2.25/5
| Love | 04-02-2023
Cast - Anikha Surendran, Arjun Das, Surya Vashistta, Navya Swamy, and others
Director - Chandrasekhar T. Ramesh
Producer - Naga Vamsi S, Sai Soujanya
Banner - Sithara Entertainment, Fortune 4
Music - Gopi Sundar
పెద్ద బ్యానరే అయినా చిన్న ఆర్టిస్టులతో సినిమా తీసినప్పుడు జనాన్ని థియేటర్ కు రప్పించడం పెద్ద ఛాలెంజ్. ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ ఇలాంటి బడ్జెట్ చిత్రాలు ఎన్ని తీసినా జనం సంస్థ మీద ఉన్న నమ్మకంతో టికెట్లు కొని చూసేవాళ్ళు. అదంతా ఇంటర్నెట్లు, ఓటిటిలు లేని కాలం. ఇప్పుడు ప్రేక్షకులు బాగా ఎడ్యుకేట్ అయ్యారు. ఊరికే సరదా కోసం వచ్చే పరిస్థితులు లేవు. టాకులు గట్రాలు చూసుకుని మరీ డిసైడ్ అవుతారు. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలతో ప్రాజెక్టులు చేస్తున్న సితార నుంచి బుట్ట బొమ్మ అన్నప్పుడు మూవీ లవర్స్ లో కొంత ఆసక్తి రేగిన మాట వాస్తవం. అంచనాలేం లేవు కానీ ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమోనని చూశారు
అరకు దగ్గర దూదికొండ అనే చిన్న ఊళ్ళో ఉండే అమాయక అమ్మాయి సత్య(అనీఖా సురేంద్రన్). ఓ రోజు అనుకోకుండా రాంగ్ నెంబర్ డయల్ చేయడం వల్ల ఆటో డ్రైవర్ మురళి(సూర్య వశిష్ట)తో సరదాగా మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. ఈలోగా ఓ పెద్దింటి అబ్బాయితో సత్యకు సంబంధం ఖాయం చేస్తారు తల్లితండ్రులు. మురళిని కలుసుకోవాలని సత్య వైజాగ్ వెళ్తుంది. అక్కడ ఆర్కె అలియాస్ రామకృష్ణ(అర్జున్ దాస్) ఈ జంటతో కలిశాక ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. అసలైన కథకు దారి తీసేదవే
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఇన్స్ టాలు, రీళ్లు, ట్విట్టర్లు, ఫేస్ బుక్కులంటూ వాటి మాయలో పడి సమయంతో పాటు జీవితాన్ని వృధా చేసుకుంటున్న ముక్కుపచ్చలారని యువత ఎందరో ఉన్నారు. వాళ్ళను ఉద్దేశించి ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయోననే ఆలోచనతో ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు మొహమ్మద్ ముస్తఫా మళయాలంలో కప్పేలా తీశారు. పాయింట్ బాగుంటుంది. మనం ఊహించినట్టే సాగుతూ ఎక్కడిక్కడ సడన్ ట్విస్టులతో షాక్ ఇస్తుంది. అందుకే కేరళ జనాలు బాగా ఆదరించారు. ఓటిటిలో వచ్చాక కరోనా లాక్ డౌన్ టైంలో రీచ్ భారీగా వచ్చింది. సహజంగానే తెలుగు ఆడియన్స్ కి దీన్ని అందివ్వాలన్న నిర్ణయం మంచిదే.
దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ పెద్దగా మార్పులు చేయకుండా యధాతథంగా తీసేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. లొకేషన్ల విషయంలో అరకుని ఎంచుకోవడం మంచి ఛాయస్. సింపుల్ గా ఎలాంటి హడావిడి లేకుండా ఆహ్లాదకరంగా ఉండే విజువల్స్ మధ్య హీరోయిన్ తాలూకు కుటుంబాన్ని అక్కడి వాతావరణాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే క్యారెక్టర్లను డిటైల్డ్ గా రిజిస్టర్ చేసే ఉద్దేశంతో సత్య మురళి మధ్య లవ్ ట్రాక్ ని నెమ్మదిగా నడిపించడం ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ కు కారణమయ్యింది. పైగా రెండు పాటలు కూడా పెట్టడం అసలు కథ ఎప్పుడు వస్తుందాని ఎదురు చూసేలా చేసింది. అది మొదలయ్యాక వేగాన్ని ఆశిస్తాం. ఇక్కడా శౌరీ రమేష్ కొంత స్లో అయ్యారు
నిజానికి బుట్టబొమ్మలో సోల్ ఉంది. కాకపోతే నిడివి పరంగా చూసుకుంటే ఇది గంటకు మాత్రమే పనికొచ్చే కంటెంట్. కానీ దానికి రెట్టింపు టైంలో చూపించాలంటే చాలా హోమ్ వర్క్ జరగాలి. సాధారణంగా మల్లువుడ్ మూవీస్ స్లో నెరేషన్ లోనే సాగుతాయి. గాడ్ ఫాదర్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, భీమ్లా నాయక్ ఇలా అన్నిటిలోనూ ఈ నెమ్మదితనం గమనించవచ్చు. అయితే వాటిలో ఉన్న స్టార్ పవర్, కమర్షియల్ ఎలిమెంట్స్ దాన్ని వీలైనంత తగ్గించేస్తూ పాస్ అయ్యాయి. కానీ బుట్టబొమ్మకు అలాంటి ఛాన్స్ లేదు. అనీఖాకు సోలో హీరోయిన్ గా ఇదే మొదటి మూవీ. ఇద్దరు హీరోలకు ఇదే డెబ్యూ. అలాంటప్పుడు వీక్ నెస్ లను కవర్ చేసేంత ఇమేజ్ వాళ్ళకుండదు
సరే బ్యాక్ డ్రాప్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే నడిపించడానికి ఇందులో బోలెడు స్కోప్ ఉంది. థ్రిల్ కలిగించే అవకాశమూ ఉంది. ఇంటర్వెల్ అయ్యాక సత్యకు కలిగే షాక్ ని మంచి సస్పెన్స్ టెంపోలో నడిపించవచ్చు. కానీ అదంత మరీ ఎక్స్ ట్రాడినరీగా ఉండదు. ఉచ్చు నుంచి ఆ అమ్మాయి బయట పడే క్రమాన్ని, ఎదురుకునే మానసిక సంఘర్షణని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయారు. పైగా ఆర్కె పాత్ర పరిచయానికి అంత సమయం తీసుకున్నప్పుడు అసలైన ట్విస్ట్ ఓపెన్ చేసే బ్లాక్ ని ఇంకా ఆసక్తికరంగా మలచాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభావితం చేయలేకపోవడంతో క్లైమాక్స్ కు వెళ్లే క్రమం సాధారణంగా మారిపోయి శుభం పడుతుంది
బుట్టబొమ్మ టైటిల్ కు తగ్గట్టే క్యూట్ గానే ఉంది కానీ దానికి సరిపడా ముస్తాబు పూర్తి స్థాయిలో చేయలేదు. సత్య తండ్రి సగటు మధ్యతరగతి భయస్తుడిగా చూపించినప్పుడు అతనితో పాటు కుటుంబ సభ్యుల భావోద్వేగాన్ని టచ్ చేసేలా రెండో సగంలో ఒకటో రెండో సీన్లు పెట్టి ఉంటే బాగుండేది. ఎంతసేపూ సత్య మురళి ఆర్కె తప్ప మరో ఆర్టిస్టు స్క్రీన్ మీద కనిపించరు. ఒకవేళ ఉన్నా దాని వల్ల కలిగిన ప్రయోజనం తక్కువే. హీరో కాని మరో మూడో హీరోని పెట్టారు కానీ తన ట్రాక్ కూడా చప్పగా ఉంది. అందులో ఆర్టిస్ట్ సెలక్షన్ వల్ల జరిగిన పొరపాటు కూడా ఉంది. ఓటిటి టైపు కంటెంట్ మరీ బోర్ కొట్టకుండా ఉంటే థియేటర్లో చూస్తామంటే బుట్టబొమ్మ ఒకేనే
తెలిసీతెలియని తనంతో కట్టుబాటు మధ్య పెరిగిన అమ్మాయిగా అనీఖా సురేంద్రన్ పాటల్లో పాడుకునే బుట్టబొమ్మలా లేదు కానీ సత్యగా మంచి ఛాయస్ అయితే అనిపించింది. లుక్స్ నటన బాగున్నాయి. అయితే తీయని గొంతు విని హీరో ప్రేమలో పడ్డాడని చూపించినప్పుడు స్వీట్ వాయిస్ ఉన్న డబ్బింగ్ ఆర్టిస్టుని పెట్టుకోవాల్సింది. సూర్య వశిష్ట సర్ ప్రైజ్ ప్యాకేజ్. కుర్రాడు బాగానే ఉన్నాడు చేశాడు. అర్జున్ దాస్ ఎక్స్ ప్రెషన్లను గెడ్డంతో పాటు బేస్ ఎక్కువగా ఉండే అతని గొంతు డామినేట్ చేసింది. టీవీ ఆర్టిస్టు నవ్య స్వామి రెండు మూడు సీన్లకే పరిమితం కాబట్టి ఓకే. పుష్ప ఫేమ్ జగదీష్ లాంటి వాళ్ళను సరిగా వాడుకోలేదు. మిగిలిన తారాగణం దొరికిన కాసింత స్పేస్ లో అలా కనిపించేశారు
సంగీత దర్శకుడు గోపి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చారు. టైటిల్ కార్డులో స్వీకర్ అగస్త్య పేరు కూడా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఇలాంటి సబ్జెక్టుకి హెవీ సౌండ్ అక్కర్లేదు. స్క్రీన్ ప్లే సంభాషణలు సమకూర్చిన గణేష్ రావూరిలో త్రివిక్రమ్ మార్క్ కొంచెం కనిపించింది కానీ కొన్ని సంభాషణలు మాత్రమే పేలాయి. వంశీ పచ్చిపులుసు పరిమితంగా ఉన్న లొకేషన్లు బడ్జెట్ లను దృష్టిలో పెట్టుకుని నీట్ గా కెమెరా వర్క్ నిర్వహించారు. నవీన్ నూలి ఎడిటింగ్ ఫైనల్ లెన్త్ ని రెండు గంటల రెండు నిమిషాలకే పరిమితం చేసింది కనక పెద్దగా ఫిర్యాదు లేదు. సితార ఖర్చు విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోలేదు. వీలైనంత తక్కువలోనే తీశారు కానీ క్వాలిటీ బాగుంది
ప్లస్ పాయింట్స్
మెయిన్ ట్విస్టు
రెండో సగం
అరకు బ్యాక్ డ్రాప్
మైనస్ పాయింట్స్
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం
పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్
నో కామెడీ
నెమ్మదిగా సాగే కథనం
ఫినిషింగ్ టచ్ – మాములు బొమ్మ
రేటింగ్ 2.25 / 5