సీటు చూసుకో: రేవంత్‌కు హ‌రీష్‌రావు సంచ‌ల‌న స‌ల‌హా!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. బీఆర్ఎస్ అగ్ర‌నేత‌, మాజీ మంత్రి హ‌రీష్‌రావు సంచ‌ల‌న స‌లహా ఇచ్చారు. సీఎం సీటును లాక్కునేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ముందు త‌న సీటును కాపాడుకునేందుకు రేవంత్ జాగ్ర‌త్త ప‌డాల‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. రాజ‌కీయంగా రేవంత్‌రెడ్డిని ఫినిష్ చేసేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పార‌ని చెప్పారు. కాబ‌ట్టి.. సొంత గూటిని స‌రిదిద్దుకునేందుకు రేవంత్ ప్ర‌య‌త్నించాల‌న్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి బాట‌లో ప‌ట్టించేందుకు కేసీఆర్ అనేక చ‌ర్య‌లు తీసుకున్నార‌ని.. లేక‌పోతే.. రేవంత్ ఇంత ప్ర‌శాంతంగా పాల‌న సాగించేవాడు కాద‌న్నారు. రాష్ట్ర అభివృద్ధి కోస‌మే కొట్టాడి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామ‌న్న విష‌యాన్ని రేవంత్ మ‌రిచిపోయి.. త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. హైద‌రాబాద్ న‌గ‌రం బాగుప‌డాల‌నే తాము కూడా కోరుతున్న‌ట్టు చెప్పారు. మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేసేందుకు ప్ర‌య‌త్నిస్తే.. తాము అడ్డు ప‌డుతున్నామ‌ని.. చెబుతున్నార‌ని, కానీ ఇది త‌ప్ప‌ని వ్యాఖ్యానించారు.

మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌కు బీఆర్ఎస్ ఎప్పుడూ వ్య‌తిరేకం కాద‌న్నారు. కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్ర‌మే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌డుతున్న ప్ర‌భుత్వం ఇక్క‌డి బాధితుల‌కు కూడా.. గ‌తంలో తాము మ‌ల్ల‌న్న సాగ‌ర్ బాధితుల‌కు ఇచ్చిన విధంగా ప‌రిహారం ఇచ్చి ఇళ్లు క‌ట్టించాల‌ని కోరారు. పాద‌యాత్ర చేసేందుకు త‌న‌కేమీ ఇబ్బందిలేద‌ని అయితే.. రేవంత్ కూడా రావాల‌ని.. వ‌చ్చేప్పుడు ఒంట‌రిగానే రావాల‌ని హ‌రీష్ రావు కోరారు.

“హైదరాబాద్ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దాం. కానీ, రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రావాలి.” అని హ‌రీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ ఉంది కాబ‌ట్టే.. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యార‌న్న విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోయినా.. తెలంగాణ స‌మాజం గుర్తు పెట్టుకుంద‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌ని హ‌రిష్ రావు జోస్యం చెప్పారు. 100 సీట్ల‌ను(117 మొత్తం సీట్లు) తామే గుండుగుత్త గా కైవ‌సం చేసుకుంటామ‌న్నారు.