అనీషా ఆంబ్రోస్ గుర్తుందా..? ‘అలియాస్ జానకి’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయి.. ‘గోపాల గోపాల’ సహా కొన్ని పెద్ద సినిమాల్లో నటించిన ఆశ్చర్యపరిచిన అమ్మాయి. కొన్నేళ్లు బాగానే హైలైట్ అయిన అనీషా.. తర్వాత ఉన్నట్లుండి మాయం అయిపోయింది. పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలయ్యాక ఆమె పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’తో ఆమె రీఎంట్రీ ఇచ్చింది.
‘ఈ నగరానికి ఏమైంది’లో అనీషానే మెయిన్ లీడ్. ఆ పాత్రను సీక్వెల్లోనూ కొనసాగించాలని తరుణ్ భాస్కర్ నిర్ణయించడంతో అనీషాకు మరో అవకాశం దక్కింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనీషా.. పవన్ కళ్యాణ్ మూవీ ‘గోపాల గోపాల’లో నటించొద్దని అప్పట్లో ఇండస్ట్రీ జనాలకు తనకు సలహా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంది.
ఆ టైంలో తాను కథానాయికగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో.. సైడ్ క్యారెక్టర్లు చేస్తే తన విలువ పడిపోతుందంటూ ‘గోపాల గోపాల’ సినిమాలో నటించొద్దని తనకు కొందరు చెప్పినట్లు అనీషా వెల్లడించింది. కానీ తాను మాత్రం ఆ కోణంలో ఆలోచించలేదని ఆమె చెప్పింది. మళ్లీ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్, వెంకటేష్ లాంటి పెద్ద నటులతో సినిమా చేసే అవకాశం తనకు వస్తుందా అని ఆలోచించానని.. కాబట్టి పాత్ర చిన్నదైనా, పెద్దదైనా ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకోకూడదు అనుకుని ‘గోపాల గోపాల’ సినిమాలో నటించానని అనీషా తెలిపింది.
‘గోపాల గోపాల’లో అనీషా చేసింది చిన్న జర్నలిస్ట్ క్యారెక్టర్. ఆమె కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తుందా సినిమాలో. అనీషా చివరగా 2019లో వచ్చిన ‘సెవెన్’ సినిమాలో ఒక కథానాయికగా నటించింది. ఆ తర్వాత ఐదేళ్లకు పైగా గ్యాప్ తర్వాత గోపీచంద్ మూవీ ‘విశ్వం’లో చిన్న పాత్ర చేసింది. మళ్లీ ఇప్పుడు ‘ఈఎన్ఈ రిపీట్’లో షిర్లీ పాత్రలో తళుక్కుమంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates