సమీక్ష – దిల్ రుబా

2.25/5

2h 32m   |   Drama , Romantic   |   March 14, 2025


Cast - Kiran Abbavaram, Rukshar Dhillon, Kathy Davison, John Vijay

Director - Vishwa Karan

Producer - Vikram Mehra, Siddharth Anand Kumar, Ravi, Jojo Jose, Rakesh Reddy

Banner - Saregama, Sivam Celluliods

Music - SAM C.S

ఫ్లాపుల నుంచి ఉపశమనం పొందుతూ ‘క’ రూపంలో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి దిల్ రుబాగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకులను నమ్మడంలో ముందుండే ఈ యూత్ హీరో తాజాగా విశ్వ కరుణ్ కు అవకాశమిచ్చాడు. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరిగమ నిర్మాణ భాగస్వామి కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. రుక్సర్ థిల్లాన్, క్యాథీ హీరోయిన్లుగా నటించిన ఈ లవ్ కం యాక్షన్ డ్రామాకు ప్రమోషన్లు బలంగా చేశారు. థియేటర్లలో అడుగు పెట్టిన దిల్ రుబా ప్రేక్షకుల హృదయాలను గెలిచిందా

కథ

ఆవేశం నిండిన కుర్రాడు సిద్దు (కిరణ్ అబ్బవరం). మ్యాగీ (క్యాథీ) తో ప్రేమ విఫలమయ్యాక మంగళూరు వచ్చి కాలేజీలో చేరతాడు. వెంటపడి చిరాకు పుట్టించిన అంజలి (రుక్సర్ థిల్లాన్) ని ప్రేమిస్తాడు. ఈ అమ్మాయి విషయంలో సాటి విద్యార్ధితో జరిగిన గొడవ వల్ల పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. దీంతో రెండో లవ్ కూడా బ్రేకప్ అవుతుంది. ఇది తెలిసి అమెరికాలో ఉన్న మాజీ ప్రియురాలు మ్యాగీ ఆరు నెలల గర్భంతోనే ఈ జంటను కలిపేందుకు ఇండియా వస్తుంది. వీళ్ళ జీవితంలో జోకర్ (జాన్ విజయ్) అనే డాన్ వస్తాడు. అసలు సిద్దు లైఫ్ లో ఎందుకన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి, వాటి నుంచి ఎలా బయటపడి గెలిచాడనేదే స్టోరీ.

విశ్లేషణ

ప్రేమకథలకు ఒక నిర్దిష్టమైన గ్రామర్ ఉంటుంది. వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ అంత సులభంగా జొరబడవు. పెద్ద మార్కెట్ ఉన్న స్టార్ హీరో అయితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కానీ అప్ కమింగ్ స్టేజిలో ఉన్న కుర్రాళ్ళ మీద ఈ మిక్స్చర్ వర్కౌట్ కాదు. అయినా సరే దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సాహసానికి పూనుకున్నాడు. తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం సారీ, థాంక్స్ వాడడానికి ఇష్టపడని ఒక స్టూడెంట్ మానసిక సంఘర్షణని ఆధారంగా చేసుకుని దానికి ఇద్దరమ్మాయిలను ముడిపెట్టి కొత్త ప్రయత్నం చేయబోయాడు. లైన్ గా వినడానికి కొంచెం విభిన్నంగా అనిపించే ఇలాంటి నేపధ్యాలు తెరపైకి మార్చే క్రమంలో తప్పులు లేకుండా చూసుకోవాలి.

సిద్దు పరిచయం కాస్త ఆసక్తి రేపేలానే మొదలవుతుంది. అలాగే మ్యాగీ ఇంట్రో కూడా బొమ్మరిల్లు హాసిని తరహాలో జాలీగా అనిపించి ఇంటరెస్ట్ పెంచుతుంది. ఆ తర్వాత అతనెందుకు అలా ఉన్నాడని చెప్పేందుకు చూపించిన తండ్రి ఫ్లాష్ బ్యాక్ దగ్గరి నుంచే సమస్య మొదలైపోయింది. సిద్దు అంత మొండిగా థాంక్స్, సారీ పట్ల గిరి గీసుకుని ఉన్నాడని చెప్పిన కారణం కన్విన్సింగ్ గా లేదు సరికదా ఎప్పుడో శోభన్ బాబు కాలం నాటి సినిమాలను గుర్తు చేసింది. హీరో గతం ఇంటెన్స్ లేనప్పుడు వర్తమానంలో ప్రవర్తనకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. విశ్వ కరుణ్ దీన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. క్లాస్ మేట్ గొడవ, కొట్టుకోవడం ఇవన్నీ రొటీన్ గా వెళ్లిపోతాయి.

పూరి జగన్నాధ్, సందీప్ వంగా లాంటి వాళ్ళ స్ఫూర్తితో క్యారెక్టరైజేషన్లు రాసుకోవడం మంచిదే. కానీ వాళ్ళు ఎందుకు సక్సెసయ్యారనే లోతైన శల్యపరీక్ష చేసుకోకుండా మన హీరోలకు ఆపాదించాలని చూస్తే బోల్తా పడటం ఖాయం. దిల్ రుబాలో జరిగింది అదే. ఇద్దరు నాన్ లోకల్ స్టూడెంట్స్ కొట్టుకునే దానికి ఏకంగా సింహాద్రి రేంజ్ లో ఇంటర్వెల్ బాంగ్ ని ఎందుకు డిజైన్ చేశాడో అర్థం కాదు. కారణం ఉంది కానీ ప్రెజెంట్ చేసిన విధానం బాలేకపోవడంతో ఇంత బిల్డప్ అవసరమా అనిపించేలా ఫైట్లు, ఛేజులు జరిగిపోతాయి. దీని వల్ల కనెక్టివిటీ సమస్య వచ్చి ఎటెటో వెళ్తున్న భావన కలుగుతుంది. సరే ఇంటర్వెల్ దాకా పాటలు, బీజీఎమ్ హడావిడితో నెట్టుకొచ్చారనుకుందాం.

సెకండాఫ్ లో మ్యాగీని అమెరికా నుంచి తీసుకొచ్చాక మరో ప్రహసనం మొదలవుతుంది. బలవంతంగా ఇరికించిన విలన్ జాన్ విజయ్ పాత్ర ద్వారా కిరణ్ కి అన్నేసి ఎలివేషన్లు ఇచ్చిన విశ్వకరుణ్ తాను ఇటు ప్రేమకు, అటు యాక్షన్ కి రెండింటికి న్యాయం చేయలేక బ్యాలన్స్ తప్పుతున్న వైనాన్ని గుర్తించలేదు. జైలర్, అరవింద సమేత వీర రాఘవ, పొగరు లాంటి సినిమాల రెఫరెన్సులు తీసుకుని పెట్టిన కడప బ్యాచ్ ఎపిసోడ్ మరీ కృతకంగా ఉంది. తల్లిని చంపడానికి వెళ్లిన రౌడీలను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడుకు కేవలం మాటల ద్వారా ఆపడమనేది మంచి హై ఇచ్చే ఎపిసోడ్. కానీ దిల్ రుబా లాంటి కథల్లో అవి సింక్ కావు. అందుకే పేలలేదు.

తెరమీద సిద్దులో ఏదైతే కన్ఫ్యూజన్ ఉంటుందో అదే డైరెక్టర్ లోనూ ఉండటం దిల్ రుబాకున్న ప్రధాన లోపం. ఎక్స్ లవర్ వచ్చి పాత బాయ్ ఫ్రెండ్ ప్రేమని సెటిల్ చేయాలనే ఆలోచన వెరైటీగానే ఉంది కానీ దాన్ని ఎంగేజింగ్ గా చెప్పడం ఎలానే కసరత్తు సరిగా జరగలేదు. దీని వల్ల భరించలేని ప్రహసనం మన పరీక్షకు ఓపిక పెడుతుంది. పైగా జాన్ విజయ్ ని కెజిఎఫ్ టైపులో పరిచయం చేసి, ఆ తర్వాత సిల్లీగా మార్చి, ప్రీ క్లైమాక్స్ లో మళ్ళీ క్రూరంగా మలుపు తిప్పి చివరికి రెగ్యులర్ స్టైల్ లో మట్టుబెట్టడం లాంటి అవసరం లేని తతంగాలు దిల్ రుబాలో చాలా ఉన్నాయి. కాలేజీలో జరిగే ఏ సీనూ కనీస స్థాయిలో మెప్పించలేక నీరసం తెప్పించేలా జరిగిపోతాయి.

భావోద్వేగమైనా సందేశమైనా మోతాదుకి మించి రుద్దకూడదు. కానీ దిల్ రుబాలో హీరో వ్యక్తిత్వాన్ని అతిగా ప్రొజెక్ట్ చేయబోయిన విశ్వ కరుణ్ అయిదారు సబ్ ప్లాట్స్ ని ఒకేదాంట్లో కుక్కేయడం వల్ల ఏ పదార్థం రుచిగా అనిపించక చివరికి ఆకలినే చంపేసేలా మారింది. బిర్యానిలో గొడ్డుకారం ఎక్కువైతే ఆరోగ్యవంతుడికి కూడా జబ్బు చేస్తుంది. ఆటిట్యూడ్, క్యారెక్టర్ రెండూ వేరనే మెసేజిని టైటిల్ కార్డులోనే వేసిన దర్శకుడు ఎమోషన్ ఎలివేషన్ రెండూ సరైన మోతాదులో ఉంటేనే పండుతాయనే ప్రాధమిక సూత్రం మర్చిపోయాడు. ఫలితంగా దిల్ రుబాకు ఉండాల్సిన దిల్ పక్కకెళ్ళిపోయి అవసరం లేని రుబాబులన్నీ మాస్ మసాలా పేరుతో ఖంగాళీగా మార్చాయి.

నటీనటులు

కిరణ్ అబ్బవరం అందంగా కనిపించాడు. మేకోవర్ బాగుంది. నటన మెరుగుపడింది. అయినా హెవీ ఇంటెన్స్ ఉన్న సన్నివేశాల్లో కొన్ని చోట్ల తేలిపోతున్నాడు. డిక్షన్ (వాక్సుద్ధి) మీద మరింత శ్రద్ధ పెట్టాలి. మాస్ ట్రాప్ లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను మీకు బాగా కావాల్సినవాడిని, మీటర్ లో చేసిన తప్పులే దిల్ రుబాలోనూ రిపీట్ అయ్యాయి. లేని కమర్షియల్ యాంగిల్ ని ఎక్కువగా ఊహించుకోకుండా, బిల్డప్పులు జోలికి వెళ్లకుండా తనకు సెట్టయ్యే పాత్రలు ఎంచుకుంటే ఆడియన్స్ కి మరింత దగ్గరవ్వొచ్చు.

రుక్సర్ థిల్లాన్ చలాకీగా బాగానే ఉంది. డబ్బింగ్ ఆర్టిస్టు సహాయంతో మంచి జోష్ ఇచ్చారు. ఒకదశ దాటాక తనకూ చేయడానికి ఏం లేక తేలిపోయింది. రెండో హీరోయిన్ కాథీ డావిసన్ పూర్తిగా మిస్ మ్యాచ్. చాలా సీన్లలో లిప్ సింక్ కూడా కుదరనంత వీక్ గా ఉంది. ప్రాధాన్యం ఎక్కువే ఉన్నా పైసా ప్రయోజనం లేకపోయింది. నరేన్, ఆనంద్, గెటప్ శీను, సత్యలు అంతా రొటీనే. ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. జాన్ విజయ్ సైతం సోసోగా మిగిలిపోయాడు. కామెడీకి బోలెడు స్కోప్, ఆర్టిస్టులున్నా వాడుకోలేదు. పైపై మెరుగులతో సర్దేశారు.

సాంకేతిక వర్గం

సంగీత దర్శకుడు సామ్ సిఎస్ బెస్ట్ ఆల్బమ్స్ లో ఇది ఒకటని చెప్పలేం కానీ పాటలు డీసెంట్ గా ఉన్నాయి. ఒకటి రెండు యూత్ కి ఎక్కేస్తాయి. బీజీఎమ్ వరకు పెద్దగా యెంచదగ్గ లోపాలేం లేవు. విశ్వాస్ డేనియల్ ఛాయాగ్రహణం మంచి రిచ్ నెస్ తీసుకొచ్చింది. పెట్టిన ఖర్చుని చూపించడంలో సక్సెసయ్యింది. ఫ్రేమ్స్ కలర్ ఫుల్ గా ఉన్నాయి. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ లో కొంత కోత జరిగి ఉంటే నిడివి తగ్గి కొంచెం బెటర్ ఉండేదేమో. డైలాగులు కొన్ని అక్కడక్కడా బాగున్నాయి. విశ్వ కరుణ్ పెన్ను వేదాంతం ఎక్కువ, విషయం తక్కువ టైపులో సాగింది. నలుగురు నిర్మాతలు చేతులు కలపడంతో ఖర్చుపరంగా రాజీ లేదు. ప్రొడక్షన్ క్వాలిటీ పుష్కలంగా కనిపించింది.

ప్లస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ కొంత
ఒక యాక్షన్ ఎపిసోడ్
సామ్ సిఎస్

మైనస్ పాయింట్స్

హీరో క్యారెక్టరైజేషన్
హీరోయిన్ ట్రాక్స్
విసిగించే సెకండాఫ్
అవసరం లేని మాస్ అంశాలు

ఫినిషింగ్ టచ్ : పనవ్వలేదబ్బా

రేటింగ్ : 2.25 / 5