2.5/5
2Hr 16 Min | Thriller | 16-02-2024
Cast - Sundeep Kishan, Kavya Thapar, Varsha Bollamma, Vennela Kishore, Harsha Chemudu and others
Director - VI Anand
Producer - Anil Sunkara, Razesh Danda
Banner - AK Entertainments, Hasya Movies
Music - Shekar Chandra
గత రెండుమూడేళ్లలో హారర్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. వాటిని ఇమేజ్ ఉన్న హీరోలు చేయడం వల్ల మార్కెట్ పెరిగి రీచ్ కూడా విస్తరిస్తోంది. అందుకే ఊరిపేరు భైరవకోన మీద ముందు నుంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేయడం ద్వారా కంటెంట్ మీద తామెంత నమ్మకం పెట్టుకున్నామో టీమ్ స్పష్టం చేసింది. సందీప్ కిషన్ దర్శకుడు విఐ ఆనంద్ మొదటి కలయికగా రూపొందిన ఈ చిత్రానికి అనిల్ సుంకర సమర్పకులు కాగా రాజేష్ దండ నిర్మాతగా వ్యవహరించారు.
కథ
స్టంట్ మాస్టర్ గా పనిచేసే బసవలింగం(సందీప్ కిషన్) ఒక లక్ష్యం కోసం దొంగతనం చేసి స్నేహితుడు జాన్(వైవా హర్ష), దారిలో గాయాలతో పడున్న గీత(కావ్య థాపర్)తో కలిసి పారిపోతూ అనుకోకుండా భైరవకోనకు చేరుకుంటాడు. రాత్రిపూట అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులను చూసి వీటి వెనుక ఏదో రహస్యం ఉందని తెలుసుకుంటాడు. పెద్దమనిషిగా భావించే రాజప్ప(రవిశంకర్)ని కలుసుకున్నాక ఓ కొత్త బాధ్యత వచ్చి పడుతుంది. ఈ మొత్తం వ్యవహారానికి తాను ప్రాణంగా ప్రేమించిన భూమి(వర్ష బొల్లమ)కు సంబంధం ఉంటుంది. అంతుచిక్కని పద్మవ్యూహం నుంచి బసవ బృందం ఎలా బయటపడింది, తన టార్గెట్ ని ఎలా చేరుకుందనేది అసలు స్టోరీ.
విశ్లేషణ
హారర్ విభాగంలో థ్రిల్లర్ ని కలపడం ఒక కళ. దర్శకుడు విఐ ఆనంద్ ఆ సాహసం చేసేందుకు పూనుకోవడం మంచి ఆలోచనే. ఎక్కడో పాడుబడిన ఊరిలో హీరో గ్యాంగ్ ప్రవేశించడం, అక్కడ విస్తుగొలిపే సంఘటనలు చవి చూడటం, వాటి వెనుక విభ్రాంతి కలిగించే వాస్తవాలు కప్పి పెట్టడం ఇదంతా ఆసక్తి రేపే సెటప్పే. అనుమానం లేదు. అయితే దీన్ని రసవత్తరంగా చెప్పాలంటే కావాల్సింది బలమైన స్క్రీన్ ప్లే. దర్శకుడు విఐ ఆనంద్ పనితనం ఎక్కడికి పోతావు చిన్నవాడాలో చూశాం. టైగర్ ని హ్యాండిల్ చేసిన విధానాన్ని మెచ్చుకున్నాం. ఒక్క క్షణం ఫ్లాప్ అయినా సరే అందులోనూ ఆనంద్ సాంకేతిక పనితనం కనిపిస్తుంది. టెక్నికల్ గా అతను స్ట్రాంగే.
భైరవకోన అనే ఊహాతీత ప్రపంచాన్ని సృష్టించిన ఆనంద్ దాని నేపథ్యం ఎంత బలంగా ఉంటే ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవుతారనేది గుర్తుపెట్టుకునే పరిచయ సన్నివేశంతో మొదలుపెట్టి బసవలింగం అక్కడ ఎంట్రీ ఇచ్చాక జరిగే సంఘటనల దాకా ఓ మోస్తరుగా రాసుకుంటాడు వెళ్ళాడు. ఇక్కడిదాకా పెద్దగా ఇబ్బంది లేదు. మైండ్ బ్లోయింగ్ అనిపించకపోయినా మరీ చిరాకు కలిగించేలా కథనం లేకపోవడంతో కాస్త హాస్యం కాస్త భయంతో టైం పాసవుతూ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు గేరు మార్చి విశ్రాంతి కార్డు దగ్గర ఇచ్చే ట్విస్టు వావ్ కాదు ఓకే అనే ఫీలింగ్ తోనే బయటకు పంపిస్తుంది. భూమి పాత్ర తాలూకు సస్పెన్స్ దాచి పెట్టి మేనేజ్ చేశారు
సెకండ్ హాఫ్ మొదలయ్యాక మరింత భీతిని, షాకింగ్ ఎలిమెంట్స్ ని ఆశించే ప్రేక్షకుల ఆలోచనలకూ భిన్నంగా విఐ ఆనంద్ ఇచ్చిన ట్రీట్ మెంట్ భైరవకోన గ్రాఫ్ ని తగ్గించేస్తుంది. ముఖ్యంగా బసవ, భూమిల మధ్య లవ్ ట్రాక్ సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. పైగా ఆమెకు పెట్టిన ఊరి ఫ్లాష్ బ్యాక్ రొటీన్ గా అనిపించడంతో పాటు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చూపించలేదు. దీంతో క్రమంగా ముందే ఏం జరుగుతుందో ఊహించేలా లూజ్ ఎండ్స్ మొదలైపోయాయి. కొన్ని మలుపులు బలవంతంగా అనిపిస్తాయి. భూమి ఎందుకు దూరమయ్యిందనే ప్రశ్నకు సమాధానం చూపించిన ఎపిసోడ్ అంత కన్విన్సింగ్ గా లేకపోగా హీరో బాధని రిజిస్టర్ కాకుండా అడ్డుపడింది.
క్రమం తప్పకుండా హారర్ అంశాలను జొప్పించుకుంటూ వచ్చినా ఒకదశ దాటాక అరుంధతి, జాంబీ రెడ్డి తరహా ఛాయలు స్పష్టంగా కనిపించేయడంతో భైరవకోన ప్రత్యేకత తగ్గుతూ వెళ్ళింది. విరూపాక్ష విజయం సాధించడానికి ప్రధాన కారణం ఒకే టెంపోని చివరి దాకా మెయింటైన్ చేయడం. ఎవరు ఎలా ఎందుకు ప్రవర్తిస్తారో ముందే క్లూస్ ఇవ్వకుండా కథనాన్ని నడిపించడం. కానీ విఐ ఆనంద్ అంత క్రియేటివ్ గా ఆలోచించలేదు. సందీప్ కిషన్, వర్ష బొల్లమ, రవిశంకర్ ల మధ్య కనెక్షన్ ని కాస్త వైవిధ్యంగా లింక్ చేయాలని చేసిన ప్రయత్నంలో నెరేషన్ ఎంగేజింగ్ గా ఉందో లేదో చూసుకోలేదు. దీంతో క్లైమాక్స్ దగ్గరయ్యే కొద్దీ రొటీన్ ఫ్లేవర్ పెరిగిపోయింది.
ఈ జానర్ ని ఇష్టపడే వాళ్ళను ఊరిపేరు భైరవకోన మరీ తీవ్రంగా నిరాశపరచకపోవచ్చేమో కానీ కొత్తగా ఏదో ఆశించి భయం, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్ అన్నీ వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటే మాత్రం హాఫ్ మీల్స్ తిన్న ఫీలింగే కలుగుతుంది. తన అస్త్రమైన ఇంటెలిజెంట్ స్టోరీ టెల్లింగ్ ని విఐ ఆనంద్ ఇందులో సరిగ్గా వాడుకోకపోవడంతో వచ్చిన ఇబ్బందిది. పైగా కామెడీ ఉంటేనే మాస్ కి మరింత దగ్గరవుతామని పెట్టిన సీన్లు అంతగా పేలలేదు. నటీనటుల టైమింగ్, అనుభవం కొంత సహాయపడినా గంభీరంగా సాగాల్సిన గమనాన్ని వినోదాత్మకంగా మార్చే ప్రయత్నం చేయడం కొంత దెబ్బ కొట్టింది. చివరి ఘట్టాన్ని పెద్దగా ఎగ్జైట్ మెంట్ లేకుండా ముగించేశారు.
నటీనటులు
సందీప్ కిషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్డ్ గా చేశాడు. రెగ్యులర్ అంశాలు లేకుండా కొత్త తరహా పెర్ఫార్మన్స్ ని డిమాండ్ చేయకపోయినా ఉన్నంతలో ఓకే అనిపించాడు. కావ్య థాపర్ పర్వాలేదు. యాక్టింగ్ స్కోప్ తక్కువే. వర్ష బొల్లమకు నిడివి ఎక్కువ లేకపోయినా కనిపించినంత సేపు హడావిడి తప్ప ఏం లేదు. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కాసిన్ని నవ్వులు పంచినా అవి సోసోనే. రవిశంకర్ కు ఇలాంటివి కొట్టిన పిండే కావడంతో అలవోకగా ఒదిగిపోయాడు. సీనియర్ నటి వడివుక్కరసికి బిల్డప్ ఇచ్చినంత వెయిట్ క్యారెక్టర్ లో లేదు. జయప్రకాశ్, మైమ్ గోపి, బ్రహ్మాజీ కొన్ని సీన్లకే పరిమితం. ఊరి జనంగా చిన్నా చితక ఆర్టిస్టులు బోలెడున్నారు.
సాంకేతిక వర్గం
శేఖర్ చంద్ర పనితనం పాటల రూపంలో ఆల్రెడీ బయటపడింది. తెరమీద కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. నేపధ్య సంగీతం బాగానే ఉన్నప్పటికీ ఒకదశ దాటాక బీజీఎమ్ లో సౌండ్ ఎక్కువైపోయి రిథమ్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అజనీష్ లోకనాథ్ తరహాలో ప్రత్యేక ముద్ర వేయలేకపోయాడు. రాజ్ తోట ఛాయాగ్రహణం అధిక శాతం చీకట్లో గడపాల్సి వచ్చినా విఐ ఆనంద్ కోరుకున్న ఇంటెన్సిటీని తెరమీద చూపించడం శాయశక్తులా కష్టపడ్డారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఇంకొంచెం పదునుగా ఉండాల్సింది. ఆర్ట్ వర్క్ బాగుంది. భైరవకోనకు తగ్గ సెటప్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఏకె – హాస్యా మూవీస్ జంట నిర్మాణ విలువలు రాజీపడకుండా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
భైరవకోన సెటప్
ఇంటర్వెల్ బ్లాక్
రెండు పాటలు
మైనస్ పాయింట్స్
రెండో సగం
ట్విస్టులు ఓవర్ డోస్
క్లైమాక్స్
ఎగుడుదిగుడు కథనం
ఫినిషింగ్ టచ్ : భయం తగ్గిన థ్రిల్
రేటింగ్ : 2.5 / 5
Gulte Telugu Telugu Political and Movie News Updates