సమీక్ష: లైగర్

2/5

2 Hr 20 Mins   |   Action   |   25-08-2022


Cast - Vijay Deverakonda, Ananya Panday, Mike Tyson, Ramya Krishna

Director - Puri Jagannadh

Producer - Puri, Charmee, Karan Johar, Apoorva Mehta

Banner - Dharma Productions

Music - Vikram, Tanishk, Sunil Kashyap

ఓ దర్శకుడు తన పనిని పక్కన పెట్టేస్తే, ఓ కథకుడు తన కథను కంచికి పంపేస్తే… డబ్బుల ఖర్చు తప్ప, చేసే పని మీద శ్రద్ద పెట్టడం మానేస్తే… ఓ హీరో గుడ్డి నమ్మకంతో దర్శకుడిని ఫాలో అయిపోతే..ఎం జరుగుతుందో..అదే జరిగింది. అన్ని క్రాస్ బ్రీడ్ లు హై బ్రీడ్ లు కావు అని రుజవయింది. లైగర్ అనే సినిమాతో సినిమా వైకుంఠపాళిలో దర్శకుడు పూరి జగన్నాధ్ పాము నోట్లో పడి కిందకు జారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో ఎక్కిన నిచ్చెనను తానే స్వయంగా తన కాళ్లతో తన్నేసుకున్నాడు. ఈవారం విడుదలైన లైగర్ అనే సినిమా ఇంత దారుణంగా తయారు కావడానికి కర్త, కర్మ, క్రియ కేవలం పూరి జగన్నాధ్ ఒక్కరే. మరే ఒక్కరి తప్పిదం లేదు గాక లేదు.

ఎందుకంటే కథను నిర్లక్ష్యం చేసారు. స్క్రీన్ ప్లేను గాలికి వదిలేసారు. కీలకమైన ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ ఎపిసోడ్ లను చులకనగా చూసారు.హీరోయిన్ ట్రాక్ ను అతి హీనంగా రాసుకున్నారు. సినిమాకు స్టార్ కాస్ట్ పెద్దగా అవసరం లేదనుకున్నారు. విజయ్ దేవరకొండ..రమ్యకృష్ణ..అనన్యపాండే సరిపోతారు. మైక్ టైసన్ వుంటాడు ఎలాగూ అని అంచనా వేసేసారు.

లైగర్ లో కథ అత్యల్పం. లోపాలు అనల్పం. కొడుకును ఎమ్ఎమ్ఎ చాంఫియన్ ను చేయాలని ముంబాయి చేరుకుంటుందో తల్లి (రమ్యకృష్ణ). ఆ తల్లి కొడుకు (విజయ్) బలమైన వీరుడు. అంతకు తగ్గ నత్తి. ఓపక్క మార్షల్ ఆర్ట్స్ శిక్షణ మరో పక్క తన కండలు చూసి ప్రేమలో పడిన అమ్మాయి (అనన్య)తో ముచ్చట్లు. అంతలోనే అమ్మాయి దూరం..విజయం దగ్గర. కానీ మళ్లీ అంతలోనే చిన్న సమస్య. దాన్ని అధిగిమించగానే అమ్మాయి దగ్గరకు. ఇదీ కథ. పూరి జగన్నాధ్ లాంటి కథకుడు ఎల్ కే జి టైమ్ లో రాసి దాచుకుని వుంటారు ఈ కథను. కాలానికి, తన లెవెల్ కు తగినట్లు మార్చుకోకుండానే వండి వార్చేసారు సినిమాను.

లైగర్ సమస్య అంతా సినిమా కథలోనూ, ప్లానింగ్ లోనూ వుంది. హీరోని బలంగా, మాంచి బాడీ లాంగ్వేజ్ తో ప్లాన్ చేసుకుని నత్తి అనే సమస్యను జోడించి కడివెడు పాలలో చిటికెడు విషం చేర్చినట్లు చేసుకున్నారు. ఇదేమైనా ఎమోషనల్ సినిమానా? కాదు కదా? సరదాగా సాగాల్సిన సినిమాలో హీరోకి ఇలాంటి లోపం పెట్టి ఏం సాధించినట్లు?

దర్శకుడు పూరికి మొదటి నుంచి హీరోయిన్ పాత్రల మీద శ్రద్ద పెట్టరు. ఈ సినిమాలో శ్రద్ద పెట్టకపోగా అశ్రద్ద జోడించారు. దాంతో అస్సలు ఆకట్టుకోని విధంగా అనన్యపాండే పాత్ర తయారైంది. ఆ పాత్రకు ఓ పద్దతి..పాడూ లేదు. అలాంటి ప్రేమ వ్యవహారం సినిమా చివర్లో 70ల కాలంనాటి టర్నింగ్ ఇచ్చుకోవడం చూసి నవ్వుకోవడానికి కూడా ప్రేక్షకుడికి ఓపిక వుండదు. ఎందుకంటే అప్పటికీ ఈ అసంబద్ద సినిమా చూసి ప్రేక్షకుడు నీరసంగా కుర్చీకి అంటుకుపోయి వుంటాడు.

హీరో, హీరోయిన్ పాత్రలు, వాటి వైనాలు రెండూ ఇలా విఫలం కావడంతోనే సినిమా సగానికి పైగా గాడి తన్నేసింది. పేరుకు మార్షల్ ఆర్ట్స్ సినిమానే కానీ రెగ్యులర్ సినిమా ఫైట్ల మాదిరిగానే చిత్రీకరించారు. అదేమంటే అన్ని రకాలు కలిసిన ఫైటింగ్ సరళి అని సర్ది చెపుకోవడానికి వుండనే వుంది. తొలిసగం అంతంత మాత్రంగా సాగిపోతుంది. పూరి మార్కు డైలాగులు వినిపిస్తారనుకుంటే ఆయన పాడ్ కాస్ట్ లో డైలాగులు తీసుకువచ్చి ఇందులో కూరేసారు. పెద్దగా ఇంపాక్ట్ కలుగచేయకుండానే తొలిసగం ముగిసిపోతుంది.

మలిసగం అన్నది ఓ దిశ, దశ లేకుండా నడుస్తుంది. చకచకా ఫైట్లు, పాటలు లాగించేసి, చివర్లో తాతలకాలం నాటి ఎపిసోడ్ జోడించి అయిపోయింది అనిపిస్తాడు. కీలకమైన మైక్ టైసన్ ఎపిసోడ్ దారుణంగా వుంది. మైక్ టైసన్ కు బదులుగా బ్రహ్మానందాన్ని ఊహించుకుని ఆ సీన్ రాసి, ఆ తరువాత మైక్ ను పెట్టి చిత్రీకరించారేమో అనిపిస్తుంది.

పూరి మార్కు డైలాగులు వున్నాయి. కానీ అన్నీ ఎప్పుడో ఓసారి వినేసినవే. పాటలు పెద్దగా క్లిక్ కాలేదు. వాటికి ఓ సమయం..సందర్భం లేదు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఏదోగా వుంది. మొత్తం మీద అన్ని విధాలా విఫలమైన సినిమాల జాబితాలో చేరిపోతుంది లైగర్.

ప్లస్ పాయింట్లు

సినిమాకు జరిగిన హడావుడి

మైనస్ పాయింట్లు

సినిమా ఎగ్జిక్యూషన్

ఫినిషింగ్ టచ్: బ్యాడ్ క్రాస్ బ్రీడ్

Rating : 2/5