నెమ్మదిగా నిచ్చెన ఎక్కుతున్న తార

మొన్న విడుదలైన అన్ని సినిమాల్లో ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది ఆకాశంలో ఒక తారకే. దుల్కర్ సల్మాన్ హీరోగా సాత్విక వీరవల్లిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందించిన ఈ ఎమోషనల్ బయోపిక్ కు సోషల్ మీడియా మద్దతు బలంగా దక్కింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి హత్తుకునే డ్రామా చూడలేదంటూ అధిక శాతం ఆడియన్స్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే విధంగా కథా కథనాలున్నాయని మెచ్చుకున్నారు.

ఇదంతా ఓకే కానీ బుకింగ్స్ పరంగా చూసుకుంటే ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఓం కన్నా ఆకాశంలో ఒక తార కొంచెం నెమ్మదిగా ఉంది. వాటిలో ఉన్న కమర్షియల్ అంశాలు, ట్రెండీ ఎలిమెంట్స్ దుల్కర్ మూవీలో లేవు. దీంతో సహజంగా మాస్ ఆడియన్స్ స్లోగా కదులుతున్నారు. తెలుగు వెర్షన్ కు గత ఇరవై నాలుగు గంటల్లో 70 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోగా తమిళ మలయాళ వెర్షన్లు ఇంకో 30 వేలు నమోదు చేశాయి. మూడు భాషలు కలిపితే లక్షకు పైగా టికెట్లు చాలా మంచి నెంబర్.

ఇవాళ రేపు వీకెండ్ ఆకాశంలో ఒక తారకి చాలా కీలకం కానుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను కనక కదిలించగలిగితే ఈజీగా పోటీలో నెగ్గుకురావచ్చు. టికెట్ రేట్ల పెంపు లాంటి పంచాయితీలు లేవు కాబట్టి ఇరుముడి లాగా ఆ అడ్వాంటేజ్ ని ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి. అయితే జానర్ కున్న పరిమితులు, సాధారణ జనాలు కోరుకునే ఎంటర్ టైన్మెంట్ ఆకాశంలో ఒక తారలో కొంచెం తక్కువగా ఉండటం వల్ల పికప్ ప్రతి షోకు  మెల్లగా పెరుగుతూ వెళ్తోంది తప్ప అనూహ్యంగా కాదు.

కంటెంట్ పరంగా నెగటివ్ రిమార్క్స్ రాకపోవడం ఆకాశంలో ఒక తారకు పెద్ద అడ్వాంటేజ్ కానుంది. అయితే కమర్షియల్ గా పెద్ద స్థాయిలో వెళ్తుందా లేదానేది ఒక వారం ఆగితే కానీ క్లారిటీ రాదు. ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఓమ్ ప్రస్తుతం కొంత ముందంజలో ఉన్నాయి కాబట్టి ఈ మూడు సినిమాల మీద ఒకరి మీద మరొకరి ప్రభావం తప్పకుండా ఉంటుంది. లెక్కల సంగతి పక్కనపెడితే టాలీవుడ్ లో తన ట్రాక్ రికార్డు పట్ల దుల్కర్ సల్మాన్ మటుకు పిచ్చ హ్యాపీగా ఉన్నాడు.