2.75/5
2Hr 30 Mins | Action | 27-03-2025
Cast - Chiyaan Vikram, SJ Suryah, Suraj Venjaramoodu, Dushara Vijayan
Director - SU Arun Kumar
Producer - Riya Shibu
Banner - HR Pictures
Music - GV Prakash
చియాన్ విక్రమ్ అంటే ఒకప్పుడు టాలీవుడ్ లో మహా క్రేజ్ ఉండేది. అపరిచితుడు తెచ్చిన ఇమేజ్ తర్వాత సినిమాల డబ్బింగ్ హక్కులను ఎగబడి కొనేలా చేసింది. అటుపై వరస ఫెయిల్యూర్స్ మార్కెట్ డౌన్ చేసినా తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే కొత్త రిలీజ్ ఏది వచ్చినా మినిమమ్ ఆడియన్స్ ఉంటారు. తంగలాన్ అంత నెగటివ్ వేవ్ లోనూ మంచి వసూళ్లే రాబట్టింది. తాజాగా వీరధీరశూర పార్ట్ 2 తో ప్రేక్షకుల ముందుకొచ్చాడీ విలక్షణ నటుడు. మరి ఈసారైనా మెప్పించేలా ఉన్నాడో లేదో చూద్దాం.
కథ
ఊరిలో పెద్ద కుటుంబమున్న రవి (30 ఇయర్స్ పృథ్వి)ది దుర్మార్గ మనసత్త్వం. ఇతనితో పాటు కొడుకు కన్నా (సూరజ్ వెంజరమూడు) ని జాతర జరిగే ఒక్క రాత్రిలో ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేసుకుంటాడు ఎస్పి అరుణగిరి (ఎస్జె సూర్య). ఈ ప్లాన్ తెలుసుకున్న రవి ఎప్పుడో తనను వదిలేసి వెళ్ళిపోయిన కాళీ (విక్రమ్) సహాయం కోరతాడు. కిరాణా కొట్టు పెట్టుకుని భార్య పిల్లలతో సంతోషంగా ఉన్న అతను ఇష్టం లేకపోయినా పెద్దాయన వచ్చి అడగటంతో ఒప్పుకుంటాడు. ఎస్పిని మట్టుబెట్టే ప్రమాదకర పనికి సిద్ధపడతాడు. ముందు సులభం అనుకున్నది ఎంత కష్టమో దిగాక తెలుస్తుంది. రక్తపాతం మొదలవుతుంది. కాళీ గతం కూడా అప్పుడే తెలుస్తుంది. ఆపై జరిగేదే స్టోరీ.
విశ్లేషణ
కొందరు తమిళ దర్శకులది విలక్షణ శైలి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ప్రయోగాలు చేసేందుకు తహతహలాడతారు. ఖైదీతో అది ఋజువు చేసుకోబట్టే లోకేష్ కనగరాజ్ ఇప్పుడు రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే రేంజ్ కు చేరుకున్నాడు. వీరధీరశూర దర్శకుడు అరుణ్ కుమార్ కూడా ఇదే పంథాని ఫాలో అయ్యే ప్రయత్నం చేశాడు. లైన్ పరంగానే ఇందులో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. ఒక చెడ్డ పోలీస్ నుంచి ఒక దుర్మార్గుడిని కాపాడేందుకు మంచివాడైన హీరో రంగంలోకి దిగడమనేది ఖచ్చితంగా కొత్త పాయింట్. వీటిని ముడిపెడుతూ ముప్పాతిక సినిమాని చీకటిలో నడిపించేలా చేయడం అంతకన్నా పెద్ద సాహసం. అరుణ్ తెలివి ఇక్కడ మొదలవుతుంది.
వీరధీరశూర టేకాఫ్ చాలా మాములుగా జరుగుతుంది. ఒక ఇరవై నిమిషాల పాటు విక్రమ్ జాడ లేకుండా కేవలం విలన్ ఇంటి బ్యాక్ డ్రాప్ తో ఒక సమస్యను ముడిపెట్టి అసలు కాంఫ్లిక్ట్ ని నెమ్మదిగా రిజిస్టర్ చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఒక పది నిమిషాల పాటు ఏం జరుగుతుందో సరిగా అర్థం కాదు. కాళీని పరిచయం చేశాక అసలు కథనం వేగమందుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ గా ఎస్జె సూర్య పాత్రలోని షేడ్స్ ని చూపిస్తూ రెండు వర్గాల మధ్య దోబూచులాటని ఆసక్తికరంగా నడిపించుకుంటూ వెళ్లిన అరుణ్ కుమార్ ఇంటర్వెల్ ముందు వరకు ఎక్కడా టెంపో తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. విశ్రాంతిని కూడా వెరైటీగా కట్ చేసి తన మార్కు చూపించుకున్నాడు.
అసలు కాళీ ఎవరు, అతనికి పృథ్వి ఫ్యామిలీకి గ్యాప్ ఎందుకు వచ్చిందనే ఫ్లాష్ బ్యాక్ తో సెకండాఫ్ మొదలుపెట్టిన అరుణ్ కుమార్ ఇక్కడ కాస్త నెమ్మదిస్తాడు. అరుణగిరికి సరెండర్ అవుతూ కాళీ హఠాత్తుగా మారిపోయే కీలకమైన సన్నివేశం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. దానికి లీడ్ చూపించారు కానీ అరివీరశూరుడైన అతను కుటుంబం ప్రమాదంలో ఉందని తెలిసి బేలగా ప్రవర్తించడం సరిగా కుదరలేదు. బాషా రేంజులో బిల్డప్స్ ఇచ్చిన వైనం కొత్త ఎలివేషన్లు ఆశించేలా చేస్తుంది. కానీ కొన్ని చోట్ల మినహా కాళీని అండర్ టోన్ లో ప్రెజెంట్ చేయడానికే అరుణ్ కుమార్ మొగ్గు చూపడంతో మాస్ కి సరిపడా డోస్ ఇంకా ఉంటే బెటర్ అనిపిస్తుంది.
ఖైదీ తరహాలో గూస్ బంప్స్ ఎపిసోడ్స్ లేకపోయినా విసుగెత్తించకుండా స్క్రీన్ ప్లేని నడిపించడంలో అరుణ్ కుమార్ సక్సెసయ్యాడు. కాకపోతే ఒకదశ దాటాక పాత్రలు ఎక్కువ సేపు సంభాషించుకోవడం, పెద్దగా మలుపులు లేకుండా ఊహించేలా కథనం సాగడం కొంత మైనస్ అయ్యింది. ఇలా ఫీలైన ప్రతిసారి కొత్తగా అనిపించే ట్రీట్ మెంట్ తో మలుపులు ఇచ్చి బోర్ లేకుండా చేశాడు. అయితే పార్ట్ 2 అనడం వెనుక ఉద్దేశం ఏదైనా బోలెడు ప్రశ్నలు ఖాళీగా వదిలేశారు. అసలు ఇంత పగలు ప్రతీకారాలకు కారణమైన దిలీప్ అనే వ్యక్తి ఎవరు, కాళీకి ఏమవుతాడు, రవికి వరసల పరంగా విక్రమ్ కున్న బంధుత్వం ఏంటనేది సరైన రీతిలో అర్ధమయ్యే చూపించలేదు.
విక్రమ్, తుషారా విజయన్ మధ్య రొమాన్స్ కొంచెం అక్కడక్కడా అనవసరం అనిపించేలా సాగినా ఆ బలహీనతని యాక్షన్ ఎపిసోడ్లు కవర్ చేసుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా చివరి 45 నిముషాలు గ్రిప్పింగ్ గా సాగే తీరుని మెచ్చుకోకుండా ఉండలేం. కన్నా, అరుణగిరిలకు ఇచ్చిన ముగింపు కొంచెం రెగ్యులర్ గానే అనిపించినా వాటికి ముందు వెనుక చూపించిన సన్నివేశాల ఘాడత చాలా బాగా కుదిరింది. ఎక్కడైనా విసుగు అనిపించినా మరుక్షణం హై ఇచ్చే సీన్ తో సర్దుకుంటూ వచ్చాడు అరుణ్ కుమార్. టెక్నికల్ విషయాల మీద అతనికున్న పట్టు ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు గంటల నలభై నిమిషాలతో ఇలాంటి కంటెంట్ నడపడం చిన్న విషయం కాదు.
ఫైనల్ గా చెప్పాలంటే పెద్దగా అంచనాలు లేకుండా వెళ్తే సర్ప్రైజ్ ఇస్తాడు వీరధీరశూర. టైటిల్ ని బట్టి ఇదేదో ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లతో నిండిన ఫక్తు మసాలా బొమ్మ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ వాటిని మరీ అతిగా కాకుండా మితంగా మిక్స్ చేసి సంతృప్తి పరిచేలా చేయడంలో టీమ్ విజయవంతమయ్యింది. కాస్త రొటీన్ కి దూరంగా ఉండే మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా దీన్నో ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. అయితే ఎంటర్ టైమెంట్ ఆశించి, జోకులు నవ్వులు కావాలంటే మాత్రం ఇది మీ టీ కప్పు కాదు. ట్రైలర్ చూస్తే ఏం ఆశించాలో డైరెక్టర్ ముందే చెప్పేశాడు కాబట్టి అది దృష్టిలో పెట్టుకుంటే చాలు.
నటీనటులు
చాలా కాలం తర్వాత విక్రమ్ విశ్వరూపం వీరధీరశూరలో చూడొచ్చు. ఎక్కడ ప్యాంట్ వేసుకోకుండా, ఫాషన్ జోలికి వెళ్లకుండా, మాసిపోయిన చొక్కా, పంచతోనే రియల్ మాస్ ఏంటో చూపించాడు. ఎస్జె సూర్య లాంటి లౌడ్ ఆర్టిస్టుని పూర్తిగా పక్కనపెట్టేసే రేంజ్ లో ఆధిపత్యం చూపించడం చియాన్ కు మాత్రమే సాధ్యమేమో. తుషారా విజయన్ అందం, అభినయం రెండూ చక్కగా పండించింది. ఎస్జె సూర్యని ఖాకీ దుస్తుల్లో చూడటం కొత్తేమి కాదు కానీ మరీ భీకరమైన అరుపులు లేకుండా కూల్ గా డిజైన్ చేయడం బాగుంది.
మలయాళం ఆర్టిస్టు సూరజ్ వెంజరమూడు కన్నాగా చెలరేగిపోయాడు. ఇంత క్రూరత్వం ఇతనిలో చూడటం ఇదే మొదటిసారి. ఆశ్చర్యకరంగా మన 30 ఇయర్స్ పృథ్వి ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అదరగొట్టేశాడు. ఎక్కడా నవ్వు, వెటకారం అనేదే లేకుండా ఈయన్ని వాడుకున్న తీరు చూసి ఇన్నేళ్లు మనం వృథా చేసుకున్నామేమో అనిపిస్తుంది. పృథ్వి భార్యగా మాల పార్వతి ఓకే. ఇతర తమిళ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు కానీ మనకు పరిచయం తక్కువే. కాకపోతే సహజమైన నటనతో ఆయా క్యారెక్టర్లను నిలబెట్టారు.
సాంకేతిక వర్గం
జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం వీరధీరశూరకు బాగా కుదిరింది. నెక్స్ట్ లెవెలని చెప్పలేం కానీ ఉన్నంతలో మంచి సౌండ్ డిజైన్ తో ఆకట్టుకున్నాడు. రెండు పాటలు పర్వాలేదు. అనవసరమైన వాటికి చోటివ్వలేదు కనక బీజీఎమ్ మీదే ఎక్కువ బాధ్యత పడింది. తేని ఈశ్వర్ ఛాయాగ్రహణంలో క్వాలిటీ పరుగులు పెట్టింది. రాత్రి సన్నివేశాలు ఎక్కువగా ఉన్నా అలాంటి ఫీలింగ్ ఎక్కువ కలగకుండా లైటింగ్ చేసుకున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. జికె ప్రసన్న ఎడిటింగ్ ఓకే కానీ కొన్ని రిపీట్ అనిపించే సీన్లను ట్రిమ్ చేయాల్సింది. ఆర్ట్ వర్క్, ఆడియోగ్రఫీ బాగా కుదిరాయి. నిర్మాణ విలువలు గురించి చెప్పడానికేం లేదు. విపరీతమైన ఖర్చు లేదు కానీ నాణ్యత ఉంది.
ప్లస్ పాయింట్స్
విక్రమ్ నటన
ఖైదీ తరహా టేకింగ్
యాక్షన్ బ్లాక్స్
క్యాస్టింగ్
మైనస్ పాయింట్స్
నిడివి
బలంగా లేని ఎమోషన్
కన్ఫ్యూజ్ చేసే కొన్ని అంశాలు
ఫినిషింగ్ టచ్ : మాస్ మెచ్చే వీర
రేటింగ్ : 2.75 / 5