సమీక్ష – ఎల్2 ఎంపురాన్

2.5/5

3 Hrs   |   Action   |   27-03-2025


Cast - Mohanlal, Prithviraj Sukumaran, Abhimanyu Singh, Tovino Thomas, Manju Warrier and others

Director - Prithviraj Sukumaran

Producer - Antony, Gokulam Gopalan, Subaskaran

Banner - Aashirvad Cinemas, Sree Gokulam Movies and Lyca Productions

Music - Deepak Dev

ఒకప్పుడు మోహన్ లాల్ కు తెలుగులోనూ డబ్బింగ్ మార్కెట్ ఉండేది. తర్వాత ఫెయిల్యూర్స్ వల్ల క్రమంగా అనువాదాలు తగ్గిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ చేశాక ఇప్పటి తరానికి కనెక్ట్ అయిన లాలెట్టాన్ గత కొంత కాలంగా తన స్థాయి సక్సెస్ సాధించలేకపోతున్నాడు. బరోజ్ లాంటివి మరీ అన్యాయంగా పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్2 ఎంపురాన్ కు టాలీవుడ్ లో మంచి బజ్ రావడం విశేషమే. ప్రమోషన్లు ఒక కారణంగా చెప్పుకోవాలి. ఈ ఒక్క రోజు పోటీ లేకుండా సోలోగా వచ్చిన ఎల్2 మెప్పించేలా ఉందా

కథ

అయిదేళ్ల క్రితం స్టీఫెన్ నెడుంపల్లి (మోహన్ లాల్) కేరళ వదిలి వెళ్ళిపోయాక సిఎం కుర్చీలో ఉన్న సవతి తమ్ముడు జతిన్ రామదాస్ (టోవినో థామస్) ప్రత్యర్థులతో చేతులు కలిపి రాష్ట్రాన్ని అవినీతి మయం చేస్తాడు. విదేశాల్లో అబ్రహం ఖురేషి పేరుతో మాఫియా నడిపిస్తున్న స్టీఫెన్ ఇదంతా తెలిసి తిరిగి వస్తాడు. నాన్న పార్టీని వదిలేసి స్వంత కుంపటిని పెట్టుకున్న జతిన్ కు బుద్ది చెప్పేందుకు అతని అక్కయ్య ప్రియదర్శిని (మంజు వారియర్) ని రంగంలోకి దింపుతాడు. తర్వాత ఏమైంది, వీళ్ళ కుటుంబానికి భజరంగి (అభిమన్యు సింగ్) చేసిన ద్రోహం ఏంటి, జాయేద్ మసూద్ (పృథ్విరాజ్ సుకుమారన్) ఎలా సహాయపడ్డాడు లాంటి ప్రశ్నలకు సమాధానమే స్టోరీ.

విశ్లేషణ

ఒక బ్లాక్ బస్టర్ కు కొనసాగింపు అన్నప్పుడు అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని అందుకోవడం పెను సవాల్. లూసిఫర్ లాంటి పొలిటికల్ డ్రామాని 2019లో పృథ్విరాజ్ సుకుమారన్ తీర్చిదిద్దిన తీరు దాన్ని వంద కోట్ల వసూళ్లు అందుకునేలా చేసింది. అలాని అదేమీ అసాధారణ కథ కాదు. రానా లీడర్, మహేష్ బాబు భరత్ అనే నేనులో చూసినట్టు ఒక ముఖ్యమంత్రి చనిపోతే అతని కుటుంబంలో పుట్టే ముసలం నుంచి సృష్టించిన హీరోయిజమే. కాకపోతే దాన్ని ఇంటెన్స్ గా, సీరియస్ గా చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. సహజంగా ఇదే టెంపోని కాదు ఇంతకు మించి రెండో భాగంలోనూ ఆశిస్తాం. ఎలా అంటే పుష్ప 2 లాగా.

కానీ పృథ్విరాజ్ క్యారెక్టరైజేషన్ల మీద పెట్టిన శ్రద్ధ కథనం మీద చూపకపోవడంతో ఎల్2 ప్రయాణం భారంగా సాగుతుంది. మొదటి గంటపాటు అసలు మోహన్ లాలే ఉండడు. విలన్ పరిచయం కోసం ఒక అరగంట, కేరళలో పరిస్థితుల గురించి మరో ముప్పై నిముషాలు వాడుకున్నాక అప్పుడో పవర్ ఫుల్ యాక్షన్ బ్లాక్ తో లాల్ ఎంట్రీ ఉంటుంది. సరే లేట్ అయితే అయ్యింది ఇక్కడి నుంచి పరుగులు పెడతాడని ఊహిస్తే ఫ్లాట్ నెరేషన్ తో మెల్లగా సాగుతుంది. ఫస్ట్ పార్ట్ లో అద్భుతంగా పేలిన జతిన్ రామదాస్ పాత్రని ఇంత హఠాత్తుగా నెగటివ్ గా మార్చడం కృతకంగా అనిపిస్తుంది. ఆ కారణంగా తన వల్లే జరుగుతున్న అన్యాయాలు ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు.

రాజకీయం, కుటుంబం, అంతర్జాతీయ మాఫియా ఈ మూడు అంశాల చుట్టూ ఎల్2ని నడిపించాలనుకున్న పృథ్విరాజ్ వీటిని సరైనా పాళ్ళలో కలపలేక బ్యాలన్స్ తప్పాడు. కెజిఎఫ్ రేంజ్ లో బిల్డప్పులు మీద బిల్డప్పులు వస్తూనే ఉంటాయి కానీ వాటికి సరైన కనెక్షన్, ఎమోషన్ రెండూ ఉండవు. పోనీ మంజు వారియర్ రూపంలో భావోద్వేగాలు పండించే ఛాన్స్ ఉన్నా దాన్ని కూడా వాడుకోలేదు. ఆమె పొలిటికల్ ఎంట్రీ, తర్వాత అరెస్ట్ ప్రహసనం ఇదంతా ఎవరి మీదో సెటైర్లు వేయడం కోసం ఫోర్స్ గా ఇరికించినట్టు అనిపిస్తుంది తప్ప సహజంగా ఉండదు. ఆమె ప్రమాదంలో పడితే స్టీఫెన్ వచ్చి కాపాడే క్రమం అచ్చం లూసిఫర్ తరహాలోనే డిజైన్ చేయడం పండలేదు.

ఫస్ట్ హాఫ్ భారంగా గడిపాక సెకండాఫ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. బోలెడంత నాటకీయత జొప్పించినా అదేమీ అబ్బురపరిచేలా, మరోసారి చూద్దాం అనిపించేలా లేకపోవడం మరో మైనస్. మోహన్ లాల్ ఏదో గెస్టులాగా మధ్య మధ్యలో వస్తాడు తప్పించి తన పాత్రకు కంటిన్యూటి పెట్టలేదు. సలార్ స్టయిల్ ప్రయత్నించిన పృథ్విరాజ్ అందులో లాగే పవర్ ఫుల్ ఎపిసోడ్స్ రెండు మూడు పెట్టినా ప్రేక్షకులు సంతృప్తి శాతం పెరిగేది. పావుగంట సేపు బిల్డప్ ఇచ్చి భయానకమైన ఫ్లాష్ బ్యాక్ తో రిజిస్టర్ చేసిన అభిమన్యు సింగ్ ని తర్వాత మాములు విలన్ గా మార్చేయడం ఇంటెన్సిటీని తగ్గించేసింది. అతన్ని క్లైమాక్స్ లో చంపే తీరు కూడా చప్పగా అనిపిస్తుంది.

సాంకేతికంగా ఎల్2 ఎంపురాన్ మల్లువుడ్ లో వన్ అఫ్ ది బెస్ట్ వర్క్స్ అని చెప్పొచ్చు. కానీ సోల్ లేకపోతే ఎంత విజువల్ గ్రాండియర్ అయినా జనాన్ని పూర్తిగా మెప్పించలేదు. ఎల్2లో ఒకటి రెండు బ్లాకులు బాగున్నాయని అనిపించినా మొత్తంగా లూసిఫర్ మీద అంచనాలతో చూసిన వాళ్ళను మాత్రం సంపూర్ణంగా మెప్పించలేకపోయింది. ఖర్చు బోలెడు పెట్టారనే సానుభూతితో సినిమాలు ఆడవు కాబట్టి కంటెంట్ ఎంత బలంగా ఉందనేది కూడా కీలకం. ఆ కోణంలో ఎంపురాన్ సగం మార్కుల దగ్గరే ఆగిపోయింది. ఫెయిలయ్యిందని చెప్పలేం కానీ ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటాడని ఎదురు చూసిన విద్యార్ధి అత్తెసరు మార్కులకే కష్టపడితే ఇకపై నమ్మడం కష్టం.

ఖచ్చితంగా మూడో భాగం తీయాలని ముందే నిర్ణయించుకున్నారు కాబోలు అబ్రహం ఖురేషి ఎవరనే పాయింట్ ని పదే పదే తిప్పి తిప్పి పలుమార్లు ఇతరత్రా పాత్రలతో అడిగించడం కేవలం లూసిఫర్ ఫ్రాంచైజ్ మీద మరికొంత కాలం బిజినెస్ చేయడం కోసమే. చివర్లో ఎండ్ టైటిల్స్ కు ముందు దీనికి సంబంధించిన క్లూతో పాటు లీడ్ కూడా ఇచ్చారు కానీ అది ఎగ్జైటింగ్ అనిపించే మోతాదులో ముందు మూడు గంటలు లేకపోవడంతో ఎల్3 ది బిగినింగ్ కి చిన్నగా నిట్టూరుస్తాం. ఎల్2 ఎంపురాన్ మలయాళంలో బ్లాక్ బస్టరవ్వొచ్చేమో కానీ మన దగ్గర వర్కౌట్ కావడం కొంచెం డౌటే. రొటీన్ అయినా పర్వాలేదు గ్రాండ్ గా ఉంటే చాలనుకుంటే ఎంపురాన్ ని పలకరించవచ్చు.

నటీనటులు

మోహన్ లాల్ ఎప్పటిలాగే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో టెర్రిఫిక్ అనిపించారు. పరిమిత సంభాషణలు ఉన్నప్పటికీ నిండైన విగ్రహం స్టీఫెన్ నెడుంపల్లిగా మరోసారి ఫ్యాన్స్ ఆకలిని తీర్చేలా కనిపించింది. పృథ్విరాజ్ సుకుమారన్ కనిపించేది కాసేపే. మాటలు లెక్కబెట్టొచ్చు. మంజు వారియర్ కు కొంత స్కోప్ దక్కింది కానీ రైటింగ్ బలహీనత వల్ల కొన్ని మంచి సీన్లలోనూ ప్రభావం చూపించలేకపోయింది. టోవినో థామస్ ఇంత రెగ్యులర్ రోల్ లో చూడటం కొంచెం కష్టమే. సిఎంగా ఓపెనింగ్ బాగున్నా క్రమంగా దాని లేయర్స్ పల్చబడిపోయాయి.

అభిమన్యు సింగ్ రొటీనే. క్రూరంగా డిజైన్ చేశారు కానీ క్రమంగా ఇంపాక్ట్ తగ్గుతూ పోయింది. జర్నలిస్ట్ గా చేసిన ఇంద్రజిత్ సుకుమారన్ కు మరోసారి చెప్పుకోదగ్గ నిడివే దొరికింది. కిషోర్ కు మంచి స్పేస్ ఇచ్చారు. మరీ స్పెషల్ కాదు కానీ జస్ట్ ఓకే. ఫారిన్ నటుల ఎంపిక బాగుంది. అమెరికా, ఆఫ్రికా, ఇరాన్ అంటూ నానా దేశాలు చూపించి వాటికి సూటయ్యే ఫేసులను ఎంచుకున్నారు. సచిన్ కెద్కర్ ఒక్క సన్నివేశానికే పరిమితం. ఇక మిగిలినవాళ్లంతా మనకు పరిచయం లేని మలయాళం మొహాలు కాబట్టి ప్రత్యేకంగా చెప్పేందుకేం లేదు

సాంకేతిక వర్గం

దీపక్ దేవ్ సంగీతం పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం డెప్త్ గా ఉంటె బాగుండేదనిపిస్తుంది. పాటలు తక్కువగానే ఉన్నప్పటికీ ఏవీ గుర్తుండవు. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రహణానికి ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి. టాప్ విజువల్స్ ఇచ్చారు. షాట్స్ ని కంపోజ్ చేసుకున్న తీరు సాంకేతికంగా బలంగా ఉంది. ఎడిటింగ్ చేసిన అఖిలేష్ మోహన్ కొంత ల్యాగ్ ని ముందే గుర్తించి కోత వేసుంటే బాగుండేది. మొదటి భాగం చూశారు కాబట్టి ఇప్పుడూ లెన్త్ తో ఇబ్బంది రాదనుకున్నారో ఏమో కానీ నిడివి ఖచ్చితంగా సమస్యగా మారింది. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. డైలాగుల్లో మెరుపుల్లేవ్. నిర్మాణ విలువలకు చప్పట్లు కొట్టొచ్చు. విపరీతంగా ఖర్చు పెట్టారు.

ప్లస్ పాయింట్స్

మోహన్ లాల్
నిర్మాణ విలువలు
కొన్ని యాక్షన్ బ్లాక్స్

మైనస్ పాయింట్స్

కొరవడిన ఇంటెన్సిటీ
ఫస్టాఫ్ సాగతీత
పండని ఎమోషన్లు
రొటీన్ విలన్ ట్రాక్

ఫినిషింగ్ టచ్ – తడబడిన పొలిటికల్ డ్రామా

రేటింగ్ : 2.5 / 5