ఎల్లుండి విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడి అడ్వాన్స్ బుకింగ్ ఆన్ లైన్ లో మొదలుపెట్టినప్పటికీ టికెట్లు దొరక్క సతమతమవుతున్న వాళ్ళు లక్షలు కాదు దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. అధిక శాతం థియేటర్లు వెనుక వరుసలను బ్లాక్ చేసి కావాల్సిన వాళ్లకు ఇస్తాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఎన్నో షోలు చెక్ చేస్తున్నా హౌస్ ఫుల్స్ కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఈ అవకాశాన్ని వాడుకునేందుకు బ్లాక్ టికెట్ రాయుళ్లు బయటికి వస్తున్నారు. ఒకప్పుడు హాలు బయట జనం మధ్యలో తిరుగుతూ సన్నగా అరుస్తూ అమ్మేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.
పలు కొత్త మార్గాలు ఏర్పడ్డాయి. వాటిలో మొదటిది ఆన్ లైన్. ట్విట్టర్, ఇన్స్ టా లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ని వేదికగా చేసుకుని ఎక్స్ ట్రా టికెట్లు ఉన్నాయి, కావాలంటే మెసేజ్ చేయమని చెబుతారు. అలా కమ్యూనికేట్ చేసిన వాళ్లకు ఫోన్ పే, జిపే నెంబర్ ఇచ్చి డబ్బులు వేయించుకుని తర్వాత స్విచ్ అఫ్ చేస్తారు. రెండోది ఫ్యాన్ అసోసియేషన్ పేరు చెప్పి బెనిఫిట్ షో టికెట్లు ఉన్నాయని రెండు నుంచి అయిదు వేల రూపాయల దాకా రేటు చెప్పి దోచేస్తారు. ఇదంతా ఫోన్ల ద్వారా జరుగుతుంది. అధికారిక గుర్తింపు ఉన్న సంఘాల సభ్యులు కొందరు గతంలో ఇలాంటి దందాలు చేశారు.
టెక్నాలజీ వచ్చాక చాలా చిక్కుముడులు వచ్చాయి. ఉదాహరణకు ఒక ఆన్ లైన్ టికెట్ ని బయటి వ్యక్తి దగ్గర కొన్నప్పుడు అతను మనకు మాత్రమే అమ్మి ఉంటాడనే గ్యారెంటీ లేదు. థియేటర్ కు వెళ్లి కోడ్ స్కాన్ చేసే దాకా నిజం బయటపడదు. తీరా అక్కడికి వెళ్ళాక నిజం తెలిసినా లాభం ఉండదు. సినీ ప్రేమికుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడి సొమ్ములు చేసుకునే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. గుంటూరు కారం తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న టాప్ లీగ్ స్టార్ హీరో సినిమా ఇదే కావడంతో కల్కి ఫీవర్ మాములుగా లేదు. అందుకే అప్రమత్తంగా ఉండటం అవసరం.