వైఎస్ కుటుంబానికి చెందిన ఆస్తుల వివాదంలో దాదాపు అందరూ స్పందించేశారు. వైఎస్ కుటుంబంలోని వైవీ సుబ్బారెడ్డి, విజయమ్మ, షర్మిల ఏం జరిగిందో చెప్పేశారు. ఎవరి వాదన వారిది కావొచ్చు. ఎవరి భావన వారికి ఉండొచ్చు. కానీ, విజయమ్మ, షర్మిలలు చెప్పిన విషయాలకు ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి..వారు చెప్పాల్సింది చెప్పేశారు. ఇక, ఇప్పుడు మిగిలింది.. ఈ విషయంలో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న వైఎస్ తనయుడిగా జగనే. గత పది రోజులుగా ఆయన ఈ విషయంపై మౌనంగానే ఉన్నారు.
తనవారి ద్వారా(వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, మీడియా) ఈ వ్యవహారంపై చెప్పాలని అనుకున్నది చెబుతున్నారని తెలుస్తోంది. అయినప్పటికీ.. ఫిజికల్‌గా జగన్ మీడియా ముందుకైనా రావాలి. లేదా లేఖ రూపంలో అయినా.. స్పందించాలి. ఈ రెండు ఇప్పటి వరకు జరగలేదు. ఇక, ఇప్పటి వరకు అందరి వేళ్లూ విజయమ్మ వైపు చూపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కూడా రియాక్ట్ అయ్యారు. తన మాటను చెప్పేశారు. ఇక, మిగిలింది కీలకమైన జగన్ నోటి నుంచి ఏం చెబుతారన్నదే.
ఈ విషయంలో ఆయన తనను తాను రక్షించుకునే పని చేస్తారా? లేక.. వాస్తవాలు చెబుతారా? అన్నది కూడా కీలకంగా మారింది. వాస్తవాలు చెబితే.. ఈ సమస్యకు ఎంతో కొంత పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. ఓట్రింపు ధోరణిని ప్రదర్శిస్తే.. ఇంకా సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అసలు ఈ సమస్య ఎక్కడ ఎలా బయటకు వచ్చింది? ఎవరు బయటకు తెచ్చారు? అనే విషయాలు జగన్ నుంచే బయటకు రావాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పుడు తల్లి చెప్పినట్టుగా వైఎస్ కుటుంబ ఆస్తులు అసలు పంపిణీ కాలేదన్నది ప్రపంచానికి తెలిసింది. మరి జగన్ వైపు అయిపోయాయని.. కేవలం చెల్లిపై ప్రేమతోనే తాను ఇచ్చానని ఎంవోయూ చేసుకున్నట్టు చెబుతున్నారు. దీనిలో వాస్తవం ఎంత?
అదేవిధంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు సంబంధించి కూడా.. అసలు ఏం జరిగింది? అనే విషయాలను విజయమ్మ, షర్మిల పూర్తిగా చెప్పనందున జగన్‌దీనిపై స్పందించాల్సి ఉంది. అలానే.. అసలు పంపిణీ కానిఆస్తుల విషయంలో జగన్.. డివిడెండ్ ఎలా ఇస్తారన్నది కూడా ప్రశ్నగా మారింది. ఇలానే అనే కప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాల్సి ఉంది. లేకపోతే.. ఆయన తప్పు చేసినట్టుగానే ప్రజలు భావించడంలో ఎలాంటిసందేహం లేదు. మరి ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.