చిరు, వెంకీ, చరణ్, తారక్… ఎప్పుడూ అడిగినా సల్మాన్ రెడీ

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు.. టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ లతో ఆయనకు క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. సల్మాన్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినా.. మెగా ఫ్యామిలీలో ఎవరు ముంబయికి వెళ్లినా ఆతిథ్యం, భోజనం లాంటి ఏర్పాట్లు పరస్పరం చేస్తారు. ఈ అనుబంధంతోనే చిరు సినిమా ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ క్యామియో రోల్ చేశాడు.

మరోవైపు సల్మాన్ తో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల వెంకటేష్.. ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’లో ప్రత్యేక పాత్ర చేశాడు. తనకు చిరు, చరణ్ లతో పాటు వెంకీ, తారక్ లతోనూ గొప్ప అనుబంధం ఉన్న విషయాన్ని చెబుతూ వీరిలో ఎవరు ఎప్పుడు అడిగినా.. వారి చిత్రాల్లో క్యామియో రోల్ చెయ్యడానికి తాను సిద్ధమని సల్మాన్ తాజాగా ప్రకటించాడు.

తన కొత్త చిత్రం మాతృభూమి ప్రమోషన్ల కోసం శుక్ర వారం సల్మాన్ హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగు స్టార్లతో తనకున్న ఫ్రెండ్షిప్ గురించి చెబుతూ వారి సినిమాల్లో క్యామియోకు ఎప్పుడైనా రెడీ అని చెప్పాడు సల్మాన్. ఒక మీకు తెలుగులో ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే భలే చమత్కారమైన సమాధానం చెప్పాడు. తెలుగులో తనకు ఇష్టమైన హీరో తనే కావాలనుకుంటున్నట్లు సల్మాన్ చెప్పాడు.

సల్మాన్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని గురించి మాట్లాడుతూ వంశీ గొప్ప దర్శకుడే కాక, మంచి మనిషి కూడా అని… అలాంటి డైరెక్టర్ తో సినిమా చెయ్యడం చాలా సంతోషమని సల్మాన్ చెప్పాడు. హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ను దిల్ రాజు ప్రత్యేకంగా వెళ్ళి కలిశారు. వీరి కలయికలో రూపొందుతున్న సినిమా ఈద్ కానుకగా మార్చిలో రిలీజ్ కాబోతోంది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాతృభూమి’ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.