కమల్ హాసన్ నిజంగా అసాధ్యులే

లోకనాయకుడు కమల్ హాసన్ లేట్ ఏజ్ లోనూ తనదైన ప్లానింగ్ తో వాహ్ అనిపిస్తున్నారు. ఇది కేవలం సినిమాల్లో నటించడం గురించి చెప్పడం లేదు. ఒక నిర్మాతగా ఈ వయసులో సెట్ చేస్తున్న ప్రాజెక్టులు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో ధర్మన్ తీస్తున్న ఆయన ఇంకోవైపు శివ కార్తికేయన్ తో సియోన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండింటి మీద సుమారు ఏడు వందల కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంచనా. బిజినెస్ పరంగా అప్పుడే డిమాండ్ ఏర్పడింది.

ఇవి కాకుండా కమల్ రజని కలిసి నటించే మల్టీస్టారర్ లో హీరోగా భాగం కావడం ద్వారా లోక నాయకుడికి కెరీర్ మొత్తంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుతోందని చెన్నై మీడియా టాక్. ఇది కోలీవుడ్ కు తొలి వెయ్యి కోట్ల సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇక్కడితో ఆయన ఆగడం లేదు. తాజాగా చిరంజీవిని తన సంస్థలో ఒక సినిమా చేసేందుకు ఒప్పించారట. ఇటీవలే షూటింగ్ జరుపుకున్న మెగా వర్స్ టాక్ షోలో ఆ మేరకు అందరి ముందు హామీ తీసుకున్నారు. దర్శకుడు లాక్ అయితే త్వరలోనే ప్రకటన రావొచ్చు.

ప్రొడ్యూసర్ గా చాలా అరుదైన కలయికలు సెట్ చేసుకుంటున్న కమల్ హాసన్ త్వరలో భారతీయుడు 3లో కనిపించబోతున్నారు. ఇక ఎప్పటికీ రాదేమో అనుకున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ ఎట్టకేలకు మోక్షం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు కానీ సాధ్యపడేలా లేదు. విఎఫ్ఎక్స్ పనులతో పాటు కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉందట. కమల్ సహకరిస్తే త్వరగా పూర్తి చేస్తానని దర్శకుడు శంకర్ ప్రామిస్ చేసినట్టు వినికిడి.

ఏదైతేనేం తన సమకాలీకులైన సీనియర్ హీరోలు కేవలం నటనకే పరిమితమైన టైంలో కమల్ హాసన్ ఇలా నిర్మాతగా ఇంత వేగంగా ఉండటం మెచ్చుకోవాల్సిన విషయమే. అయితే రజనీకాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నట్టు చిరంజీవితో కూడా తెరను పంచుకుంటే సినీ ప్రియులకు ముచ్చటగా ఉంటుంది. ఎప్పుడో 1979 ఇది కథ కాదు తర్వాత వీళ్ళిద్దరిని తెరమీద చూసింది లేదు. మరి కాంబోలో యాక్ట్ చేస్తారా లేదానేది మెగావర్స్ ఫుల్ ఎపిసోడ్ చూశాక క్లారిటీ రావొచ్చు.