3.25/5
2 Hrs 07 Mins | Love | 05-08-2021
Cast - Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika Mandanna, Sumanth
Director - Hanu Raghavapudi
Producer - Aswini Dutt
Banner - Vyjayanthi Movies, Swapna Cinema
Music - Vishal Chandrasekhar
బొంబాయి, రోజా లాంటి సినిమాలు చూసిన తరువాత అలా మాంచి భావోద్వేగాలు నిండిన ప్రేమకథలు మనకు ఎందుకు రావు అనే ప్రశ్న వినిపించింది.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలు మన దగ్గరా వచ్చినపుడు, మన ప్రేక్షకులు కూడా ఆదరించినపుడు ఇంకా ఇంకా తీయచ్చు కదా అని కూడా అనిపించింది.
ఇప్పుడు, ఈ వారం హను రాఘవపూడి సీతారామం సినిమా చూసాక, అనుభవం..సామర్థ్యం కలిస్తే వచ్చే అవుట్ ఇది కదా అనిపిస్తుంది ఎవరికైనా.
సమర్థత కలిగిన టెక్నీషియన్లు మనసు పెట్టి పని చేస్తే ఇలా కదా వుంటుంది అనిపిస్తుంది.
దర్శకుడు కథ మీద పూర్తి కసరత్తు చేసి లూజ్ ఎండ్స్ లేకుండా, వెల్ నిట్టెడ్ స్క్రిప్ట్ తయారు చేస్తే ఇలా కదా వుంటుంది అనుకుంటారు ఎవరైనా.
ఒక్క నిమషం సీన్ నుంచి ఫల్ సినిమా అంతా కనిపించే పాత్ర వరకు చేసిన నటీనటలను చూస్తే, వీళ్లను కాక వేరే వాళ్లను తీసుకుంటే ఎలా వుండేది అన్న ఆలోచన రాదు. అంత ఫిట్ గా. సరిపోయిన కాస్టింగ్ చూసి, దర్శకుడి సామర్థ్యం ఇక్కడి నుంచే పని చేయడం మొదలైంది అనేసుకోవాల్సిందే.
సీతారామం కథ చాలా పెద్దది. అనాధ అయిన ఓ సైనికుడిని ఆరాధించే ఓ యువరాణి కథ ఇది. ఈ సైనికుడు ఇరవై ఏళ్ల క్రితం యువరాణికి రాసిన ఉత్తరాన్ని పట్టుకుని వారి ప్రేమకథను వెదుక్కుంటూ వెళ్లిన ఓ అమ్మాయి కథ ఇది. ఇలాంటి రెండు కోణాల నుంచి చూసే ఒక్క కథలో కలసే పాత్రలెన్నో. ఏ పాత్ర కూడా సినిమాటిక్ గా వెళ్లదు. ఎక్కడ కావాలో అక్కడ ప్రవేశిస్తుంది. ఎక్కడ నిష్క్రమించాలో అక్కడ తప్పుకుంటుంది.
సాధారణంగా కనిపించే సినిమాటిక్ అల్లిక సీతారామం కథలో కనిపించదు. నది దాని ప్రవాహాన్ని అది సాగించినట్లు సాగుతుంది తప్ప, మనం చేసే, చేర్చే మలుపులు వుండవు. అందుకే ఈ సినిమా నచ్చుతుంది. మంచి సినిమా చూడాలనుకునేవారికి, గుండెతడిని తడిమి చూసుకోవాలని అనుకోకుండానే అనుకునేవారికి నచ్చుతుంది. సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రేక్షకులు కథాకాలానికి వెళ్లిపోతారు. సీత..రామ్..ఆఫ్రిన్..విష్ణుశర్మ ఇలా ప్రతి పాత్రతో కలిసి నడచి కథలోకి వెళ్లిపోతారు. సినిమా అంతా అయ్యే వరకు అందులోంచి బయటకు రావాలన్నా రాలేరు.
ఆ చమక్కు కేవలం దర్శకుడు హను రాఘవపూడిది మాత్రమే కాదు. దుల్కర్, మృణాల్, రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ దగ్గర నుంచి ఒక్క సీన్ లో కనిపించే రోహిణి వరకు.
పిఎస్ వినోద్, విశాల్ చంద్రశేఖర్ ల దగ్గర నుంచి మాటలు, పాటలు, ఆర్ట్ అందించిన ప్రతి టెక్నీషియన్ వరకు అందరూ కలిసి చేసిన చమక్కు ఇది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు ఇది తమ బెస్ట్..ఇదీ తమ టాలెంట్..ఇదీ తాము ఇవ్వగలిగిన అవుట్ పుట్ అని చెప్పడానికి చేసుకున్న కష్టం.
ఈ పాటలో లైన్ బాగుంది. ఈ మాటలో పదం బాగుంది. ఈ సీన్ బాగుంది అంటూ ముక్కలు ముక్కలుగా చెప్పుకునే వీలు లేదు. ఎన్నాళ్లయిందో ఈ సినిమాలో తొంగిచూసిన సున్నితమైన హాస్యం చూసి. కె.విశ్వనాధ్ సినిమాల్లో కనిపించే తరహా హాస్యం అది. భలేగా పట్టుకున్నారు ఆ స్టయిల్ ను హను రాఘవపూడి. ప్రతి పాత్రకు ఎంచి ఎంచి నటులను తీసుకున్నట్లే, ప్రతి సీన్ కు ఎంచి ఎంచి లొకేషన్లు తీసుకున్నారు. అవన్నీ ప్రేక్షకుడిని ఆ కాలానికి తీసుకుపోతాయి.
ప్రథమార్థం చూసిన అందరూ శహభాష్ అంటారు. ద్వితీయార్థం చూసిన వారిలో సగం మంది ఆ ఎమోషన్ ను, ఆ పెయిన్ ను కాస్త డైజెస్ట్ చేసుకోగలిగితే సూపర్ అంటారు. లేదూ అంటే కాస్త భారం అయింది అంటారు. మతం మత్తును ఎక్కించుకున్న అమ్మాయి చివరిలో దాన్ని వదిలించుకోవడం అన్నది అస్సలు సినిమాటిక్ గా వుండదు. అక్కడేమీ భారీ నేపథ్య సంగీత ఘోష వినిపించదు. ఆ మార్పు అలా అత్యంత సహజంగా జరిగిపోతుందంతే.
ఇలా ఎంత రాసినా రాయమంటుందీ సినిమా. ఎవరినైనా చూడమని చెప్పగలిగే ధైర్యాన్ని ఇస్తుందీ సినిమా. అంతకన్నా ఎక్కువ చెప్పడం కన్నా చూడండి అన్ని ఒక్క మాట చెప్పడం బాగుంటుంది.
ప్లస్ పాయింట్లు
ఎన్నో..ఎన్నెన్నో
మైనస్ పాయింట్లు
సెకండాఫ్ లో కాస్త పెయిన్
ఫినిషింగ్ టచ్
రాముడు.. సీతా అని పిలిచినంత హాయిగా వుండే సినిమా
Rating: 3.25/5
Gulte Telugu Telugu Political and Movie News Updates