ప్రకాష్‌రాజ్‌కు అడ్వాన్సులిచ్చి తీసేసుకున్నారట

ప్రకాష్ రాజ్ స్వతహాగా నటుడైనప్పటికీ.. కొన్నేళ్లుగా సినిమాల కంటే రాజకీయాల మీదే ఆయన దృష్టి ఎక్కువగా ఉంటోంది. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అన్నా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నా ఆయనకు అస్సలు నచ్చదన్న సంగతి తెలిసిందే. గతంలో బెంగళూరు పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయినప్పటికీ.. ప్రకాష్ రాజ్ రాజకీయాలను విడిచిపెట్టలేదు. 

‘జస్ట్ ఆస్కింగ్’ అనే హ్యాష్ ట్యాగ్ జోడించి పదే పదే మోడీ సర్కారును టార్గెట్ చేస్తూ పోస్టులు వేస్తుంటారాయన. బీజేపీతో ఏ పార్టీ జట్టు కట్టినా.. దాన్ని కూడా ఆయన లక్ష్యంగా చేసుకుంటారు. ఏపీలో జనసేన, టీడీపీలను కూడా ఆయన అలాగే టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారనే సీజేపీ ప్రతినిధులతోనూ ఆయన జట్టు కట్టారు. కొన్ని సందర్భాల్లో ప్రకాష్ రాజ్ సెలక్టివ్ క్రిటిసిజం మీద తీవ్ర విమర్శలే వస్తుంటాయి. ఈ ప్రభావం ప్రకాష్ రాజ్ సినీ కెరీర్ మీద కూడా పడుతుండొచ్చనే సందేహాలున్నాయి.

‘స్పిరిట్’ సహా కొన్ని సినిమాల నుంచి ప్రకాష్ రాజ్‌ను తప్పించడానికి ఆయన రాజకీయ వైఖరి, వ్యాఖ్యలే కారణం కావచ్చనే చర్చ జరిగింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ మాటల్ని బట్టి చూస్తే.. ఈ సందేహాలు నిజమే అనిపిస్తోంది. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు గురైనపుడు ప్రకాష్ రాజ్ తీవ్ర మనోవేదన చెందారని.. ఇలా ఎంతకాలం మౌనంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాజకీయ అంశాల మీద మాట్లాడ్డం మొదలుపెట్టారని.. ఆయన తప్పు జరుగుతుంటూ చూస్తూ ఉండలేరని పోనీ వర్మ వ్యాఖ్యానించింది. 

ప్రకాష్ రాజ్ వైఖరి వల్ల బెదిరింపులు ఎదుర్కోవడంతో పాటు అనేక సినిమా అవకాశాలను కూడా కోల్పోయినట్లు ఆమె వెల్లడించింది. కొన్ని సినిమాల నుంచి ఆయన్ని తీసేశారని.. అలాగే అడ్వాన్సులు ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నారని ఆమె చెప్పింది. ఐతే ఏం జరిగినా ప్రకాష్ రాజ్ మాత్రం రాజీ పడే రకం కాదని పోనీ స్పష్టం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ప్రకాష్ రాజ్ మీద వచ్చే వ్యతిరేకత సినిమాల మీదా పడుతుందనే భయం ఆయన్ని తప్పించడానికి కారణంగా భావిస్తున్నారు.