అమిత్ షా మీటింగుతో సత్యకుమార్ చెప్పిందిదేనా?

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌.. వైసీపీ అధినేత‌, మాజీసీఎం జ‌గ‌న్‌పై కేంద్రానికి ఫిర్యాదులు మోశారు. తాజాగా ఆయ‌న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను క‌లుసుకుని.. జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయి లో ఫిర్యాదుల చిట్టాను విప్పారు. ఏపీని ఆయ‌న నాశ‌నం చేశార‌ని, ఇప్పుడు ఆ ధ్వంస‌మైన పాల‌న‌ను గాడి లో పెట్టాల్సి వ‌స్తుంటే త‌ల‌నొప్పిగా మారింద‌న్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌ను కూడా వాడేశార‌ని.. చెప్పారు. దీంతో ఇప్పుడు నిధులు లేక ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు చెప్పారు.

అంతేకాదు.. వైసీపీ అధినేత.. కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌ని కూడా స‌త్య‌కుమార్ చెప్పిన‌ట్టు తెలిసింది. ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఆయ‌న హిందీలోకి త‌ర్జుమా చేయించి అమిత్‌షాకు అందించి.. పైగా దీనిపై పూర్తి వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. హ‌రియాణాలో వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాన్ని కూడా జగన్ త‌ప్పుబ‌ట్టిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈవీఎంల‌పై జ‌గ‌న్ సందేహాలు వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీనిని కూడా స‌త్య‌కుమార్ కేంద్ర మంత్రికి వివ‌రించారు.

అదేవిధంగా గ‌త రెండు మాసాలుగా జ‌గ‌న్‌.. కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఆయ‌న కాంగ్రె స్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే అవ‌కాశం కూడా ఉంద‌ని.. ఈ విష‌యాన్ని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాల‌ని కూడా స‌త్య కుమార్ విన్నవించిన‌ట్టు తెలిసింది. అయితే.. ఆయా వివ‌రాల‌న్నీ.. జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించిన అమిత్‌షా.. మౌనంగా ఉన్న‌ట్టు స‌మాచారం. తాను చూసుకుంటాన‌ని స‌త్య‌కుమార్‌కు భ‌రోసా కూడా ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు.. ఇక‌, జ‌గ‌న్‌కు మూడిందే అని కామెంట్లు చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు బీజేపీ నేత‌లు సంబ‌రాలు చేసుకుంటున్న స్థాయిలో కేంద్రం నుంచి జ‌గ‌న్‌కు సెగ త‌గులుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. బీజేపీ నేత‌లు.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా జ‌గ‌న్‌తో స‌త్సంబంధాల‌నే కొన‌సాగించారు. పైగా.. ఇప్పుడు కూడా.. కేంద్రంలో ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. జ‌గన్ మ‌ద్ద‌తు ఖాయం. ఆయ‌న కాంగ్రెస్‌వైపు చూసినా.. ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అనేది క‌లే! ఈ నేప‌థ్యం లో ప్ర‌స్తుతం స‌త్య‌కుమార్ చేసిన ఫిర్యాదుల‌పై ప‌రిశీల‌న అయితే ఉంటుంది కానీ.. బీజేపీ నాయ‌కులు పెట్టుకున్న ఆశ‌ల మేర‌కు ఏమీ జ‌రిగే ఛాన్స్ లేద‌ని అంటున్నారు.