ఒక తెలుగు సినిమాకు యునానిమస్ రివ్యూలు, పబ్లిక్ టాక్ రావడం అరుదు. అది జరిగితే కలెక్షన్లకు అడ్డుకట్ట వేయడం ఎలాంటి పోటీ వల్ల కాదు. నిన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన ఆకాశంలో ఒక తారకు అన్ని వర్గాల నుంచి భేషైన మద్దతు దక్కుతోంది. చాలా బాగుందంటూ, ఎమోషనల్ గా ఇలాంటి కంటెంట్ ఈ మధ్య చూడలేదంటూ చిత్ర బృందంపై కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు. కాంపిటీషన్ లో ఉన్న ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఓమ్ కన్నా మెరుగైన స్పందన దీనికే దక్కడం గమనించాల్సిన విషయం.
జీవితంలో పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్న అమ్మాయి ప్రయాణాన్ని ఎలా నడిపించాలో దర్శకుడు పవన్ సాధినేని చూపించిన తీరు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చప్పట్లు కొట్టించుకుంటోంది. కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి వంద శాతం మార్కులతో పాసైపోగా దుల్కర్ సల్మాన్ మరోసారి తన పెర్ఫార్మన్స్ తో కృష్ణ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అదుర్స్ అనిపించుకున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, శృతి హాసన్ పాత్ర, అందమైన భావోద్వేగాలు ఇంత మంచి టాక్ తీసుకొచ్చాయి.
అయితే ఇదంతా ఆకాశంలో ఒక తారని కమర్షియల్ గా పెద్ద స్థాయికి తీసుకెళ్తుందా లేదానేది వీకెండ్ తర్వాత బయట పడుతుంది. బుకింగ్స్ లో పెరుగుదల క్రమంగా పైకి వెళ్తున్న వైనం బుక్ మై షో లాంటి ప్లాట్ ఫార్మ్స్ లో గమనించవచ్చు. కంటెంట్ ఎంత బలంగా ఉన్నా ఇలాంటివి మాస్ సెంటర్ జనాలను మెప్పించడం అంత సులభంగా ఉండదు. నాని జెర్సీకి ఇలాంటి సమస్య కొంత ఎదురయ్యింది. ఆకాశంలో ఒక తారకు ఈ ఇబ్బంది రాదనే ధీమా ట్రేడ్ వర్గాల్లో వ్యక్థమవుతోంది.
నవంబర్ నెలలో వచ్చిన క్లీన్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తున్న ఆకాశంలో ఒక తార దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ ఫిల్మోగ్రఫీ మరో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోనుంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా లాంటి అగ్ర నిర్మాణ సంస్థల ప్రొడక్షన్ కావడంతో క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద ఈఎన్ఈ 2 స్టడీగా ఉన్న నేపథ్యంలో దుల్కర్ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది వేచి చూడాలి. మలయాళం కన్నా మెరుగ్గా హార్ట్ టచింగ్ మూవీస్ మనమూ తీస్తామని చెప్పడానికి ఆకాశంలో ఒక తార ఉదాహరణగా నిలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates