సమీక్ష – 2018

3/5

2 Hr 15 Min   |   Drama | Thriller   |   26-05-2023


Cast - Tovino Thomas, Asif Ali, Kuchacko Boban, Narain Ram, Aparna Balamurali and Vineeth Sreenivasan

Director - Jude Anthany Joseph

Producer - Venu Kunnappilly, Anto Joseph, C K Padma Kumar

Banner - Kavya Film Company PK Prime Production

Music - Nobin Paul, William Francis

ఒక మలయాళం డబ్బింగ్ సినిమా గురించి టాలీవుడ్ లో చర్చ జరగడం అరుదు. గత కొన్నేళ్లలో రీమేకులు చాలానే వచ్చాయి కానీ అనువాద రూపంలో మెప్పించినవి లేవు. కేరళలో మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి బడా స్టార్ల వసూళ్లను దాటేసి 140 కోట్ల వసూళ్లతో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన 2018 మీద సోషల్ మీడియా హైప్ చూసి మన ఆడియన్స్ లోనూ ఆసక్తి పెరిగింది. రిలీజ్ చేయడంలో కొంత ఆలస్యమైనా ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. ఇంతగా సంచలనం రేపిన ఈ సెన్సేషనల్ మూవీలో ఏముంది

కథ

కేరళను చిగురుటాకులా వణికించిన భీభత్సమైన తుఫాను నేపథ్యంలో 2018 సాగుతుంది. ఇది ఒకరితో మరొకరు ముడిపడిన జీవితాల సమూహారం. అనూప్(టోవినో థామస్) దొంగ సర్టిఫికెట్ కేసులో మిలిటరీ నుంచి వచ్చి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాడు. సముద్రంలో చేపలు పడుతూ ఇద్దరి కొడుకులతో సంసారాన్ని ఈదుతున్న ఓ పెద్దాయన(లాల్), డబ్బు సంపాదించడమే తప్ప కూతుర్ని దగ్గరకు తీసుకోని లారీ డ్రైవర్(కలయారసన్), వాతావరణ శాఖలో పని చేసే ఆఫీసర్(కుంచకో బోబన్), ఫారినర్ల ట్రిప్పు కోసం ప్రాణం పణంగా పెట్టే టాక్సీ డ్రైవర్(అజు వర్శిస్) వీళ్ళందరూ వరదలో చిక్కుకున్నాక జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేదే తెరమీద చూడాలి

విశ్లేషణ

నేచర్ డిజాస్టర్ అంటే ప్రకృతి విధ్వంసాలను ఎవరూ నియంత్రించలేరు. ఇది ప్రపంచం మొత్తానికి వర్తిస్తుంది. మనిషి యాంత్రిక జీవనంలో పడిపోయి చెట్టు చేమలు కొట్టేసి డ్రైనేజ్ లు ఆక్రమించుకుని ఇష్టారాజ్యంగా పెట్రేగిపోవడం వల్ల సూర్య తాపం పెరగడంతో పాటు ఒక రాత్రి భీకర వర్షం పడితే వందలాది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది. దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్ టైటిల్ కార్డ్స్ లో ఇదే సందేశాన్ని అంతర్లీనంగా చెబుతాడు. ప్రభుత్వాలు సైతం నిస్సహాయంగా మారినప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజానికి ఈ బ్యాక్ డ్రాప్ లో బడ్జెట్ పరిమితులతో ఇలాంటి ఆలోచన చేయడం సాహసమే.

ఆంటోనీ ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టరైజేషన్లకె కేటాయించడంతో కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. దానికి తోడు డబ్బింగ్ క్వాలిటీ కూడా మరీ గొప్పగా లేకపోవడం వల్ల అంతగా చెప్పుకోవడానికి ఇందులో ఏముందనే ప్రశ్న తలెత్తుంది. ప్రత్యేకంగా 2018లో హీరో అంటూ ఎవరూ లేకపోవడంతో ప్రతి పాత్రకు ప్రాధాన్యం దక్కింది. వాటి మధ్య బంధాలను స్పష్టంగా వివరిస్తేనే ఎమోషన్ పండుతుందని గుర్తించిన ఆంటోనీ దానికి తగ్గట్టే స్క్రీన్ ప్లే రాసుకున్నారు. వాస్తవానికి ఇలా నెమ్మదిగా చెప్పడం సాధారణంగా మల్లు వుడ్ డైరెక్టర్లు ఫాలో అయ్యేదే. జోసెఫ్ కూడా దానికి మినహాయింపుగా నిలవలేదు. ఇంటర్వెల్ అయ్యాక అసలు నేరేషన్ కన్నార్పకుండా చూసేలా చేస్తుంది

నీళ్లను సృష్టించిన తీరు, వాటి మధ్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం మనుషులు పడే తాపత్రయం రియలిస్టిక్ గా వచ్చాయి. ముఖ్యంగా హెలికాఫ్టర్ ద్వారా గర్భవతిని రక్షించే సీన్, బురదలో కూరుకుపోయిన అన్నయ్య కుటుంబాన్ని ఓ తమ్ముడు జాలర్ల సహాయంతో కాపాడటం, వికలాంకుడైన కొడుకు ఉన్న స్నేహితుడి కుటుంబాన్ని ఆ ఇంటి నుంచి అనూప్ తీసుకొచ్చే ఎపిసోడ్ కేవలం కొన్ని హైలైట్స్ మాత్రమే. శరణార్థ శిబిరాల్లో తలదాచుకున్న వాళ్ళ మధ్య బోలెడంత మెలోడ్రామా ప్లే చేయడానికి స్కోప్ ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్ళలేదు. నిజాయితీగా విపత్తు నుంచి జనం ఎలా బయట పడ్డారనే దాని మీదే దృష్టి పెట్టడంలో ఎక్కడా డీవియేషన్లు జరగలేదు

ఇందులో గుండెలు పిండేసే సీన్లు, స్ఫూర్తినిచ్చే సంఘటనలు అన్నీ పొందుపరిచారు.. కొన్ని హెచ్చుతగ్గులు లేకపోలేదు. ఈ విషాదాన్ని కేరళ ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించారు కాబట్టే దాన్ని వెండితెర మీద చూసుకుని తమ ధైర్యానికి సెల్యూట్ చేసుకుని కోట్ల కలెక్షన్లు కురిపిస్తున్నారు. కానీ తెలుగుతో పాటు ఇతర బాషల విషయానికి వచ్చినప్పుడు అంతటి భావోద్వేగం మనకు కలుగుతుందా అంటే ఆ తరహా ట్రాజెడీలో మనం ఎప్పుడో ఒకప్పుడు భాగమయ్యుంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. లేదంటే ఇంపాక్ట్ లెవెల్ కొంత తగ్గొచ్చు. అయినా సరే క్లాసు మాస్ అందరినీ కట్టిపడేసే భావోద్వేగాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వాటికోసం నిర్భయంగా చూడొచ్చు

ఏ కోణంలో చూసినా 2018 థియేట్రికల్ ఎక్స్ పీరియన్సే. టీవీలోనో ఫోన్ లోనో చూస్తే ఇక్కడ చెప్పినంత గొప్పగా అనిపించకపోవచ్చు. మాములుగా హాలీవుడ్ లో ఎక్కువగా చూసే ఇలాంటి సర్వైవల్ డ్రామాలకు ఏ మాత్రం తీసిపోమని జూడ్ ఆంటోనీ జోసెఫ్ చూపించిన తీరు రాబోయే ఫిల్మ్ మేకర్స్ కి ఒక ఇన్స్ పిరేషన్ లాంటిది. టెక్నికల్ టీమ్ నుంచి బెస్ట్ రాబట్టుకోవడం ఎలాగో, ప్రొడక్షన్ డిజైన్ ఎలా చేయించుకోవాలో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా నిలిచిపోతుంది. కమర్షియల్ గా కాంతార రేంజ్ లో 2018 ఆడుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ నమ్మి టికెట్ కొన్న ప్రేక్షకుడికి కంటి నిండా తడి, గుండె నిండా బరువు ఇచ్చి పంపుతుందని మాత్రం బల్లగుద్ది చెప్పొచ్చు

నటీనటులు

ఇది హీరో ఓరియెంటెడ్ సబ్జెక్టు కాదు కాబట్టి ప్రత్యేకంగా ఫలానా ఒకరో ఇద్దరో బాగా చేశారని చెప్పడానికి లేకుండా అందరూ జీవించేశారు. టోవినో థామస్ సహజంగానే హైలైట్ అయినా మిగిలిన పాత్రధారులు గుర్తుండిపోతారు. లాల్ ఈ వయసులోనూ పదే పదే నీటిలో నానుతూ గొప్ప పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అపర్ణ బాలమురళి, కుంచకో బోబన్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులను చిన్న పాత్రలకు పరిమితం చేయడం వల్ల వాళ్ళ క్యాలిబర్ ని పూర్తిగా వాడుకునే అవకాశం దక్కలేదు. ప్రతి ఒక్కరి నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ ని రాబట్టుకున్నారు. ఆఖరికి చిన్న పిల్లలు సైతం అత్యంత సహజంగా నటించడం చూస్తే జోడ్ ఆంటోనీ జోసెఫ్ క్యాస్టింగ్ బలమేంటో అర్థమవుతుంది

సాంకేతిక వర్గం

విలియం ఫ్రాన్సిస్ సంగీతం పాటల పరంగా కొంత ఫీల్ గుడ్ గానే సాగాయి కానీ మనవరకు అంతగా రీచ్ అయ్యేలా లేవు. నోబిన్ పాల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థీమ్ కి తగ్గట్టు చక్కగా సాగింది. అఖిల్ జార్జ్ ఛాయాగ్రహణం పూర్తిగా అవార్డులకు అర్హమైనది. గొప్ప పనితనం చూపించాడు. అసలు ఆ విజువల్స్ ప్రెజెంట్ చేసిన తీరు, విఎఫెక్స్ ని అనుసంధానం చేసుకున్న విధానం అబ్బురపరుస్తుంది. చమన్ చక్కో ఎడిటింగ్ కొంచెం పదునుగా ఉంటే ఫస్ట్ హాఫ్ స్పీడ్ పెరిగేది. నిర్మాణ విలువల గురించి ఎంత చెప్పినా తక్కువే. వైకోమ్ ఊరిలో 15 ఎకరాల విస్తీర్ణంలో సెట్లు వేసి 2018ని చిత్రీకరించిన విధానం ఒక బుక్కు లాంటిది. వేణు-పద్మ-యాంటోలు భారీగా ఖర్చు చేశారు

ప్లస్ పాయింట్స్

ప్రొడక్షన్ డిజైన్
థ్రిల్ ఇచ్చే రెస్క్యూ ఎపిసోడ్స్
భావోద్వేగాలు
ఆర్టిస్టుల నటన

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ కొంత భాగం
అక్కడక్కడా ల్యాగ్
డబ్బింగ్ లోపాలు

ఫినిషింగ్ టచ్ : వరద విజయం

రేటింగ్ : 3/5