మూడు వారాలకే ఇంటికొస్తే ఎలాగయ్యా

విశ్వక్ సేన్ చాలా ఇష్టపడి కష్టపడి తీసిన సినిమా కల్ట్. టాలీవుడ్ తొలి స్లాషర్ మూవీగా ప్రమోషన్లు కూడా గట్టిగా చేశాడు. థియేట్రికల్ గా ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. విపరీతమైన హింస ఉందని ముందే చెప్పడంతో ఫ్యామిలీస్, పిల్లలు దూరంగా ఉండగా మితిమీరిన హింస ఇటు మాస్ జనాలను కూడా మెప్పించలేకపోయింది. ఫలితంగా స్వీయ దర్శకత్వంలో తీసుకున్న కల్ట్, విజయం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న విశ్వక్ సేన్ కు హీరో కం డైరెక్టర్ గా మరో డిజాస్టర్ అందించింది.

కట్ చేస్తే కేవలం మూడు వారాలకే కల్ట్ ఓటిటిలో వచ్చేసింది. చెప్పా పెట్టకుండా నిన్న అర్ధరాత్రి నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ పెట్టేశారు. మాములుగా ఇలాంటి సినిమాలకు కొంచెం ప్రీ స్ట్రీమింగ్ పుష్ అనేది సంస్థ వైపు నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. కానీ అలాంటి ఊసే లేకుండా విశ్వక్ మరో మూవీ ఈ నగరానికి ఏమైంది రిపీట్ రిలీజ్ రోజే దీన్ని హఠాత్తుగా తేవడం గమనార్హం. తెలుగుతో పాటు హిందీ తమిళ డబ్బింగ్ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. డిజిటల్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

ఏది ఏమైనా వెబ్ సిరీస్ లో చూసి చూసి విసుగెత్తిన ఇలాంటి స్లాషర్ వయొలెన్స్ ని తెరమీద చూపించాలనుకోవడమే విశ్వక్ చేసిన పెద్ద పొరపాటు. సబ్జెక్టు రాసుకున్న విధానం, హ్యాండిల్ చేయడంలో తడబాటు లాంటి కారణాలు రిజల్ట్ మీద ప్రభావం చూపించాయి. ఇంతా చేసి కేవలం ఇరవై రోజుల సంబరానికి డిజిటల్ లో వచ్చేయడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఫ్లాప్ అవ్వొచ్చు కానీ ఇలా గుర్తింపు ఉన్న హీరోల సినిమాలు ఇంత త్వరగా ఓటిటికి రిలీజ్ చేస్తే తర్వాతి వాటిపై ప్రభావం పడుతుంది.

దీని సంగతలా ఉంచితే విశ్వక్ సేన్ కు ఈ నగరానికి ఏమైంది రిపీట్ టాక్ కొంచెం రిలీఫ్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రీమియర్ టాక్స్ డీసెంట్ గా ఉన్నాయి. తిరిగి తక్కువ గ్యాప్ లో లెగసితో ఫిబ్రవరిలో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు విశ్వక్. వివిధ జానర్లు ట్రై చేస్తూ పెద్ద హిట్టు కోసం చూస్తున్న విశ్వక్ కు ఈఎన్ఈ 2 కనక హిట్టు క్యాటగిరీలో పడితే తిరిగి ఊపందుకోవచ్చు. లైలా, ఫంకీ దెబ్బకు తను ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఇప్పుడు క్రమంగా సెట్టయ్యే ఛాన్స్ దొరికింది.