ఎట్టకేలకు ఇద్దరు మిత్రుల సినిమా?

టాలీవుడ్లో అడివి శేష్.. రాహుల్ రవీంద్రన్.. వెన్నెల కిషోర్.. సుజీత్.. ఈ నలుగురూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. వీళ్లను ఫాలో అయ్యే అభిమానులకు కూడా వీళ్ల స్నేహం గురించి ఐడియా ఉంది. తరచూ కలిసి చిల్ అయ్యే ఈ మిత్రులు.. అవతలి వాళ్ల సినిమాల కోసం తమ వంతుగా చేయాల్సిన సాయం కూడా చేస్తుంటారు. ఐతే ఈ మిత్రులు కలిసి సినిమాలు చేయడం మాత్రం అరుదే. 

బిజీ యాక్టర్ కావడం వల్ల వెన్నెల కిషోర్.. మిగతా వాళ్ల సినిమాల్లో నటిస్తుంటాడు కానీ.. వేరే కాంబినేషన్లను మాత్రం చూసే అవకాశం రాలేదు. ఐతే ఇప్పుడు అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ కలిసి ఒక సినిమాకు రెడీ అవుతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. రాహుల్ దర్శకత్వంలో శేష్ సినిమా చేయడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి కానీ.. ఎందుకో కుదరలేదు. కానీ ఇప్పుడు ఈ కాంబోకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

జయ జానకి నాయక, అఖండ లాంటి చిత్రాలను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి.. రాహుల్ రవీంద్రన్, అడివి శేష్ కాంబినేషన్లో సినిమాను నిర్మించబోతున్నట్లు వెల్లడైంది. నటుడిగా పరిచయం అయిన రాహుల్.. చాలా ఏళ్లకు ‘చి ల సౌ’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా సర్ప్రైజ్ హిట్ అయింది. తర్వాత ‘మన్మథుడు-2’తో తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ.. ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు రాహుల్. ఇప్పుడు తన మిత్రుడు శేష్‌తో సినిమా తీయబోతున్నాడతను. 

శేష్ సినిమాల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘డెకాయిట్’ మూవీతో పలకరించిన అతను.. తన కెరీర్లోనే అత్యధికంగా వంద కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ-2’ మీద ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఆ సినిమా పూర్తి చేశాక రాహుల్ రవీంద్రన్ సినిమాను శేష్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.