ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సోమవారం నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మకాం చేయనున్నారు. గత 15 రోజుల కిందటే ఆయన ఇక్కడ పర్యటించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఆయన హాజరయ్యారు. అలాంటిది .. కేవలం 15 రోజుల వ్యవధిలోనే మరోసారి పిఠాపురంలో ఆయన పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇది అధికారికంగా చేపడుతున్న పర్యటనే అయినా.. వెనుక కీలక రాజకీయ వ్యవహారం ఉందని తెలుస్తోంది.
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. నాయకుల మధ్య దాడులు కూడా చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై ఇప్పటికి రెండు సార్లు దాడులు జరిగాయి. అయితే.. దీనివెనుక ఎవరు ఉన్నారన్న విషయంపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. ఇక, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలోనూ.. జనసేన నాయకులు దూకుడు ప్రదర్శించారు.
టీడీపీ నేతలు.. జనసేన పార్టీ కండువాలు వేసుకోకుండా తిరుగుతున్నారని.. రాష్ట్రంలో జనసేన పార్టీ కూడా ప్రభుత్వంలో భాగంగా ఉందని, అసలు ఈ పార్టీ లేకపోతే, ప్రభుత్వం వచ్చేది కాదన్నది వారు బహిరంగంగా చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సఖ్యత సన్నగిల్లుతోంది. కీలకమైన, అందునా పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే మిత్రపక్షాల మధ్య ఇలా వివాదాలు చెలరేగుతుండడంతో జనసేన అధినేత అలెర్ట్ అయ్యారు.
సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే మకాం వేసి.. నాయకులకు క్లాస్ ఇచ్చే పనిని చేపట్టనున్నారు. మిత్రపక్షాల ఐక్యత, పొరపొచ్చాలు లేని సఖ్యత అనే రెండు కాన్సెప్టులను వారికి వివరించనున్నారు. అదేవిధంగా కలివిడిగా ఉండాల్సినఅవసరం కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. ఇక, అసంతృప్తితో రగులుతున్న కొందరు నాయకులను కూడా ఆయన బుజ్జగించడమో.. లేదా వార్నింగ్ ఇవ్వడమో చేయనున్నారు. మొత్తానికి పవన్ అయితే.. రంగంలోకి దిగుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.