సమీక్ష – కబ్జ

1.5/5

2 Hr 3 Mins   |   Action   |   17-03-2023


Cast - Upendra, Kiccha Sudeep, Shiva Rajkumar, Shriya Saran, & Others

Director - R Chandru

Producer - R Chandru

Banner -

Music - Ravi Basrur

ఒకప్పుడేమో కానీ కెజిఎఫ్ పుణ్యమాని కన్నడ డబ్బింగులు తెలుగులో ఊపందుకున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్న ఉపేంద్ర తర్వాత దాన్ని క్రమంగా పోగొట్టుకున్నాడు. అయినా సరే తనని ప్రత్యేకంగా అభిమానించే వాళ్లకు ఇక్కడ కొదవ లేదు. అందుకే రిజల్ట్ తో సంబంధం లేకుండా ఉప్పి దాదా సినిమా వస్తుందంటే అంతో ఇంతో అంచనాలు ఇక్కడా ఏర్పడతాయి. మరి కబ్జ లాంటి గ్రాండియర్ తో రీ ఎంట్రీ ఇస్తున్నప్పుడు హైప్ ఏ రేంజ్ లో ఉండాలి. కానీ అదేమీ లేకుండా వీక్ ప్రమోషన్లతో ఈ వారం బాక్సాఫీస్ బరిలో దిగిన ఉపేంద్ర టైటిల్ కు తగ్గట్టు ప్రేక్షకుల మనసులు కబ్జా చేశాడా లేదా చూద్దాం పదండి

1947లో స్వాతంత్రం వచ్చాక భర్తను పోగొట్టుకుంటున్న ఓ తల్లి(సుధ)తన ఇద్దరు బిడ్డలను కష్టపడి పెంచుతుంది. చిన్నవాడు అర్కేశ్వర (ఉపేంద్ర) ఎయిర్ ఫోర్స్ లో అధికారిగా పని చేస్తూ సెలవులకు ఇంటికి వస్తాడు. అన్యాయాన్ని సహించని అన్నయ్య స్థానిక మాఫియా డాన్ ఖలీద్ చేతిలో దారుణంగా హత్య చేయబడతాడు. దీంతో ఉగ్రరూపం దాల్చిన ఆర్కేశ్వర నరమేథం మొదలుపెట్టి ఒక్కొక్కరిని నరుక్కుంటూ వెళ్లి తిరుగులేని శక్తిగా ఎదుగుతాడు. రాజవంశానికి చెందిన బహదూర్(మురళిశర్మ) కూతురు మధుమతి(శ్రేయ)ని ప్రేమ పెళ్లి చేసుకుంటాడు. దీంతో శత్రువులు ఎక్కువవుతారు. చివరికి ఇతని గమ్యం ఎక్కడి దాకా వెళ్లిందో తెరమీద చూడాలి

ఒక ట్రెండ్ సెట్ చేసిన బ్లాక్ బస్టర్ ని స్ఫూర్తిగా తీసుకోవడం తప్పు కాదు. అనుకరిస్తేనే ప్రమాదం. శాండల్ వుడ్ లో ఎంతో అనుభవమున్న దర్శకుడు చంద్రు ఇంత చిన్న సూత్రాన్ని మర్చిపోయి పెద్ద తప్పే చేశారు. కెజిఎఫ్ తాలూకు హ్యాంగోవర్ లో కన్నడ దర్శకులు ఎంతగా కొట్టుమిట్టాడుతున్నారో ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ టైటిల్స్ దాకా అడుగడుగునా రాఖీ భాయ్ కనిపిస్తూనే ఉంటాడు. కన్నడ జనాన్ని అమాయకులుగా జమకట్టారో లేక గుడ్డిగా కోట్లు కుమ్మరించే నిర్మాత దొరికాడని ఇలా ఆడుకున్నారో తెలియదు కానీ ఉపేంద్ర లాంటి వర్సటైల్ హీరోని ఈ టైపు రొడ్డకొట్టుడు ఫార్ములాకి తేవడమే విషాదం.

ఎంతసేపూ యాక్షన్ విజువల్స్ మీదే దృష్టి పెట్టిన చంద్రు ర్ తరహా కథలకు ప్రాణమైన ఎమోషన్లను గాలికి వదిలేశాడు. హీరోని ఎలివేట్ చేస్తే చాలు ఎన్ని తప్పులున్నా క్షమించేస్తారనే భ్రమలో ఇష్టంవచ్చినట్టు స్క్రిప్ట్ రాసుకున్నాడు. అసలు ఆర్కేశ్వర్ క్యారెక్టర్ బిల్డింగే పేలవంగా ఉంది. డిపార్ట్ మెంట్ లో పని చేసే ఒక మంచివాడు కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా మారడాన్ని ఒక క్రమ పద్ధతిలో చూపించాలి. అంతే తప్ప విలన్ అడ్డాకు వెళ్లి అతి క్రూరంగా హత్య చేసినంత మాత్రాన కన్విన్సింగ్ గా ఉండదు. కెజిఎఫ్ లోనూ లోపాలున్నాయి. కానీ యష్ ని వాడుకునే క్రమంలో ప్రశాంత్ నీల్ చూపించిన విజన్ ఆ వీక్ నెస్ అన్నింటినీ రక్షణ కవచంలా కాపాడి బ్లాక్ బస్టర్ చేసింది.

నిజానికి దీన్ని మల్టీస్టారర్ గా ప్రమోట్ చేసి ఒకరకంగా మోసం చేశారు. ఎందుకంటే కిచ్చ సుదీప్ మొదటి అయిదు నిముషాలు చివర్లో మూడు నిముషాలు తప్ప ఎక్కడా కనిపించడు. శివరాజ్ కుమార్ చివరి ఫ్రేమ్ లో కొన్ని సెకండ్లు మాత్రమే దర్శనమిస్తాడు. ఇది పూర్తిగా ఉపేంద్ర సోలో హీరోగా నటించిన సినిమా. పోనీ కబ్జ 1 అని చెప్పారా అంటే అదీ లేదు. అయినా కూడా అసంపూర్ణంగా వదిలేశారు. తర్వాత ఇంకా చాలా కథ ఉందనే క్లూలు స్పష్టంగా ఇచ్చారు. అలాంటప్పుడు బాహుబలిలాగా నెంబర్ ని ముందే చెప్పేస్తే సరిపోయేది. థ్రిల్ చేద్దామనుకున్నారో ఏమో కానీ అదే కిల్లింగ్ ఫ్యాక్టర్ అయ్యింది. ముగ్గురు హీరోలతో పోస్టర్లు వేయడం ఒకరకంగా చీటింగే

కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని ఇంకొంత హోమ్ వర్క్ చేసి ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉంటే బాగుండేది. కెజిఎఫ్ 2 వచ్చి ఇంకా ఏడాది దాటలేదు. ఇంత త్వరగా ఈ కబ్జ లాంటి కాపీ పేస్టులు వర్కౌట్ కావు. టీమ్ మొత్తం చాలా కష్టపడింది. అందులో సందేహం లేదు. చాలా ఖర్చు పెట్టారు. కానీ కాంబినేషన్ క్రేజ్ ని వాడుకోవాలనే తాపత్రయమే బ్యాడ్ స్క్రిప్ట్ రాసుకునేందుకు ప్రేరేపించింది. విపరీతమైన హింస, బాంబు బ్లాస్టింగులు, మర్డర్లు, తెరనిండా రక్తపాతం, పదే పదే వచ్చే బిల్డప్ షాట్లు, బీజీఎమ్ తో చెవులు చిల్లులుపడేలా ఇచ్చిన సౌండ్ అన్నీ కలిసి దీన్ని భరించలేని ప్రహసనంగా మార్చాయి. కొన్ని మంచి సీన్లు ఉన్నా వీటి ముందు పూర్తిగా తేలిపోయాయి

కమర్షియల్ సినిమా తరహాలో నాలుగు పాటలు, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అంటూ ఇలాంటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కి వాటిని ఇరికించడం చంద్రు చేసిన మరో తప్పిదం. అరకేశ్వర్ తాలూకు బాధను క్షోభను మనకు ఏ మాత్రం ఫీలయ్యే అవకాశం ఇవ్వనప్పుడు అతనెంత సాహసాలు చేసినా, ఎన్ని పోగొట్టుకున్నా మనకు ఎలాంటి భావోద్వేగాలు కలగవు. ఇది ముమ్మాటికీ రైటింగ్ లోపమే. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో వావ్ అనిపించే మూమెంట్స్ అసలు లేవంటే అది ఎవరి తప్పు. ఎంతసేపూ కెజిఎఫ్ లాగా సెట్లు, ఆర్ట్ వర్క్ కనిపిస్తుందా లేదా అనే దాని మీద పెట్టిన శ్రద్ధ రాసుకునే టైంలోనే చూపించి ఉంటే శాండల్ వుడ్ కు మరో క్లాసిక్ దక్కేదేమో

ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుంటూ పోయారు తప్పించి అరకేశ్వర్ గా ఆయన రైట్ ఛాయసే. శ్రేయ ఒంటి నిండా బంగారంతో అడిగిన సీన్లలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినా మళ్ళీ గుర్తు రాదు. మురళి శర్మ తనకిచ్చిన బహద్దూర్ పాత్రకు సెట్ కాలేదు. పైగా వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించడం మరింత తేడా కొట్టింది. సుదీప్, శివరాజ్ కుమార్ గురించి చెప్పేందుకు ఏమీ లేదు. పోసాని కృష్ణమురళి, కోట శ్రీనివాసరావు అలా ఒక ఫ్రేమ్ లో కనిపించి మాయమవుతారు. ప్యాన్ ఇండియా ఫ్లేవర్ కోసం పడిన తిప్పలివి. సుధ, కబీర్ సింగ్, ప్రమోద్ శెట్టి, అవినాష్, సునీల్ పట్నాయక్, దేవ్ గిల్ ఇలా ఆర్టిస్టులు చాలానే ఉన్నారు

సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఎలాగూ అవుట్ ఫుట్ కెజిఎఫ్ లాగే ఉంది కాబట్టి అదే స్కోర్ ని రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. రణగొణధ్వనులు కర్ణభేరికి విపరీతమైన పరీక్ష పెడతాయి. దానికి తోడు డబ్బింగ్ క్వాలిటీ నాసిరకంగా ఉంది. ఏజె శెట్టి ఛాయాగ్రహణం సైతం ఇదే దారి పట్టింది. స్క్రీన్ మొత్తం నలుపుతో నిండిన ఈ యాక్షన్ మేళాలో ఉన్న భారీతనమంతా చూపించే ప్రయత్నం చేశాడు. మహేష్ ఎస్ రెడ్డి ఎడిటింగ్ బహుశా కన్ఫ్యూజ్ అయ్యుండొచ్చు. లేకపోతే అతిగా మారిపోయిన బ్లింకింగ్ షాట్స్ తగ్గిద్దామని కనీసం ఓ సలహా అయినా ఇచ్చేవారేమో. ఆనంద్ పండిట్ – చంద్రు – అలంకార్ పాండ్యన్ నిర్మాణంలో డబ్బులు మంచి నీళ్ళే అయ్యాయి.

ప్లస్ పాయింట్స్

ఉపేంద్ర

మైనస్ పాయింట్స్

కెజిఎఫ్ అనుకరణ
భరించలేని హింస
సంగీతం
అర్థం లేని ఫైట్లు

ఫినిషింగ్ టచ్ : యాక్షన్ టార్చర్

రేటింగ్ : 1.5 / 5