వయొలెంట్ క్లాష్… భోగి VS మైసా

నవంబర్ ఏదో డ్రై నెల అంటారు కానీ ఈసారి మటుకు ప్రతివారం బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీ నెలకొంటోంది. ఎన్ని రిలీజైనా కనీసం రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి థియేటర్లలకు ఆక్సీజెన్ ఇస్తున్నాయి. వందల కోట్ల కలెక్షన్లు కాదు కానీ ఇలాంటి టైంలో ఎంత బూస్ట్ కావాలో అంతకన్నా ఎక్కువే దక్కుతున్న వైనం నెంబర్లలో చూడొచ్చు. వచ్చే వారం నవంబర్ 27 ఒక వయొలెంట్ క్లాష్ జరగనుంది. శర్వానంద్, రష్మిక మందన్న నువ్వా నేనా అంటూ కవ్వించుకోబోతున్నారు.

దీని వెనుకో విశేషం ఉంది. భోగి, మైసా రెండు కూడా ఇంటెన్స్ హింసను ఆధారంగా చేసుకుని రూపొందాయి. ముఖ్యంగా లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్న హీరో / హీరోయిన్ ఒక వెనుకబడిన వర్గానికి చెందడం, అణిచివేత నుంచి తిరుగుబాటు పుట్టి, తలలు నరికి తమ జాతిని రక్షించుకోవడానికి ఎంతటి రక్తపాతానికైనా వెనుకాడకపోవడం రెండు సినిమాల్లో కనిపిస్తోంది. డ్రామా, ఎమోషన్లు, నెరేషన్ వేర్వేరుగా ఉంటాయి కానీ మెయిన్ పాయింట్ మటుకు పోలికల పరంగా కొంచెం దగ్గర అనిపిస్తోంది.

రెండు సినిమాల్లో క్లైమాక్స్ గురించి ఓ రేంజ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటిదాకా తెలుగు తెరమీద చాలా అరుదుగా చూసిన చివరి ఘట్టాల్లో ఇవి నిలుస్తాయని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే భోగిని సీనియర్ దర్శకుడు సంపత్ నంది హ్యాండిల్ చేస్తే మైసాకు ఇంకా అప్ కమింగ్ స్టేజిలో ఉన్న రవీంద్ర పుల్లే డైరెక్ట్ చేశారు. ప్రమోషన్ల విషయంలో రెండూ ఇంకా పికప్ కావాల్సి ఉంది. చివరి దశ పనుల్లో బిజీగా ఉండటం వల్ల పబ్లిసిటీ మీద దృష్టి పెట్టడం లేదు.

ఆ తర్వాతి వారం నాగచైతన్య వృషకర్మ వస్తుంది కాబట్టి భోగి, మైసాకి మొదటి వారం చాలా కీలకం కానుంది. నిజానికి భోగిని డిసెంబర్ 11కి వేసి ప్రమోషన్లకు తగినంత సమయం ఉంచుకుందామని నిర్మాత అనుకున్నారట. కానీ ఓటిటి డీల్ తో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఈ నెలాఖరుకే రావాల్సి వస్తోంది. హైప్ పరంగానూ భోగి, మైసాలు భీభత్సమైన అంచనాలు మోయడం లేదు. ఇప్పుడిప్పుడే పెంచుకునే పనిలో ఉన్నాయి. అవి కనక క్లిక్ అయితే మంచి ఓపెనింగ్స్ చూడొచ్చు. అటుపై టాక్ కీలకం.