ఏపీ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ ప్రవేశ పెట్టిన స్వల్పకాలిక బడ్జెట్(డిసెంబరు-మార్చి)లో అన్ని రంగాల కూ ప్రాధాన్యం కల్పించారు. వాస్తవానికి స్వల్ప కాలిక బడ్జెట్‌లో కొన్ని రంగాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. కానీ, కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలకు అనేక ఆశలు ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు ముద్ర కోసం వేచి చూస్తారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా చంద్రబాబు ముద్ర చెరిగిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిలో భాగంగా మౌలిక వసతుల రంగానికి పెద్ద పీట వేయడంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ కల్పనా రంగాలను ప్రాధాన్యంగా తీసుకున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చూస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖలకు కూడా ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ శాఖకు 16739 కోట్లను కేటాయించారు. ఇది .. అసాధారణమనే చెప్పాలి. గత వైసీపీ హయాంలో పంచాయతీరాజ్‌కు 1000-1500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.
దీంతో పోల్చుకుంటే.. తాజా బడ్జెట్‌లో 16 వేల కోట్లకు పైగానే నిధులు కేటాయించడం గమనార్హం. అదేవిధంగా యువతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ.. మానవ వనరుల అభివృద్ధికి 1215 కోట్ల రూపాయలను కేటాయించారు. అలాగే.. పట్టణాభివృద్ది(ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి) 11490 కోట్ల రూపాయలను ఇచ్చారు. తద్వారా.. పట్టణాల్లో మౌలిక వసతులను పెంచేందుకు మార్గం సుగమం అయింది. మహిళ, శిశు సంక్షేమానికి రూ.4,285కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.18,421కోట్లు కేటాయించడం ద్వారా.. ఆయా వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అయింది.
ఈ బడ్జెట్‌లో మరో కీలక ప్రతిపాదన.. పర్యావరణ, అటవీ శాఖలు. ఎప్పుడూ కూడా.. ఈ రెండు విభాగాలు బడ్జెట్‌లో ఎప్పుడూ చిట్టచివరిలో ఉంటున్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా.. వీటిని ప్రాధాన్యం రంగాలు గా భావించడం లేదు. కానీ, ఈ దఫా ఈ రెండు విభాగాలు కూడా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఉండడంతో వీటికి కూడా ప్రాధాన్యం ఏర్పడింది. పర్యావరణ, అటవీ శాఖలకు 687 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది చాలా మేలైన కేటాయింపుగా ఆయా రంగాల నిపుణులు భావిస్తున్నారు.