైన పదవి.. అందులో కాస్త అందరిని శాసించే పదవి వస్తే ఆయన ఆగుతారా.. ఇప్పుడు రఘురామ కొత్త ఆట ఎలా ఉంటుందో ? కాస్త ఆసక్తికరమే..!
Gulte Telugu Telugu Political and Movie News Updates