దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా జగన్, షర్మిల, విజయమ్మల మధ్య ఆస్తుల వివాదాలు రగులుతున్న విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున మీడియాలోనూ చర్చ సాగింది. ఈ విషయాలను తాజాగా ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. ప్రజల ఆస్తులు దోచుకుని, వాటిని తమ సొంత ఆస్తులు అంటూ వైఎస్ కుటుంబ సభ్యులు కోట్లాడుకుంటున్నారు.. అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడులో ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు వైఎస్ హయాంలో కేటాయించిన భూములను ఆయన తాజాగా పరిశీలించారు.
జగన్-షర్మిల మధ్య వివాదం ఈ భూముల విషయంపైనే వచ్చిన సంగతి తెలిసిందే. షేర్లను ఈడీ జప్తు చేయలేదని.. కాబట్టి వాటిని అమ్మితే తప్పులేదని షర్మిల వాదిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఆ భూముల సంగతి తేల్చాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఇక్కడ పర్యటించి.. తమకు సంబంధించిన భూములు సరస్వతి భూముల్లో లేవని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మరోసారి పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నుంచి వైఎస్ కుటుంబం దౌర్జన్యంగా ఈ భూములు దోచుకుందన్నారు.
జగన్ అరాచక వాది!
జగన్ అరాచక వాది అనేందుకు సరస్వతి భూములే నిదర్శనమని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఈ భూములను30 ఏళ్లకు మాత్రమే లీజుకు తీసుకున్నారని.. కానీ, జగన్ అధికారంలోకి వచ్చాక.. మరో 50 ఏళ్లపాటు లీజును స్వయంగా పొడిగించుకున్నారని.. ఇంతకన్నా అరాచకం ఏం ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి రాయి కూడా వేయలేదన్నారు. అంతేకాదు..ఇక్కడ భూములను కూడా ప్రజలు, రైతుల నుంచి దౌర్జన్యంగా తీసుకున్నారని చెప్పారు. నాటు బాంబులు వేసి భయపెట్టారని, దీంతో భయ బ్రాంతులకు గురైన ప్రజలు ఇష్టం లేకున్నా అమ్ముకున్నారని చెప్పారు.
“భూములు ఇచ్చిన వారికిఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉపాధి కల్పిస్తామన్నారు. కానీ, ఒక్కరికి కూడా.. ఉద్యోగం ఇవ్వలేదు. ఉపాధి చూపించలేదు. కేవలం దోపిడీ కోసమే 1100 ఎకరాలు తీసుకున్నారు. దీని వల్ల కాయకష్టం చేసుకునే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని పవన్ వ్యాఖ్యానించారు. 400 ఎకరాల అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చేసి లాక్కున్నారని స్థానికులు చెబుతున్నారన్న పవన్ కల్యాణ్.. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates