హనుమాన్ 2… ఊహించని ట్విస్టు

మూడేళ్ళ క్రితం మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సంక్రాంతి రేసులో తలపడి తేజ సజ్జ అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడని ఎవరూ ఊహించలేదు. అయితే హనుమాన్ రూపంలో అద్భుతమే జరిగింది. అంత కాంపిటీషన్ లోనూ మూడు వందల కోట్లకు పైగా వసూలు చేయడం ఒక హిస్టరీ. మాములు టికెట్ రేట్లతో బయ్యర్లకు లాభాల వర్షం కురిసింది. ఇక్కడే కాదు నార్త్ ఆడియన్స్ కూడా బాగా ఆదరించారు. ముఖ్యంగా ఓటిటిలో వచ్చాక హనుమాన్ రీచ్ ఎక్కడికో వెళ్లపోయింది.

తాజాగా హనుమాన్ 2 అనౌన్స్ మెంట్ వచ్చేసింది. వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందబోయే ఈ డివోషనల్ థ్రిల్లర్ కు విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఊరి పేరు భైరవకోన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఈసారి ప్యాన్ ఇండియా మూవీతో రెడీ అవుతున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందబోయే హనుమాన్ 2 వ్యక్తిగతంగా వైష్ణవ్ తేజ్ కు అతి పెద్ద ప్రమోషన్. ఎందుకంటే ఉప్పెన తర్వాత ఆశించిన సక్సెస్ లేక స్ట్రగులవుతున్న ఈ మెగా హీరోకి అత్యవసరంగా బ్రేక్ కావాలి.

ఇక్కడ ట్విస్టు ఏంటంటే హనుమాన్ మొదటి భాగం దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒకపక్క జై హనుమాన్ పేరుతో మైత్రి బ్యానర్ లో భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి కథానాయకుడు కావడంతో బిజినెస్ పరంగా కూడా క్రేజ్ వచ్చింది. ప్రొడక్షన్ ఖర్చు గురించి చెప్పాల్సిన పని లేదు. అది షూటింగ్ జరుగుతుండగానే హనుమాన్ ప్రొడ్యూసర్లు ఇలా హఠాత్తుగా హనుమాన్ 2 ప్రకటించడం వెనుక స్ట్రాటజీ అనూహ్యంగా అనిపిస్తోంది. విడుదల వచ్చే ఏడాది ఉండొచ్చు.

హనుమాన్ రిలీజైన తర్వాత నిర్మాత దర్శకుడి మధ్య విభేదాలు కొన్ని రోజులు హైలైట్ అయ్యాయి. ఆ తర్వాత ఎవరి ప్రొడక్షన్ లో వాళ్ళు బిజీ అయ్యారు. ప్రైమ్ షో నిర్మించిన సంబరాల ఏటిగట్టుని సంక్రాంతికి విడుదల చేస్తుండగా ప్రశాంత్ వర్మ నిర్మించిన మహాకాళి దానికన్నా ముందు అదే పండగని టార్గెట్ చేసుకుని వస్తోంది. ఇదంతా కాకతాళీయంగా జరిగినా జరగకపోయినా మొత్తానికి హనుమాన్ 2 అనౌన్స్ మెంట్ అయితే ఇండస్ట్రీలో, మూవీ లవర్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.