ఎట్ట‌కేల‌కు ప‌రిటాల వార‌సుడి సుడి తిరిగింది!

ప‌రిటాల ర‌వి, ప‌రిటాల సునీతల వార‌సుడు, టీడీపీ యువ‌నాయ‌కుడు ప‌రిటాల శ్రీరామ్‌.. తాజాగా జ‌రిగిన జిల్లా ప‌రిష‌త్‌.. చైర్మ‌న్ ఎంపిక‌లో ల‌క్కు చిక్కించుకున్నారు. శ్రీస‌త్య‌సాయి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా తీవ్ర ఉత్కంఠ న‌డుమ కూట‌మి అధిష్టానం నిర్ణ‌యించింది. ఈ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు పార్టీలోనే సీనియ‌ర్లు పెద్ద ఎత్తున పోటీ ప‌డ్డారు. అయితే.. శ్రీరామ్‌.. ఇటీవ‌ల కాలంలో చూపిస్తున్న చొర‌వ‌, కుటుంబం ప‌రంగా ఇవ్వాల్సిన ప్రాధాన్యం.. జిల్లాలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు వంటివాటిని దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం ప‌రిటాల వార‌సుడికి అవ‌కాశం ఇచ్చింది.

ఫ‌స్ట్ టైమ్‌..

గ‌త 10 సంవ‌త్స‌రాలుగా రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్న ప‌రిటాల శ్రీరామ్‌.. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యారు. అయితే.. ఆ రెండు సార్లు కూడా ఆయ‌న అనుకున్న‌ట్టుగా ఏమీ జ‌ర‌గ‌లేదు. దీంతో ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం(ప్ర‌స్తుతం మంత్రి స‌త్య‌కుమార్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు) టీడీపీ ఇంచార్జ్‌గా నియ‌మించారు. ఈ నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌రిటాల వార‌సుడిగా ధ‌ర్మ‌వ‌రం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ, కూట‌మి పొత్తులో భాగంగా స‌త్య‌కుమార్ కోసం.. బీజేపీ ఈటికెట్‌ను కోర‌డంతో చంద్ర‌బాబు కాద‌న‌లేక పోయారు. ఇలా.. ప‌ది సంవ‌త్స‌రాలుగా ప‌రిటాల రాజ‌కీయంగా అవ‌కాశం కోసం ఎదురు చేస్తున్నారు.

ఇక‌, తాజాగా జ‌రిగిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో న‌ల్ల‌చెరువు జ‌డ్పీ స్థానం నుంచి ప‌రిటాల పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ఆయ‌న‌ప‌రిష‌త్ చైర్మ‌న్ పోస్టును ఆశించారు. కానీ, ఇదేస‌మ‌యంలో మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్లు కూడా పోటీ ప‌డ్డారు. అనేక వ‌డ‌పోత‌ల త‌ర్వాత‌.. ప‌రిటాల పేరును సీఎం చంద్ర‌బాబు ఖ‌రారు చేశారు. ఇక‌, ఇదే అధికారికంగా ప‌రిటాల వార‌సుడికి తొలి ప‌ద‌వి కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఆయ‌న ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌ప‌గ్గాల ద్వారా పార్టీని, మ‌రోవైపు జిల్లా డెవ‌ల‌ప్‌మెంటును స‌మ‌పాళ్ల‌లో ముందుకు తీసుకువెళ్లేందుకు అవ‌కాశం ఏర్ప‌డ‌నుంది.

ఎన్నిక‌ల నాటికి..?

ఇక‌, తాను త‌న తండ్రి పోటీచేసి గెలిచిన ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి తీరాల‌న్న సంక‌ల్పంతో ఉన్న ర‌వి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అసెంబ్లీపైనా దృష్టి పెడుతున్నారు. ప్ర‌స్తుతం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ గా ఎంపికైనా.. ఆయ‌న ల‌క్ష్యం..వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. అసెంబ్లీపైనే ఉంటుంద‌న్న చ‌ర్చ కూడా ఉంది. అయితే.. అప్ప‌టికి ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. కానీ, ప‌రిటాల స‌తీమ‌ణి.. ప్ర‌స్తుత రాప్తాడు ఎమ్మెల్యే సునీత అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్టు త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లోనే ఆమె పోటీ నుంచి త‌ప్పుకొంటాన‌ని చెప్పారు. సో.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిటాల వార‌సుడు రాప్తాడు నుంచి పోటీ చేసే అవ‌కాశాన్ని కొట్టిపారేయలేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.