2.5/5
02 Hrs 36 Mins | Action | 28-03-2025
Cast - Nithiin, Sreeleela, Rajendra Prasad, Vennela Kishore, Devdatta Nage, Shine Tom Chacko, Ketika Sharma, David Warner and others
Director - Venky Kudumula
Producer - Naveen Yerneni & Yalamanchili Ravi Shankar
Banner - Mythri Movie Makers
Music - G. V. Prakash Kumar
ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన లక్ష్యంతో నితిన్ చేసిన మూవీ రాబిన్ హుడ్. తీసిన రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుని హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న వెంకీ కుడుముల దర్శకుడు కావడంతో అంచనాలు బాగున్నాయి. మైత్రి నిర్మాణంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించడం మరో ఆకర్షణ. పబ్లిసిటీ పరంగా కొత్త పుంతలు తొక్కిన టీమ్ దానికి తగ్గట్టే జనంలో మంచి బజ్ తీసుకొచ్చింది. నిన్న రిలీజైన రెండు డబ్బింగులుతో పాటు ఇవాళ మ్యాడ్ స్క్వేర్ తో తలపడుతున్న రాబిన్ హుడ్ ఎలా ఉన్నాడో చూద్దాం
కథ
రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్) అనాథ. తనలాంటి వాళ్ళు బాగా చదుకోవాలని పెద్దిళ్ళలో దొంగతనాలు చేస్తూ వాటిని విరాళాల రూపంలో ఆశ్రమాలకు పంచుతూ ఉంటాడు. రామ్ ని పట్టుకునే డ్యూటీలో ఉంటాడు పోలీస్ ఆఫీసర్ విక్టర్ (షైన్ టామ్ చాకో) . విదేశాల నుంచి వచ్చిన నీరా వాసుదేవ్ (శ్రీలీల) కు సెక్యూరిటీగా రామ్ ఆమెతో రుద్రకొండకు వెళ్తాడు. అక్కడ సామి (దేవదత్త నాగ) రూపంలో ఒక రాక్షసుడు గంజాయి పండిస్తూ నీరా తాత (లాల్) ని బంధించి ఆమె సంతకం కోసం ఇక్కడికి వచ్చేలా చేస్తాడు. ప్రాణాలు తీసే దుర్మార్గుల మధ్య చేరిన రామ్, నీరాలు ఆ గండం నుంచి బయట పడటమే కాక ఆ ఊరి జనాన్ని ఎలా కాపాడారనేది తెరమీద చూడాల్సిందే.
విశ్లేషణ
కమర్షియల్ సబ్జెక్టుకు వినోదాన్ని జోడించి, చిన్న సందేశం తగిలించి సరైన రీతిలో చెప్పగలిగితే సక్సెస్ కావొచ్చని భీష్మతో నిరూపించిన వెంకీ కుడుముల ఈసారి డోస్ మరింత పెంచి రాబిన్ హుడ్ చూపాలనుకున్నాడు. సాధారణంగా ఇలాంటి కథల్లో లాజిక్స్ కు పెద్దగా చోటుండదు. ఎంటర్ టైన్మెంట్ ఉంటే చాలు ఆడియన్స్ వాటిని పట్టించుకోరు. అందుకే వీలైనంత నవ్విస్తూ టైం పాస్ జరిపించేస్తే ఎలాంటి సమస్య రాదు. రాబిన్ హుడ్ ఆ ఉద్దేహంతోనే మొదలవుతాడు. హీరో పరిచయం, చోరీల వెనుక కారణం, ఆపై పెద్దయ్యాక ఒక పోలీస్ ఇతన్ని పట్టుకునేందుకు కంకణం కట్టుకోవడం ఇదంతా ఆడియన్స్ ఊహించినట్టు అతి మాములుగా వెళ్ళిపోతుంది.
నితిన్ క్యారెక్టరైజేషన్ బలంగా లేకపోవడం వల్ల అతని సదుద్దేశానికి కనెక్ట్ కాలేకపోవడం రాబిన్ హుడ్ లోని ప్రధాన లోపం. సరే కామెడీ కంటెంట్ కి ఇదేమి సీరియస్ గా ఉండాల్సిన అవసరం లేదనుకుంటే గంజాయి పండించే విలన్ ని అంత పవర్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయకుండా తేలిగ్గా చూపించాల్సింది. ఈ రెండు బ్యాలన్స్ కుదరనప్పుడే తెరమీద తేడా కొట్టేస్తుంది. శ్రీలీలని ఫన్నీగా మొదలుపెట్టడం బాగుంది. క్రమంగా ఆ టోన్ కూడా దారి తప్పేసింది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ లు తమ టైమింగ్ తో ఫస్ట్ హాఫ్ లో బలహీనతలను కొంత మేర నెట్టుకుంటూ వచ్చారు కానీ మిగిలిన అంశాలను నిలబెట్టేందుకు నితిన్, శ్రీలీల బలం సరిపోక కథనం పల్చబడింది.
అర్జున్ జెంటిల్ మెన్ థీమ్ తీసుకుని దానికి ఎంటర్ టైన్మెంట్ ముడిపెడితే ఏ రేంజ్ లో పేలుతుందో సురేందర్ రెడ్డి కిక్ లో చూపించాడు. రేసు గుర్రంలోనూ ఇలాంటి ట్రీట్ మెంట్ వర్కౌటయ్యింది. రాబిన్ హుడ్ కూడా అదే స్కూల్ లో చేరాలని చాలా కష్టపడింది కానీ ఎంట్రన్స్ కు కావాల్సిన మార్కులు సాధించలేదు. వెంకీ కుడుముల తన బలమైన రైటింగ్ ని పూర్తి స్థాయిలో వాడుకోలేదు. ఛలోలో ఒక గూండా గుంపుని కామెడీగా వాడుకున్న తీరునే ఇక్కడా చూపించబోయాడు కానీ ఆ స్థాయిలో ఫన్ పండలేకపోవడంతో చాలా మటుకు హాస్యం ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. కొన్ని జోకులు నవ్వించినా సరే చివరిదాకా చూసి బాగుందని చెప్పేందుకు ఆ మోతాదు సరిపోలేదు.
బ్యాంగ్ అనిపించాల్సిన ఇంటర్వెల్ సైతం మాములుగా అనిపిస్తుంది. ఇక రెండో సగంలో ఏం జరుగుతుందో సగటు ప్రేక్షకుడు ఊహించినట్టే నడవడం క్రమంగా ఆసక్తిని తగ్గించుకుంటూ వెళ్ళింది. రుద్రకొండలో నితిన్, శ్రీలీలలు కలిసి ఏం చేస్తారో అనే ఉత్సుకతని కలిగించడంలో వెంకీ కుడుముల తడబడ్డాడు. దీని వల్ల వాళ్ళ మధ్య జరిగే ట్రాక్, పాటలు అన్నీ ఇరికించినట్టు అనిపిస్తాయి తప్పించి అసలు విలన్ సామీని ఎలా కట్టడి చేస్తారనే ఎగ్జైట్ మెంట్ కలిగించలేదు. దారుణంగా హత్యలు చేసే కిరాతకులు హీరోల చేతిలో జోకర్లుగా మారడం కొత్తేమీ కాదు కానీ అది కన్విన్సింగ్ గా లేకపోతే రివర్స్ లో నవ్వులపాలయ్యే రిస్క్ ఉంటుంది. రాబిన్ హుడ్ లో ఇది జరిగింది.
వెంకీ కుడుముల టార్గెట్ ఎంత నవ్వించడమే అయినా సరే కొన్ని ఎలిమెంట్స్ ని సీరియస్ గా హ్యాండిల్ చేయాల్సింది. భీష్మలో జిస్సు సేన్ గుప్తా, అనంత్ నాగ్ ఎపిసోడ్ లో అంత బాగా డిజైన్ చేసుకున్న ఇతను రాబిన్ హుడ్ లో దేవదత్తనాగ, లాల్ లాంటి ఆర్టిస్టులను పెట్టుకుని కూడా తేలిపోవడం మైనస్సే. హీరోకి ఒక ఆశయం ఉంది. హీరోయిన్ కి అంతకు మించిన పెద్ద బాధ్యత ఉంది. ఈ రెండింటిని మరీ కామెడీగా చెబితే బాగుండదు. హఠాత్తుగా ఎమోషన్లను తీసుకొచ్చి ఇదిగో భావోద్వేగాలను ఫీలవ్వమంటే కష్టం. ఈ సినిమాలో అలా చాలాసార్లు జరిగింది. కపిల్ శర్మ లాంటోళ్ళు టీవీలో ఫ్రీగా నవ్విస్తున్న జమానాలో టికెట్లు కొనే జనాలను నవ్వించడం ఈజీ కానేకాదు.
చివరిగా చెప్పాలంటే రాబిన్ హుడ్ బ్యాడ్ మూవీ కాకపోవచ్చు. కానీ బెస్ట్ సినిమా అనిపించుకునే లక్షణాలు పూర్తి స్థాయిలో పుణికి పుచ్చుకోకపోవడం బాక్సాఫీస్ ఫలితాన్ని శాసించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. లౌడ్ కామెడీ ఉన్న ధమాకా లాంటివి ఆదరణ పొందాయి. అదే టీమ్ ఇచ్చిన మజాకాలు తిరస్కరణకు గురయ్యాయి. ఎందుకో మళ్ళీ చెప్పనక్కర్లేదు. వెంకీ కుడుముల లాంటి టాలెంటెడ్ రచయిత కం దర్శకుడి నుంచి మనం మరింత వినోదాన్ని ఆశిస్తాం. ఆడియన్స్ గా ఆ హక్కు కూడా ఉంది. అనిల్ రావిపూడి పరుగులు పెడుతున్న చోట వెంకీ, త్రినాథరావు లాంటి వాళ్ళు నడుస్తూ పోతే రేసులో గెలవలేరు. దానికి ఎవరికి వారు స్వీయ విశ్లేషణ చేసుకోవడం అవసరం.
నటీనటులు
నితిన్ ఎప్పటిలాగే అలవోకగా రామ్ పాత్రలో ఒదిగిపోయాడు. పెద్దగా ఛాలెంజ్ అనిపించేది ఏమీ లేదు. డాన్సుల్లో మెరుపులు తగ్గాయి. అది కొరియోగ్రఫీ వల్లనా లేక ఇంకేదైనా రీజన్ ఉందా అంటే చెప్పలేం. శ్రీలీల క్యూట్ గా, అందంగా ఉంది. వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం నప్పింది. ఎబెట్టుగా లేదు. నృత్యాల పరంగా తనకూ సవాల్ ఎదురు కాలేదు రాజేంద్రప్రసాద్ ఎప్పటిలాగే తన సీనియారిటీని నిరూపించుకున్నారు. ఆయనే వల్లే కొన్ని చోట్ల నవ్వుతాం. వెన్నెల కిషోర్ నటకిరీటితో పాటు ఇందులో భాగమయ్యాడు.
దేవదత్త నాగ మనం బోలెడుసార్లు చూసేసిన రొటీన్ విలన్. కొత్తదనం, క్రూరత్వం రెండూ తక్కువే. మేకప్, డబ్బింగ్ తో మేనేజ్ చేశారు. షైన్ టామ్ చాకో మరోసారి వృథా అయ్యాడు. దసరా తర్వాత ఏదో క్యారెక్టర్లు రాస్తున్నారు కానీ అతని పొటెన్షియాలిటీని బయట పెట్టేలా ఎవరూ శ్రద్ధ పెట్టకపోవడం బ్యాడ్ లక్. ఆడుకాలం నరేన్, శుభలేఖ సుధాకర్, మైమ్ గోపి, బ్రహ్మాజీ అందరూ రెగ్యులరే. సిజ్జు, లాల్ మొక్కుబడిగా మమ అనిపించారు. కేతిక శర్మ ఇదిదా సర్ప్రైజ్ పాటలో అభ్యంతరకర స్టెప్పుని ఎడిట్ చేసారు. సోసోగానే ఉంది. అంత హడావిడి చేసిన డేవిడ్ వార్నర్ క్యామియో వల్ల కలిగిన ఉపయోగం సున్నానే.
సాంకేతిక వర్గం
జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన పాటలు నిరాశపరుస్తాయి. బాగా చిత్రీకరించారు కానీ మళ్ళీ చూసేలా, వినేలా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కొన్నిచోట్ల తప్ప పెద్దగా మెరుపులు లేవు. యావరేజ్ అనిపిస్తాడు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణంలో మంచి వర్క్ కనిపించింది. విజువల్ గా దర్శకుడు కోరుకున్న అవుట్ ఫుట్ ఇవ్వడంలో తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. నిడివి ఎక్కువనిపించడంలో ఎడిటర్ కోటి పాత్ర ఎంతనేది చెప్పలేం కానీ బేసిక్ గా నెరేషనే అలా ఉంది కాబట్టి ఇంతకంటే చెప్పలేం. అక్కడక్కడా వన్ లైనర్స్ పేలినా డైలాగుల పరంగా వెంకీ బెస్ట్ వర్క్ అయితే కాదు. మైత్రి నిర్మాణ విలువలు ఎప్పటిలాగే వంక పెట్టేందుకు లేకుండా భేష్షుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నితిన్ – శ్రీలీల జంట
రాజేంద్రప్రసాద్ టైమింగ్
ప్రొడక్షన్ వేల్యూస్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథా కథనాలు
సెకండాఫ్ కంటెంట్
బలహీనమైన విలన్
సంగీతం
ఫినిషింగ్ టచ్ : సర్ప్రైజ్ సరిపోలేదు
రేటింగ్ : 2.5 / 5