ల‌క్ష కోట్ల‌తో ఏపీ బ‌డ్జెట్.. క‌స‌ర‌త్తు పూర్తి!

ఏపీ వార్షిక బ‌డ్జెట్‌ను మ‌రో వారంలో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. మొత్తంగా రూ.ల‌క్ష కోట్ల‌తో ఈ బడ్జెట్‌ను రూపొందించిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. నాటి నుంచి 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 11న అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగించ‌నున్నారు. అనంత‌రం.. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

ప్ర‌స్తుతం ఆర్డినెన్స్ రూపంలో తెచ్చుకున్న ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ గ‌డువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో వ‌చ్చే మార్చి 31, 2025 వ‌ర‌కు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంటే.. డిసెంబరు – మార్చి ఐదు మాసాల కాలానికి ఈ బ‌డ్జెట్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. బడ్జెట్‌తో పాటు ప‌లు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం వాటిని ఆమోదించుకోనుంది. ఇక‌, పూర్తిస్థాయిలో కాకుండా.. ఐదు మాసాల‌కు స‌రిపోయేలా ఈ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.

రూ.ల‌క్ష కోట్ల‌తో ప్ర‌వేశ పెట్ట‌నున్న బ‌డ్జెట్‌లో అమ‌రావ‌తి నిర్మాణానికి, పోల‌వ‌రం ప్రాజెక్టు స‌హా.. ర‌హ‌దారుల బాగుచేత వంటి మౌలిక వ‌స‌తులు, ప్రాజెక్టుల‌కు సింహ‌భాగం కేటాయించే అవ‌కాశం ఉంది. అమ‌రావ తికి అప్పు చేస్తున్నా.. మ‌రిన్ని నిధుల‌ను బడ్జెట్‌లో కేటాయించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఏటా క‌నీసం 3 వేల కోట్ల వ‌ర‌కు అమ‌రావ‌తికి కేటాయించి.. త‌ద్వారా 15 వేల కోట్ల‌ను రాష్ట్రం నుంచే స‌మీక‌రించాల‌ని భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ప్ర‌వేశ పెట్టే బ‌డ్జెట్‌లో రూ.1000 కోట్ల వ‌ర‌కు అమ‌రావ‌తికి కేటాయించే అవ‌కాశం ఉంది. ఇక‌, కీల‌క‌మైన ప‌థ‌కాల‌కు కూడా బ‌డ్జెట్‌లో చోటు క‌ల్పించ‌నున్నారు. ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు, నిరుద్యోగ భృతి, రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద ఒక్కొక్క‌రికీ ఏటా రూ.20000 ల‌కు ఈ బ‌డ్జెట్‌లో చోటు క‌ల్పిస్తారు. అలానే.. రాష్ట్ర స‌ర్వతో ముఖాభివృద్ధికి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద పీట వేయ‌ను న్నారు. మొత్తంగా వ‌చ్చే ఐదుమాసాల‌కు సంబంధించి బ‌డ్జెట్ శ్రేయోదాయ‌కంగా ఉండేలా స‌ర్కారు ప్ర‌య‌త్నం చేస్తోంది.