వాళ్ళముందు మన సంస్కృతిని తక్కువ చెయ్యను: కీర్తి సురేష్

కొన్ని రోజుల ముందు ‘అక్క’ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక చిట్ చాట్‌లో.. రాధిక ఆప్టే తెలుగు సినిమాల మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ‘లెజెండ్’ సినిమా పేరు ఎత్తకుండా.. ఆ సినిమాలో తన మేనమామను పెళ్లాడే పాత్ర చేయడం పట్ల ఆమె వెటకారంగా మాట్లాడింది. తనకంటే చాలా పెద్ద వయస్కుడైన హీరోతో రొమాన్స్ చేయడం గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఐతే సౌత్ ఇండియాలో ట్రెడిషన్ గురించి తెలియకుండా ఇలా మాట్లాడ్డం.. వేరే సినిమాల్లో కూడా ఏజ్ గ్యాప్ ఉన్న హీరోలతో నటించి ‘లెజెండ్’ గురించే తక్కువ చేసి మాట్లాడ్డం పట్ల తెలుగు నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. 

ఐతే ఆ ఈవెంట్‌లో ‘అక్క’ లీడ్ యాక్టర్ కీర్తి సురేష్ కూడా ఉండగా.. ఆమె రాధిక వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని కొందరు తప్పుబట్టారు. అదే సమయంలో ఆమె హుందాగానే వ్యవహరించరిందనే కామెంట్లు కూడా వినిపించాయి. తన కొత్త చిత్రం ‘సత్యవన్ సావిత్రి’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన కీర్తి సురేష్‌కు రాధిక కామెంట్స్ గురించి ప్రశ్న ఎదురైంది. తన పక్కనే ఉన్న మీకు సౌత్ ఇండియన్ ట్రెడిషన్స్ గురించి తెలుసు కదా.. రాధిక కామెంట్లను ఎందుకు ఖండించలేదు అని ఒక జర్నలిస్ట్ అడిగారు. 

దానికి కీర్తి బదులిస్తూ.. ‘‘మామను పెళ్లాడడం గురించి రాధిక చేసిన కామెంట్లు ముందు నాకు అర్థం కాలేదు. కాసేపటి తర్వాత అది అర్థం చేసుకున్నా. అందుకే తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో మేనమామను పెళ్లాడే సంప్రదాయం ఉందని ఆమెకు వివరించే ప్రయత్నం చేశా. కానీ నేను పుట్టి పెరిగిన కేరళలో ఈ ట్రెడిషన్ లేదు. కర్ణాటక సంగతి నాకు తెలియదు. ఆమెకు ఇక్కడి ఆచారం గురించి చెప్పే ప్రయత్నం మాత్రమే నేను చెయ్యగలను. కానీ మీరు అలా ఎలా మాట్లాడతారు అంటూ నిలదీయలేను. నేను నార్త్ ఇండియాకు వెళ్లి సౌత్ సినిమాను, ఇక్కడి ఆచారాలను తక్కువ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయను’’ అని వివరించింది.