జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో తాజాగా 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పిఠాపురం మండలంలోని ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో ఉన్న భోగాపురంలో ఆయన 12 ఎకరాలను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు తాజాగా పూర్తి చేశారు. పవన్ కల్యాణ్ తరఫున పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న జనసేన నాయకుడు తోట సుధీర్ రిజిస్ట్రేషన్ చేయించారు.
ఎందుకు?
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల సమయంలో ఆయనపై వైసీపీ నాయకులు నాన్ లోకల్ అంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. “ఇక్కడ పిఠాపురం ప్రజలకు ఏం అవసరం వచ్చినా.. నేను ఉన్నా. మరి పవన్ కల్యాణ్.. ఉండేది హైదరాబాద్‌లో. ఇక్కడి ప్రజలకు ఆయన అందుబాటులో ఉండడు. ఏ అవసరం వచ్చినా.. హైదరాబాద్‌కు వెళ్లి క్యూ కట్టుకుని ఆయన ఇంటి ముందు నిలబడాలి” అని వైసీపీ అభ్యర్థి, అప్పటి ఎంపీ వంగా గీత ప్రచారంలో చేశారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్.. పిఠాపురం ప్రజలకు భారీ హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే.. పిఠాపురంలో నే ఇల్లు కట్టుకుంటానని.. ఇక్కడే ఉంటానని నెలకు 2 వారాల పాటు పిఠాపురం నుంచే ప్రజల సమస్యలు వింటానని కూడా ఆయన చెప్పారు. ఆ హామీ మేరకు.. ఆయన తాజాగా 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనిలో క్యాంపు కార్యాలయం 2.5 ఎకరాల్లో, ఆఫీసు 3 ఎకరాల్లో నిర్మించనున్నారు.
ఇక, మిగిలిన స్థలంలో పార్కింగు తోపాటు ఫాం హౌస్‌ను కూడా నిర్మించనున్నట్టు తోట సుధీర్ చెప్పారు. ఇదిలావుంటే.. ఎన్నికల సమయంలోనే పవన్ కల్యాణ్.. ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన పిఠాపురానికి ఎప్పుడు వెళ్లినా.. అక్కడే ఉంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. త్వరలోనే క్యాంపు కార్యాలయం నిర్మించనున్నారు.