గుణ్ణం గంగరాజు.. ఈ పేరు ఈ తరం సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 90వ దశకం నుంచి సినిమాలను అనుసరిస్తున్న వారికి, అలాగే టీవీ ప్రేక్షకులకు ఇది సుపరిచితమైన, ఎంతో ఇష్టమైన పేరు. తెలుగు సినిమాకు గర్వకారణంగా కొన్ని సినిమాల వెనుక ఆయనున్నారు. ముఖ్యంగా 90వ దశకంలో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘లిటిల్ సోల్జర్స్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమాలో బన్నీ పాత్ర చేసిన చిన్నారి నటి కావ్యకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కింది.
అంతే కాక ఆ చిత్రం ఆరు నంది అవార్డులు సాధించింది.
ఇక తెలుగు ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్ల జాబితాలో పై వరుసలో ఉండే ఐతే, అనుకోకుండా చిత్రాలను ప్రొడ్యూస్ చేసింది.. ఆ చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించింది కూడా గంగరాజే. ఇంకా అమ్మచెప్పింది లాంటి ఓ మంచి సినిమాను కూడా ఆయన రూపొందించారు. ఇవన్నీ ఒకెత్తయితే… సీరియళ్ల మధ్య అద్భుతమైన వినోదం పంచిన ‘అమృతం’ సీరియల్కు కర్త, కర్మ, క్రియ ఆయనే.
ఐతే క్రియేటివిటీకి మారుపేరైన ఈ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ చాలా ఏళ్ల నుంచి యాక్టివ్గా లేరు. తాను ప్రొడ్యూస్ చేసిన కొన్ని సినిమాలు నిరాశపరచడంతో ఆయన సైడ్ అయిపోయారు. ముఖ్యంగా ‘చందమామలో అమృతం’ సినిమా ఆయన్ని ముంచేసింది. దీంతో సినిమాలకు దూరం అయిపోయారు. పదేళ్లకు పైగా ఆయన లైమ్ లైట్లో లేరు. ఇక మళ్లీ సినిమాల్లో కనిపించరు అనుకుంటే.. బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చారు గంగరాజు.
ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’కు స్క్రీన్ ప్లేతో పాటు మాటలు అందించింది గుణ్ణం వారే. ఈ సినిమా నిన్నటి పెయిడ్ ప్రిమియర్స్ నుంచే అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు రైటింగే ప్రాణం. గంగరాజు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, సూపర్ డైలాగులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పవన్ సాధినేని టేకింగ్ కూడా బాగా కుదరడంతో సినిమా చాలా మంచి టాక్ తెచ్చుకుంటోంది.
చంద్రశేఖర్ యేలేటి లాంటి గొప్ప దర్శకుడిని పరిచయం చేయడమే కాదు.. రాజమౌళి లాంటి మేటి దర్శకుడికి కూడా సినిమా పాఠాలు నేర్పిన ఘనత గంగరాజు సొంతం. తనను అందరూ మరిచిపోయిన టైంలో ఒక మంచి సినిమాతో తనేంటో చాటిచెప్పారు గంగరాజు. ఆయన మళ్లీ లైమ్ లైట్లోకి రావడం తన అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates